close

శుక్రవారం, నవంబర్ 22, 2019

ప్రధానాంశాలు

పైసల్లేకున్నా.. క్యాంటీన్‌లో తినొచ్చు!

నలుగురు ఇంజినీరింగ్‌ యువకుల సరికొత్త ప్రయోగం
ఈనాడు, హైదరాబాద్‌

బాగా ఆకలేస్తోంది.. పర్సు ఖాళీ.. జేబులు వెతికినా ప్రయోజనం శూన్యం.. అమ్మానాన్న ఇచ్చిన పాకెట్‌ మనీ అయిపోయిందని అప్పటికిగానీ గుర్తుకు రాదు. కళాశాల క్యాంటీన్‌లో అప్పు పెట్టరు.. మరి కడుపు నిండేదెలా. ఓస్‌.. ఇంతేగా! మీ సమస్య మేం తీర్చేస్తాం. ఎంచక్కా మీ క్యాంపస్‌లోని హోటల్‌లో దర్జాగా ఇష్టమైన రుచులు ఆస్వాదించవచ్చు. డబ్బులు లేకపోయినా మేమే అప్పిస్తాం. మీ వద్ద ఉన్నపుడు తీర్చేయవచ్చు..! ఇదేదో.. బంపర్‌ ఆఫర్‌ అనిపిస్తుంది కదూ! కేవలం విద్యా సంస్థల్లోని విద్యార్థులకు నగదు రహిత సేవలు అందించాలనే సంకల్పంతో.. నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎవరీ విద్యార్థులు.. ఏమా సాంకేతికత.. తెలుసుకుందామా...!


ఆలోచన తట్టిందిలా!

శ్రీవాసు, శ్రీధర్‌రెడ్డి, శ్రీహర్ష, రాజదత్త మనోహర్‌.. వీరిలో ముగ్గురు ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. రాజదత్త ఈసీఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనసుకు ఇబ్బంది కలిగిస్తాయి. మరి కొన్ని మాత్రం బుర్రలో కొత్త ఆలోచనలు వచ్చేందుకు సహాయపడతాయి. అలా తమకు ఎదురైన అనుభవమే ‘ఫ్యాట్‌క్యాట్‌’ అంకుర సంస్థ ఏర్పాటుకు బీజం వేసిందంటాడు సంస్థ సీఈవో శ్రీవాసు బోగ. ఒకరోజు తరగతులు పూర్తయ్యాక మంచి ఆకలితో కాలేజీ క్యాంటీన్‌కు వెళ్లాం.. ఏదైనా తిందామని పర్సు చూస్తే.. నవ్వొచ్చిందంటాడు. ఇంటి నుంచి వచ్చిన డబ్బులు అయిపోయాయి.. ఎవరి జేబులోనూ అవసరమైన మేర డబ్బులు లేవు.. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిద్దామంటే ఆక్కడ ఆ అవకాశమే లేదు. అలాంటి అనుభవం నుంచి బుర్రకు తట్టిన ఆలోచనకు తాము ఆచరణ రూపం ఇచ్చామంటారీ యువకులు.


కళాశాలల్లోకి ఈ-వ్యాలెట్‌..

సాంకేతిక పరిజ్ఞానం విస్తరించాక ఇప్పుడు అంతటా డిజిటల్‌ మార్గాల్లోనే లావాదేవీలు జరుగుతున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో మాత్రం విద్యార్థులు ప్రతి చిన్న అవసరానికీ నగదు చెల్లించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వాటిలో ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్‌, కొన్ని సీబీఎస్‌ఈల్లో మాత్రమే నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నమే తమ ఇ-వ్యాలెట్‌ ఆలోచన అని శ్రీవాసు వివరించారు.


పిన్‌ నంబరుతో లావాదేవీలు

విద్యా సంస్థల్లో క్యాంటీన్లు, జ్యూస్‌ సెంటర్లు, స్టేషనరీ వద్ద ‘ఫ్యాట్‌క్యాట్‌’ వాలెట్‌ ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. మొబైల్‌ ఫోన్లు, కార్డులు ఉపయోగించాల్సిన పనిలేదు. కేవలం పిన్‌ నంబరు ద్వారా సులువుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ సేవలు ఉపయోగించుకునే క్యాంటీన్లు, స్టేషనరీ నిర్వాహకులు మొబైల్‌ ట్యాబ్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో తాము ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాట్‌క్యాట్‌ సాఫ్ట్‌వేర్‌ పొందుపరుస్తామంటున్నారు నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లాలోని వర్ధమాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల క్యాంటీన్‌లో తొలుత తమ సేవలు ప్రారంభించామన్నారు. ఈ సేవలకు నిర్వహణ ఖర్చు కూడా ఉండదంటున్నారు. ముందుగా విద్యార్థులు కొంతమేర నగదులు తమ వ్యాలెట్‌లో నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. తరువాత కావాలంటే అప్పు కూడా ఇస్తామని వివరించారు. ఇన్‌స్టంట్‌ పాస్‌, వీక్లీ పాస్‌, మంత్లీ పాస్‌లను అందిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.