శుక్రవారం, డిసెంబర్ 13, 2019
నగర యువతపై డయాబెటిక్ పంజా
మూత్రపిండాలు, గుండెజబ్బులకు ప్రధాన కారణం
ఆహారపు అలవాట్లు, క్రమబద్ధ జీవనంతో ఫలితాలు
నేడు ప్రపంచ మధుమేహ దినం
ఈనాడు, హైదరాబాద్: భాగ్యనగరానికి డయాబెటిక్ రాజధానిగా పేరుంది. ఈ వ్యాధి ఏటా చాప కింద నీరులా విస్తరిస్తోంది. 25-30 ఏళ్ల యువత సైతం వ్యాధి బారిన పడుతున్నారు. వారు తెలుసుకునే లోపే తీవ్ర నష్టం జరుగుతోంది. మూత్ర పిండాలు దెబ్బతినడం లేదంటే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2030 నాటికి నగర జనభాలో 50 శాతం మందికి ఈ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యువతలో వేగంగా ఆహారపు అలవాట్లు మారిపోవడం, జంక్ఫుడ్స్, నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి తదితరాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడో 50-60 వయస్సు వారికో మధుమేహం వచ్చేది. ప్రస్తుతం అది 25-30 ఏళ్ల వయస్సులోనే కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తం కాకపోతే...మున్ముందు భారీ మూల్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురువారం ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా నగరంలో వ్యాధి పరిస్థితి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారపు అలవాట్లపై అందిస్తున్న కథనమిది.
25 ఏళ్లు దాటిన వారిలో 16 శాతం మంది..: డాక్టర్ గీత, ఎండోక్రానాలజిస్టు, కేర్ * 45-65 ఏళ్ల మధ్య తొలిసారి మధుమేహం బయట పడిన 50 శాతం మందిలో అప్పటికే దాని మూలంగా ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తి ఉంటుంది. * సాధారణంగా అతి మూత్రం, అతి దాహం, అతి ఆకలి... రాత్రి వేళల్లో కనీసం 4 సార్లు మూత్రానికి పోవడం.. లాంటివి ఉంటే మధుమేహంగా అనుమానించాలి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన రోగం బారిన పడినట్లు కాదు. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. |
మంచి ఆహారపు అలవాట్లతో డయాబెటిస్ దూరం * తొలుత 75 శాతం తెల్లని అన్నం, 25 శాతం బ్రౌన్ రైస్ అన్నం వేర్వేరు కప్పుల్లో తినాలి. ఇలా 10-20 రోజులు చేయాలి. తర్వాత 2 నుంచి 3 వారాల వరకు 60శాతం తెల్ల అన్నం, 40 శాతం బ్రౌన్రైస్తో చేసిన అన్నం తీసుకోవాలి. ఇలా క్రమబద్ధంగా మారాలి. * తెల్లని అన్నంకు బదులు గ్లైసెమిక్ చాలా తక్కువగా ఉన్న క్వినోవా రైస్, బ్రౌన్ రైస్, బొంబాయి రవ్వ ఉప్మా ఆహారంగా తీసుకోవాలి. * అల్పాహారంలో రాగి ఇడ్లీ, రాగి దోస తీసుకోవడం ఉత్తమం. దీంతో ఇనుము, కాల్షియం, ప్రోటీన్, పోటాషియం పుష్కలంగా అందుతుంది. హృద్రోగ రోగులు వీటిని తినేముందు వైద్యులను సంప్రదించాలి. * గోధుమ రవ్వ ఉప్మా, గ్రీన్ గ్రామ్ దోస, చపాతీ, గుడ్డులోని తెల్లని భాగం, దోసకాయ, టమోటాలు, కూరగాయాలతో చేసిన శాండ్విచ్ కూడా అల్పాహారం కింద తీసుకోవచ్చు. * డయాబెటిక్ రోగులు బంగాలదుంప మినహాయించి అన్ని కూరగాయలు తీసుకోవచ్చు. బంగాల దుంప ఇష్టమైన వాళ్లు పైపొర తీయకుండా ఉడికించి మితంగా తీసుకోవాలి. * పండ్లలో జామ, గ్రీన్ యాపిల్స్, పండిన బొప్పాయి, పండిన పుచ్చకాయలు, నారింజలు, కివి, దోసకాయ, దానిమ్మ లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. |
తాజా వార్తలు
జిల్లా వార్తలు