close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

సర్కారీ స్థలం.. ప్రైవేట్‌కు అర్పణం

నార్సింగిలో భూబాగోతం బట్టబయలు
విలువ రూ.80 కోట్లకు పైనే
ఇనాం పేరిట రెవెన్యూ రికార్డులు తారుమారు
ఈనాడు, హైదరాబాద్‌

ఎక్కడ: నగర శివారు నార్సింగిలో
ఏం జరిగింది: సర్కారు భూమిని ఇనాంగా మార్చేసి ప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చేశారు
ఎంత విస్తీర్ణం: దాదాపు 4 ఎకరాలు
రెవెన్యూ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కయ్యారు. ఇక అడ్డేముంది. రూ.కోట్ల విలువ చేసే భూమికి రెక్కలు వచ్చేశాయి. సర్కారీ భూమిపై సమగ్ర విచారణ లేకుండానే ‘ఇనాం’గా పేర్కొంటూ గతంలో ఓ మాజీ ఆర్డీఓ కొందరికి కట్టబెట్టేశారు. నార్సింగిలో రూ.80 కోట్ల విలువ చేసే భూమి వ్యవహారమిది. ఈ తతంగం పదేళ్ల తర్వాత వెలుగు చూసింది. ఏకంగా అయిదు దశాబ్దాల రికార్డులను తారుమారు చేసి వ్యవహారం నడిపించినట్లు ‘ఈనాడు’ పరిశీలనలో  తేలింది. ప్రధాన పార్టీ తరఫున గత ఎన్నికల్లో నగరంలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు సూత్రధారిగా తెలిసింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో సర్వే నం.126లో 6.08 ఎకరాల సర్కారీ భూమి ఉంది. 1963-64 రికార్డులు మొదలుకుని బైనంబర్లుగా విడగొట్టారు. 126/1లో 3 ఎకరాలు ప్రభుత్వానిదని, 126/2లో 3.08 ఎకరాలు పట్టాగానూ రాసుకుంటూ వచ్చారు. పక్కనే ఉన్న సర్వే నం.107లో ఉన్న 1.07 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సైతం అదే ఏడాది నుంచి జె.వెంకటస్వామి అనే వ్యక్తి పేరిట పట్టాగా పేర్కొన్నారు. ఇలా మారడం వెనుక రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినట్లు స్పష్టమవుతోంది. దీనిని ఇనాంగా పేర్కొంటూ కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు పదేళ్ల క్రితం చేవెళ్ల ఆర్డీఓ కోర్టులో కేసు దాఖలు చేశారు. తూతూమంత్రంగా విచారణ చేసి నాటి ఆర్డీఓ వారికి అనుకూలంగా తీర్పు చెప్పారు. 1999, 2000, 2005-06, 2007-08 ప్రకారం ఆయా సర్వే నంబర్లలో ఉన్న మాఫి ఇనాం భూమిగా ఉందని పేర్కొంటూ 2009 నవంబరు 14న ఉత్తర్వులు నం.ఎల్‌/4502/2008 జారీ చేశారు. అదే నెల 17న ఆక్యుపెన్సీ రైట్స్‌ సర్టిఫికెట్స్‌(ఓఆర్‌సీ) జారీ చేశారు. అలా సర్వే నం.126/2లోని 3 ఎకరాలు, సర్వేనం.107లోని 1.07 ఎకరాలు(మొత్తంగా 4.07) ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. అప్పటి ఓ తహసీల్దార్‌, ఓ వీఆర్వో 2009 డిసెంబరు 12 నుంచి ఎన్‌.మధుసూదన్‌రావు పేరును పట్టాలో చేర్చారు. పాస్‌ పుస్తకాలు జారీ చేశారు.

వెలుగు చూసిందిలా..
గతయేడాది ఫిబ్రవరి 6న నార్సింగికి చెందిన ఇద్దరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి కాస్రా పహాణీ, సేత్వార్‌ ప్రకారం ఇనాం భూమిగా ఎక్కడా రికార్డు కాలేదు. నకల్‌ సేత్వార్‌ ప్రకారం సర్వే నం.126లో శిఖంకుంటగా ఉండగా.. 1954-55 కాస్రా పహాణీ ప్రకారం సర్కారీ భూమిగా ఉంది. సర్వే నం.107లోని 1.07 ఎకరాలు సైతం ప్రభుత్వ భూమిగానే ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది, తహసీల్దార్‌ కార్యాలయ రికార్డులు పట్టించుకోకుండా అప్పటి ఆర్డీఓ ఆదేశాలిచ్చేశారు. నాడు తహసీల్దార్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక మేరకు తగిన విచారణ లేకుండానే ప్రైవేటు పట్టాగా చూపిస్తూ ఓఆర్సీ కట్టబెట్టేశారు. క్షేత్రస్థాయిలో పొజిషన్‌లో ఎవరు ఉన్నారన్న విషయాన్నీ పట్టించుకోలేదు. రంగారెడ్డి జిల్లా జేసీ ఎస్‌.హరీష్‌ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఇది ఇనాం భూమి కాదని, ప్రభుత్వానిదని ఈ ఏడాది జూన్‌ 22న తేల్చారు. నాటి ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని తీర్పు చెప్పారు. దీనిపై ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టేటస్‌కో ఇచ్చింది.

ప్రభుత్వ భూమిగా తేలింది:
ఎస్‌.హరీష్‌, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌
నార్సింగిలో భూమి వ్యవహారం నా దృష్టికి రావడంతో సమగ్ర విచారణ చేపట్టాం. అన్ని రికార్డులు పరిశీలించి అధికారుల నివేదికలు తెప్పించుకుని సర్కారీ భూమిగా తేల్చాం. అది ఇనాంగా పేర్కొంటూ ప్రైవేటు వ్యక్తులకు ఓఆర్సీ ఇవ్వడం సరైన చర్య కాదు. ఆ భూమికి సంబంధించి ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.