close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

సాగర మథనం!

● ఉప రాష్ట్రపతి ఆరాతో అధికారుల్లో హడావుడి

● తాజాగా ఎన్‌ఐవోటీ అంశం తెరపైకి

● నిన్నటి వరకు నిర్లిప్తత

● భూసేకరణ పూర్తయితే చిక్కుముడి వీడినట్లే

● పరిశోధనలకు ఆస్కారం

ఈనాడు, నెల్లూరు-న్యూస్‌టుడే, వాకాడు, కోట: ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐవోటీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ) ఏర్పాటు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంపై సంబంధిత ముఖ్య అధికారులతో మాట్లాడటంతో జిల్లా యంత్రాంగంలో కదలిక మొదలైంది. పూర్తికి కృషి చేయాలన్న సూచన నేపథ్యంలో ఆ మేరకు జిల్లా అధికారులు ఇటీవల సమీక్షలు చేపట్టారు. క్షేత్రస్థాయి అధికారులతో కలసి వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సమస్య నెలకొన్న భూములకు సంబంధించి యజమానులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిహారం వ్యవహారంపై ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోమారు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎన్‌ఐవోటీపై తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రతి అంశం పరిశీలన

మొత్తంగా సముద్రంలోని ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించి ఆ మేరకు సమాచారం అందిస్తుంది. ఎంతో కీలకమైన ఈ ఎన్‌ఐవోటీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా.. ప్రాంతీయ కార్యాలయం చెన్నైలో కొనసాగుతోంది. వీటి అనుబంధంగానే నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. ఆ మేరకు 2015 ఏప్రిల్‌ 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడుమరో మంత్రి సుజనాచౌదరి శంకుస్థాపన చేశారు.

భూములే సమస్య

ఎన్‌ఐవోటీీకి భూముల సేకరణే ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ మొత్తం 200 ఎకరాల్లో కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. ఆ మేరకు 153 ఎకరాలు సేకరించగా మిగిలిన భూమి పరంగా ఇబ్బంది ఏర్పడింది. సంబంధిత భూములకు చెందిన వ్యక్తులు పరిహారం చాలదని కోర్టుకెళ్లారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ పరిణామంతో ప్రక్రియ అడుగుకు చేరింది. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ప్రాజెక్టు స్తబ్ధుగా ఉండిపోయింది. ఈ కేంద్ర ఉద్యోగుల నివాస గృహాలు, పరిపాలనా భవనం కోసం కోట మండలం చిట్టేడు వద్ద 59.19 ఎకరాలను సేకరించి అప్పగించారు. ఇక్కడ ఎలాంటి సమస్య లేకపోవడంతో రూ.కోట్లు వెచ్చించి సదరు నిర్మాణాలను అధికారులు పూర్తిచేశారు. ప్రస్తుతం అవన్నీ ప్రారంభానికి ఎదురు చూస్తున్నాయి.

●*ఈ విషయమై వాకాడు తహసిల్దార్‌ రాంభూపాల్‌రెడ్డితో ‘ఈనాడు’ మాట్లాడగా.. భూసేకరణ సమస్యను ఉన్నతాధికారుల సూచన మేరకు కొలిక్కి తెచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్బంది ఉన్న 56 ఎకరాలకు సంబంధించి.. సదరు వ్యక్తులతో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తూపిలిపాళెం వద్ద ఎన్‌ఐవోటీ ఏర్పాటు చేయాలనుకున్న స్థలం

ఇదీ పరిస్థితి!

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా నిన్నటి వరకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నా.. జాతీయస్థాయిలో భరోసా దక్కుతున్నా ఎన్‌ఐవోటీ భూసేకరణలో ఇబ్బందులు ప్రధాన సమస్యగా మారాయి. శంకుస్థాపన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం అరకొరగానే కనిపిస్తోంది. ఎన్‌ఐవోటీ సముద్రగర్భంలో జరిగే మార్పులపై పరిశోధనలు, అధ్యయనం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సముద్రం అట్టడుగున లభించే సహజ వనరులు, ఖనిజాలతో సహా ఇతర అంశాలపై ఈ సంస్థ లోతైన పరిశోధనలు జరుపుతుంది. తుపానులు, సునామీలతో సహా ఇతర ఉపద్రవాల రాకనూ గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.