ఆదివారం, డిసెంబర్ 08, 2019
బాన్సువాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వంతో పని చేయాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో గురువారం పర్యటించారు. పింఛన్‌దారులకు సక్రమంగా డబ్బులు పంపిణీ చేయడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు వృద్ధులతో సమావేశం నిర్వహించారు. బీపీఎం తీరు సరిగా లేదని, మూడు నెలలుగా పింఛన్ డబ్బులు చెల్లించడం లేదని వృద్ధులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సభాపతి మాట్లాడారు. వృద్ధులకు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ సమయానికి ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదులొస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తపాలా అధికారులకు ఆదేశించారు. వృద్ధుల డబ్బులు వాడుకుంటే పాపం తగులుతుందన్నారు. నెలనెలా జీతం వస్తుంది కాబట్టి ఉద్యోగులకు బాధ తెలియదని, పింఛన్‌దారులకు నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు రూ.200 అందజేస్తున్న పింఛన్‌ను సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతులకు రూ.2,016, వికలాంగులకు రూ.3,016 చేశారని గుర్తు చేశారు. త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. గ్రామంలో సొంత స్థలాలు ఉన్న వారు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం వృద్ధులకు సభాపతి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజనర్సు, ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచి జిన్న రఘు, డీఎస్పీ దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో సూఫీ, మల్లారెడ్డి, బాలయ్య, ఎజాజ్, భాస్కర్, బాబా, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్‌కు పూర్వ వైభవం
రుద్రూర్: నిజాంసాగర్‌కు పూర్వ వైభవం రాబోతోందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాయకూర్ క్యాంప్‌లో రూ.25 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సామాజిక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... శ్రీరాంసాగర్ నుంచి అలీసాగర్ ద్వారా నిజాంసాగర్‌లోకి నీటిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, ఈ ప్రక్రియ పూర్తయితే ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.30 లక్షల ఎకరాలు సాగవుతుందని, రైతులు రెండు పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి వృథా కాకుండా ముందస్తు చర్యగా పంట కాలువల మరమ్మతులు చేపడతున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచి నిర్మల, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సభ్యుడు గంగారాం, ఆర్డీవో గోపీరామ్, తహసీల్దార్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు