close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ప్రధానాంశాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ నకి‘లీలలు’!

సృష్టింపు పత్రాలతో బల్దియా ఆదాయానికి గండి
శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో దళారుల దందా

గచ్చిబౌలి న్యూస్‌టుడే: నకిలీ ఎల్‌ఆర్‌ఎస్‌ (స్థల క్రమబద్ధీకరణ) పత్రాలతో కొందరు జీహెచ్‌ఎంసీ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం జీహెచ్‌ఎంసీకి రూ.లక్షల ఫీజులు చెల్లించే పనిలేకుండా నకిలీ పత్రాలు సృష్టించి తమ జేబులు నింపుకొంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఆమోదం లేని లేఅవుట్‌లోని ప్లాట్‌లో ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందాలంటే నిబంధనల ప్రకారం 14 శాతం రుసుము జీహెచ్‌ఎంసీకి చెల్లించాలి. అయితే ఆ ఫీజును తప్పించుకునేందుకు ఇలా నకిలీ పత్రాలు తయారు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతో దళారులు యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి ప్రాంతంలోని అనేక కాలనీల్లో లేఅవుట్లు ఒకప్పుడు గ్రామపంచాయతీ అనుమతి పొందినవి కావడంతో అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే కచ్చితంగా స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకొని ఉండాలి. అయితే ఆయా లేఅవుట్లలో ప్లాట్‌ కొనుగోలు చేసినప్పుడు సదరు స్థల విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం నిర్ణయిస్తారు. ఇలా రుసుం చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. పలుమార్లు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించగా కొందరు స్థల క్రమబద్ధీకరణ చేయించుకున్నారు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ, రాఘవేంద్రకాలనీ, రాజరాజేశ్వరీనగర్‌, ఓయూకాలనీ, గచ్చిబౌలిలో ఇంకా అనేక మంది స్థల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోలేదు.

ఉదాహరణకు.. కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో 200 గజాల స్థలంలో జీ ప్లస్‌ టు నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్నవారికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు అనుమతి ఫీజు చెల్లించాలి. ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారు ఫీజు కింద దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించాలి.

దళారులే పాత్రధారులు..
ఇదే అదనుగా కొందరు దళారులు నకిలీ ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాలను తయారు చేసి ఇంటి అనుమతులు ఇప్పిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తి అయిన ప్లాట్‌కు సంబంధించిన యజమాని పేరు స్థానంలో తమకు కావాల్సిన పేరును మార్చుకొని స్థల క్రమబద్ధీకరణ జరిగినట్లుగా పత్రాలు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన పత్రాలతో అనుమతికి దరఖాస్తు చేసుకొని సాధారణ ఫీజు చెల్లిస్తున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి అనుమతులు సైతం మంజూరు చేస్తున్నారు. ఫీజు లేకుండా అనుమతి ఇప్పిస్తామంటూ ఒక్కో నిర్మాణ అనుమతికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు దండుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీరాంనగర్‌ కాలనీ, రాఘవేంద్రకాలనీ, రాజరాజేశ్వరినగర్‌ కాలనీలో ఇటీవల ఈ తరహాలో అనేక అనుమతులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తైన స్థలాలకు సంబంధించిన పూర్తి సమాచారం జీహెచ్‌ఎంసీ వద్ద లేకపోవడంతో దళారాలు ఆటలు సాగుతున్నాయి.

చందానగర్‌ కేంద్రంగా..
చందానగర్‌లోని ఓ ఆర్కిటెక్ట్‌ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇతను తయారు చేసిన తప్పుడు పత్రాలతో అనుమతి కోసం దరఖాస్తు చేయగా వాటికి అనుమతులు మంజూరు చేయించుకునేందుకు కొందరు దళారారులు జీహెచ్‌ఎంసీలో సిబ్బంది ప్రసన్నం చేసుకొని పనులు పూర్తి చేస్తారు. ఇందుకుగాను సదరు దళారులకు వచ్చిన దాంట్లో ఆర్కిటెక్ట్‌ కొంత వాటా ఇస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా సాగిస్తున్న ఈ దందాతో సదరు ఆర్కిటెక్ట్‌ రూ.కోట్లు గడించినట్లు సమాచారం. ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారు భవన నిర్మాణం అనుమతి కోసం సదరు ఆర్కిటెక్ట్‌ వద్దకు వెళ్లి అడిగిన డబ్బు చెల్లిస్తే చాలు నిర్దేశిత సమయంలో అనుమతి వచ్చేస్తుందని పలువురు నిర్మాణ గుత్తేదారులు చెబుతుండటం విశేషం.

విచారణ చేయాలి..
అయితే నకిలీ ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాల విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సదరు ఆర్కిటెక్ట్‌ ద్వారా వచ్చిన భవన నిర్మాణ అనుమతి ఫైళ్లను క్షణ్నంగా పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న దళారులు ఆట కట్టించే విధంగా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.