ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలి విజ్ఞప్తి చేసిన ప్రమాద బాధితుల కుటుంబసభ్యులు, సంబంధీకులు
కాచిగూడ, న్యూస్‌టుడే: లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద కర్నూల్-సికింద్రాబాద్ ఇంటర్సిటీ (హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, వారి సంబంధీకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారు కోలుకోవడాని నెలలు పడుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వారు గాయపడి మంచం పట్టడంతో తమకు దిక్కెవరని ఆందోళనను వెలిబుచ్చారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) రాంక్రిపాల్, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ (సీఎస్‌వో) సంజీవ్ అగర్వాల్ బృందం, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) సీతారాంప్రసాద్, ఏడీఆర్ఎం (ఇన్ఫ్రా) సాయిప్రసాద్ తదితర అధికారుల సమక్షంలో రైలు ప్రమాద బాధితులను బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
రెండు కాళ్లు విరిగాయి: బాధితురాలు బాలేశ్వరమ్మ కొడుకు రవీంద్రనాథ్, అమరచింత, వనపర్తి

వనపర్తి రోడ్ నుంచి కాచిగూడకు హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలులో అమ్మ ఆరోగ్య పరీక్ష కోసం వస్తున్నాం. ఈ ప్రమాద ఘటనలో అమ్మ రెండు కాళ్లు బెంచీ కింద ఇరుక్కుపోవడంతో విరిగిపోయాయి. ఎడమ కాలికి మూడు శస్త్ర చికిత్సలు చేశారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. తమకు వైద్య సేవలు అందజేయడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకోవాలి. |
కుటుంబానికి పెద్ద దిక్కు
ప్రమాద బాధితుడు శేఖర్ భార్య సుకన్య, బౌద్ధనగర్, వారాసిగూడ

నా భర్త శేఖర్ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ రైలులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రెండు కాళ్లు విరిగిపోవడంతో నాలుగు శస్త్రచికిత్సలు చేశారు. కోలుకోవడానికి ఏడాది పడుతుందని వైద్యులు చెబుతున్నారు. తనతో పాటు ముగ్గురు పిల్లలు, అత్త.. అంతా ఆయన సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నాం. తమకు ఆదుకోవడంతో పాటు ఉపాధి కల్పించాలి. |
సోదరే పెద్ద దిక్కు: బాధితురాలు అనూరాధ సోదరుడు అరుణ్‌కుమార్, మందొడ్డి, రాజౌళి మండలం, గద్వాల్

బావ చనిపోవడంతో ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి సోదరే పెద్ద దిక్కు. కూలీ పనుల కోసమని ఆమె గద్వాల నుంచి కాచిగూడకు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో వస్తుంది. ప్రమాద ఘటనలో ఆమె ఎడమ కాలు విరిగింది. 6 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆమె పనిచేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి. రైల్వే అధికారులు ఆర్థికంగా ఆదుకోవాలి. |
కుడి కాలికి గాయం: మహమ్మద్ మహమూద్ అలీ, డీసీఎం డ్రైవరు, సీతాఫల్మండి

లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌లో సీతాఫల్మండి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్నాను. కాచిగూడ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో కుడి కాలికి గాయమైంది. నడవడమే కష్టంగా ఉంది. డీసీఎం వాహనాన్ని నడపడమెలాగో అర్థం కావడం లేదు. |
నడవలేక పోతుంది: బాధితురాలు సుష్మిత(5) మేనమామ గోపాల్, మందొడ్డి, రాజౌళి మండలం, గద్వాల్

మేనకోడలు సుష్మిత అమ్మానాన్నలతో కలిసి గద్వాల నుంచి కాచిగూడకు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో వస్తోంది. ప్రమాదంలో సీటు కింద కాలు ఇరుక్కుని తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. |