close

బుధవారం, నవంబర్ 13, 2019

ప్రధానాంశాలు

కొత్త పురాలకు వెసులుబాటు

● అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఆమోదం

● ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలకు లబ్ధి

ఈనాడు డిజిటల్‌, నాగర్‌కర్నూల్‌

వడ్డేపల్లి పురపాలక సంఘం.. వడ్డేపల్లి పురపాలక సంఘం పరిధిలో వెలసిన అక్రమ లేఅవుట్లు

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోమారు పచ్చజెండా ఊపింది. గతంలో ఈ పథకాన్ని అన్ని పురపాలికలకు వర్తింపజేయగా.. ఈ సారి మాత్రం నిబంధనలను కొంత సవరించారు. 2018 ఆగస్టు 2న ఏర్పడిన కొత్త పురపాలికలకు మాత్రమే వర్తించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. క్రమబద్ధీకరణ పథకం అమలుతో కొత్త పురపాలికలు ఆదాయాన్ని సమకూర్చుకొనే మార్గాలు మెరుగుపడ్డాయి. గతేడాది మార్చి 30వ తేదీ లోపు రిజిస్ట్రేషను చేసుకున్న లేఅవుట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 19 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ఏర్పడిన తొమ్మిది పురపాలికలు తాజా క్రమబద్ధీకరణ విధానం పరిధిలోకి రానున్నాయి. వాస్తవానికి.. గతేడాది ప్రభుత్వం కొత్త పురపాలికల ప్రకటన జారీ చేయగానే ఆయా ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారుల పుణ్యమా అంటూ ఎందుకూ పనికిరాని భూములకు సైతం రూ.లక్షల్లో ధరలు పెంచేశారు. దీంతో పలుచోట్ల అక్రమ లే అవుట్లను ఏర్పాటుచేసి ఇంటిస్థలాలకు విక్రయించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న భూములను స్థిరాస్తి వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి భూముల్లో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే ప్లాటు వస్తుందని, వాయిదా సొమ్ము చెల్లింపు పూర్తికాగానే అన్ని అనుమతులు వచ్చేలా చూస్తామని అమాయకులను నమ్మించి విక్రయించినా ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు, సౌకర్యాలు కల్పించలేదు. నాలుగు రాళ్లు హద్దులుగా చూపిస్తూ ఇదే మీ ప్లాటు స్థలమని అడ్డగోలుగా అంటగట్టారు. తాజా క్రమబద్ధీకరణ పథకం వర్తించనున్న జాబితాలో కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత, మక్తల్‌, భూత్పూర్‌, కోస్గి, వడ్డేపల్లి, అలంపూర్‌ పురపాలికలు ఉన్నాయి. వీటిలో జాతీయ రహదారి మీద ఉన్న భూత్పూరు, కొత్తకోట పురపాలికల పరిధిలో అక్రమ లేఅవుట్లు భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నాలా కింద మార్చకుండానే.. : వ్యవసాయ భూమిని గృహ అవసరాలకు వాడుకోవాలంటే.. ముందుగా నాలా (వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా) కింద మార్చాలి. అనంతరం లేఅవుట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం లేఅవుట్‌లో 10 శాతం భూమిని ఓపెన్‌ ల్యాండ్‌ కింద సంబంధిత గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషను చేయాలి. 30 నుంచి 40 అడుగుల వెడల్పుతో రోడ్లు, వాటికి ఇరువైపులా విద్యుత్తు, వీధిదీపాలు, మురుగు కాలువల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలి. అప్పుడే దానిని లేఅవుట్‌గా గుర్తించి ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆచరణలోకి వస్తే.. చాలాచోట్ల సంబంధిత అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై అక్రమ లేఅవుట్లతో లక్షలు గడించారు.

భారీగా అక్రమ లేఅవుట్లు .. ఉమ్మడి జిల్లాలో ఏడాది కిందట ఏర్పాటైన తొమ్మిది కొత్త పురపాలికల్లో అక్రమ లేఅవుట్లు భారీగా వెలిశాయి. ఏడాదిగా ఇందులో ఏ ఒక్క లేఅవుట్‌కు కూడా పూర్తిస్థాయి అనుమతులు తీసుకోకపోవడం శోచనీయం. కొంతమంది యజమానులు మటుకు నామమాత్రంగా దరఖాస్తు చేసుకుకొని విక్రయాలకు పాల్పడ్డారు. కొత్త పురపాలికల పరిధిలో దాదాపు 250కి పైగా లే అవుట్లు ఉన్నట్లు ఆయా జిల్లాల కంట్రీ టౌన్‌ప్లానింగు అధికారులు గుర్తించారు. పేరుకు మాత్రం లేఅవుట్‌ అని చెబుతున్నా.. అందులో ఎక్కడా అంతర్గత రహదారులు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలను కల్పించలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.