close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

తెలుగుకు జై కొట్టు.. ఆంగ్లాన్ని ఒడిసిపట్టు!

మాతృభాషలో బోధనతోనే మేధో వికాసం.. సాహితీవేత్తల మనోగతం
ఈనాడు, హైదరాబాద్‌, గుంటూరు సాంస్కృతిక-న్యూస్‌టుడే

తెలుగు అజంత భాష. అచ్చులతో అంతమయ్యే శబ్దాలు ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. ఇటాలియన్‌ కూడా అజంత భాషే.
దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృభాష తుళు. అయినా తాను ‘తెలుగు వల్లభుండ తెలుగొకండ’ అని గర్వంగా చెప్పుకొన్నారు.
అవధాన ప్రక్రియ తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఇలాంటి సాహితీ చమక్కు మరే భాషలోనూ లేదు.
క్రీస్తుపూర్వం 500 ఏళ్ల ముందు నుంచే తెలుగు శాసనాలు ఉన్నాయి.
వెలనాటి చోడులు తెలుగును అధికార భాషగా ప్రకటించిన తొలి రాజులు.
మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సాగే రేడియోలో రోజూ గంటపాటు తెలుగు కార్యక్రమాలకు కేటాయిస్తారు.
దేశంలో ఎక్కువ మంది మాట్లాడే వారిలో 4వ స్థానం, ప్రపంచంలో 15వ స్థానంలో తెలుగు భాష ఉంది. ఆంగ్లంలో 2.5లక్షల పదాలుంటే.. తెలుగులో 6 లక్షలున్నాయి.
మాతృభాషలో చదివినప్పుడు మెదడు పైభాగంలోని భాషా సంపద ప్రాంతం చురుకుదనాన్ని ప్రేరేపిస్తుంది.

మొలక లేతదనము తవిరుల నవకంబు మొగ్గ సోగదనము పువ్వు తావి తేనె తీయదనము తెనుగునకేగాక పరుష సంస్కృతాఖ్య భాషకెద్ది?

- ఆదిభట్ల నారాయణదాసు

ఆంధ్రభాష యమృత మాంధ్రాక్షరంబులు మరువు వొలుకు గుండ్ర ముత్తియములు ఆంధ్ర దేశమాయురారోగ్య వర్ధకం బాంధ్ర జాతి నీతిననుచరించు

- వేటూరి ప్రభాకరశాస్త్రి
భాషా శాస్త్రవేత్త నోమ్‌చామ్‌స్కీ అంచనా ప్రకారం మూలద్రావిడ భాష నుంచి మొదటగా విడిపోయింది తెలుగు. తమిళం కాదు. రుగ్వేదకాలం నాటికే అంటే 3,500 సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాషకు అస్తిత్వం ఏర్పడింది. తెలుగులో 1780 క్రియా ధాతువులుంటే తమిళంలో ఉన్నది కేవలం 400 మాత్రమే.

విజ్ఞాన శాస్త్రాన్ని అమ్మ భాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో ‘సైన్స్‌ సృజనాత్మకత’ పెరుగుతుంది. పాఠ్యాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. నేను పదో తరగతి వరకూ మాతృభాషా మాధ్యమంలోనే చదువుకున్నా తర్వాత ఆంగ్లం నేర్చుకున్నా. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది. ఆ సృజనాత్మకత అమ్మభాషలో చదువు వల్లే సాధ్యం.

- ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం

విద్యావ్యాప్తికి పరిశ్రమించడమే విశ్వవిద్యాలయాల కర్తవ్యం. విశ్వవిద్యాలయం బోధనా మాధ్యమంగా మాతృభాషను స్వీకరిస్తే తప్ప ఈ లక్ష్యం నెరవేరదని నా కచ్చితమైన అభిప్రాయం.

- డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

(బొంబాయి విశ్వవిద్యాలయంలో సంస్కరణల అమలుకు ఏర్పాటైన సర్‌ చిమన్‌లాల్‌ హెచ్‌ సెతల్‌వాద్‌ కమిటీ.. పలువురు విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయాలు సేకరించింది. ఈమేరకు విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలో విద్యాబోధన అంశంపై డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇది.)
(ఆధారం: ‘డా. బాబాసాహెబ్‌ రైటింగ్స్‌ అండ్‌ స్పీచెస్‌’ వాల్యూమ్‌-2, పేజీ నం.312)
 

భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష
- విశ్వనాథ సత్యనారాయణ

అమ్మపట్ల చాటే ఔదార్యం.. మాతృభాషపట్ల కూడా చూపాలి. తెలుగును భావోద్వేగాలకు మాత్రమే పరిమితం చేయకుండా బతుకుదెరువుకు సాధనంగా మలచాలి. పాలకులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనబెట్టి అమ్మభాషకు రాచబాట వేయాలి. తమ బిడ్డలను ఏ మాధ్యమంలో చదివించాలనే సందిగ్ధత నుంచి తల్లిదండ్రులను బయటపడేయాలి. దశాబ్దాల క్రితమే ఉన్నత చదువులతో విదేశాలకు చేరిన ఎంతోమంది మేధావులు, నిపుణులు మాతృభాషలో చదువుకునే ఉన్నతశిఖరాలను అధిరోహించారు. మారుతున్న పోటీ వాతావరణంలో నెగ్గుకు రావాలంటే పిల్లలకు ఆంగ్లం తప్పనిసరి. అయితే ఈ ఒక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పరభాష వెంట పరుగులు తీయటం తగ్గించాలి. జీవనోపాధికి ఆంగ్లం అవసరమే. జీవించేందుకు తెలుగు కూడా ముఖ్యమని గమనించాలి. మాతృభాషపై పట్టు సాధించినప్పుడు మాత్రమే ఇతర భాషలను తేలికగా నేర్చుకోగలరంటూ పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంగ్లం నేర్చుకోవటం తప్పు కాదు. అయితే తెలుగును విస్మరించటం భాషా మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి భాషకు బంగారుబాట వేసేందుకు రచయితలు, మేధావులు, పాలకులు సమన్వయంగా ముందడుగు వేయాలని సాహితీప్రియులు సూచిస్తున్నారు. భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపే మాధ్యమంపట్ల సరైన నిర్ణయం తీసుకోవాలంటున్న కవులు, రచయితలు.. మాతృభాష అమలుపట్ల ఎదురవుతోన్న అవరోధాలు.. కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలను ‘ఈనాడు’తో పంచుకున్నారు.

మెదడులో మాతృభాష ముద్ర
న్యూయార్క్‌కు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్తలు జూలియా సిమ్నెర్‌, కెయిత్‌లీన్‌ బేంకర్స్‌.. మాతృభాషపై అవగాహన స్థాయిని తెలుసుకునే పరిశోధన చేశారు. కొందరిని ఎంపిక చేసి వారి మాతృభాషలో ఎప్పుడూ వినని కొత్తపదాలకు అర్థం చెప్పగలరా లేదా అని పరిశీలించారు. వీరిలో చాలామంది ఆ పదాలు మొదటిసారి విన్నప్పటికీ అర్థాలను చెప్పగలిగారు. పదం ఉచ్చారణ.. భావాలను గ్రహించి ఇలా చెప్పగలిగారని శాస్త్రీయంగా రుజువు చేశారు. పది భాషలకు చెందిన బృందాలకు దాదాపు 400 పదాలు వినిపించి ఈ పరిశోధన నిర్వహించారు.

జపనీయుల ఆదర్శం
జపాన్‌.. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. తిరిగి అమోఘ శక్తిగా అవతరించేందుకు కేవలం వారిలోని క్రమశిక్షణ ఒక్కటే కాదు.. వారిని ఏకతాటిపై నడిపించిన వారి మాతృభాషకూ ఆ గౌరవం దక్కుతుంది. తమను నడిపించే శక్తి మాతృభాష అనే దృఢమైన నమ్మకమే వారిని శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టించేందుకు అవసరమైన బలాన్నిచ్చింది. అంతటి పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు అక్కడి ప్రజలు పరభాష మీద ఆధారపడ్డారనుకుంటే పొరపాటే. విశ్వవిద్యాలయాల్లోని బోధనా నిపుణులతోసహా జపనీస్‌ విద్యావంతుల్లో 98 శాతం మంది ఆంగ్లంలో మాట్లాడలేరు. అభివృద్ధికి ఆంగ్లం ఒక్కటే వేదిక కాదని తోషిబా, కెనాన్‌, నికాన్‌, సుజికి, మిత్సుబిషి, పానాసోనిక్‌, టయోటా, హోండా, సోనీ తదితర ప్రపంచం మెచ్చే బ్రాండ్‌ల సృష్టికర్తలు చాటారు. అక్కడి పిల్లలకు ఐదోతరగతి వరకు ఆంగ్లం పాఠ్యాంశం కాదు. ఐదు, ఆరోతరగతుల్లో ఆంగ్లాన్ని వారానికి ఒక్క తరగతి అదీ కేవలం 45 నిమిషాలు నేర్పిస్తారు. ఏడోతరగతి నుంచి ఆంగ్లాన్ని సాధారణ పాఠ్యాంశంగా ప్రారంభిస్తారు. జపాన్‌ భాషపై ఇష్టాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తారు.

సి.పి.బ్రౌన్‌ తన మాతృభాష కాకపోయినా తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకుపాటుపడ్డారు. భాషకు నిఘంటువును రూపొందించారు
తెలుగు భాష ఉచ్చారణకు సాటి. ఏం రాస్తామో అలాగే మాట్లాడతాం.. ఎలా మాట్లాడతామో అదే రాస్తాం. ఆంగ్ల అక్షరాల్లో ‘సైలెంట్‌’ వ్యవహారం ఉంటుంది.

ఆంగ్లతో కంఠస్థమే..
-చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త
ఆంగ్ల భాష పిల్లలను సమాజం నుంచి దూరం చేస్తోంది. ఉపాధ్యాయుడు ఆంగ్ల భాషలో పాఠాలు చెప్తున్నప్పుడు విద్యార్థి పుస్తకం వరకు మాత్రమే పరిమితం అవుతాడు. అదే మాతృభాషలో బోధన సాగితే ఉపాధ్యాయులు తమ అనుభవాలతోపాటు పిల్లల భాషతో మేళవించి చెప్పే వీలుంటుంది. ఇది విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. అలాగని నేను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు. ఆంగ్ల మాధ్యమంలో చదివితే విద్యార్థి కంఠస్థం చేస్తాడు. మాతృభాషలో అయితే నేర్చుకుంటాడు. ఆలోచనలతో రాయాలంటే మాతృభాషే మంచిది.

- నల్లకుంట, న్యూస్‌టుడే

 

రెండూ కొనసాగించాలి..
- నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి
భాషను ప్రేమించటం, ఆరాధించటం ఇవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. కేవలం భావోద్వేగాలు మాత్రమే తెలుగును సంరక్షిస్తాయని భావించకూడదు. చదువు, జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలకు తెలుగు, ఆంగ్లం రెండూ అవసరమే. అయితే ప్రజలపై బలవంతంగా రుద్దకూడదు. భాషను ఎంపిక చేసుకోవాలనే అవకాశం వారికే ఇవ్వాలి. తెలుగు మాధ్యమంలో చదువుతున్న వారికి రాయితీలివ్వాలి. తెలంగాణలో ప్రాథమిక విద్య వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. తెలుగును బోధనాంశంగా కొనసాగించాలి. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోనూ తెలుగు బోధన దూరమైంది. ఇతరత్రా ఉద్దేశాలు ఏమున్నా తెలుగుభాషకు వేదికలైన తెలుగు రాష్ట్రాల్లో అసమగ్రమైన పరిస్థితులు తొలగాలి.

ప్రయోగాలు చేయవద్దు
- పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘ జాతీయ కార్యదర్శి
ఇది అక్షరాలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయోగమే. విద్య, విషయ ప్రయోగశాలగా రాష్ట్ర విద్యా విధానాన్ని మార్చేస్తున్నారు. ఇదీ చాలా ప్రమాదకరం. జాతీయ, అంతర్జాతీయ విద్యావిధానానికి కూడా వ్యతిరేకం. ఎన్నెన్నో దేశాలు తమ మాతృభాషలోనే విద్యాబోధనను చేస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. తెలుగు మాధ్యమంలో బోధనను పూర్తిగా రద్దు చేయకుండా రెండు మాధ్యమాలలో బోధన సమాంతరంగానే సాగాలి. అలాగే కస్తూరి రంగరాజన్‌లాంటి కమిటీలు ఎన్నో మాతృభాషలో విద్యాబోధన జరగాల్సిన అవసరాన్ని గురించి స్పష్టం చేశాయి. ప్రాథÅ]మిక స్థాయిలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయటం అనేది ప్రజావ్యతిరేక విధానమే అవుతుంది. దీన్ని అభ్యుదయ రచయితల సంఘం నిరసిస్తుంది.

బోధన భాషగా మెరవాలి
- అంపశయ్య నవీన్‌, ప్రముఖ రచయిత
తెలుగు బోధన భాషగా చేయాలి. ఆంగ్లం ఒక పాఠ్యాంశంగా మార్చాలి. మేం చదువుకునేటప్పుడు 4 నుంచి 10వ తరగతి వరకూ ఆంగ్లం ఉండేది. అందువల్ల రెండు భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించగలిగాం. విజ్ఞాన సంబంధమైన అంశాలు తెలుగులో లేకపోవటం కూడా భాషపట్ల చులకన భావం పెరిగేందుకు కారణమవుతోంది. చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలు మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నాయి. విదేశాల్లో కొలువులు చేపట్టాలన్నా వారు ఎంచుకున్న అంశంలో నిష్ణాతులుగా ఉండాలి. అందుకు అధికార భాషా సంఘం తమ బాధ్యతలు కచ్చితంగా నిర్వర్తించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అమలును పర్యవేక్షించాలి. ప్రజలు ఇచ్చే వినతిపత్రాలు, అధికారుల సమాధానాలు.. ఇవన్నీ మనభాషలోనే జరుగుతున్నాయా.. లేదా.. అనేది తనిఖీ చేయాలి.
రద్దు చేయటం సరైనది కాదు
- అట్టాడ అప్పలనాయుడు ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షుడు
ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధనను రద్దు చేసి ఆంగ్లమాధ్యమంలో తప్పనిసరిగా చదవాలని అనటం సరైనది కాదు. మాతృభాషలో అవగాహన పెంచుకుని ఆ తర్వాత పరభాషలోకి వెళితే ప్రయోజనం. ఉదాహరణకు.. హిందీని పాఠ్యంశంగా పెట్టి పరీక్షలు కూడా పెట్టి పిల్లలను బయటకు పంపుతున్నారు. తీరా అలా చదివిన పిల్లలు బయటకు వచ్చాక హిందీ భాష మీద ఎంతమాత్రం అవగాహన ఉండటం లేదు. ఆ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకుని మాట్లాడేవారూ కనిపించటం లేదు. రేపు తెలుగు పరిస్థితి కూడా అదే అవుతుంది.
స్పష్టత లేని స్థితి
- కేతు విశ్వనాథరెడ్డి  విశ్రాంతాచార్యులు

ప్రస్తుతం భాషా విషయంగా యుద్ధవాతావరణం నెలకొంది. ఆంగ్లాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల బోధనలపట్ల స్పష్టమైన వ్యూహం కొరవడింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తెలుగును ప్రథమ భాషగా బోధిస్తారా? ఆంగ్లభాష అవసరమన్న ప్రజాభిప్రాయాన్ని కాదనలేం. మధ్యలో జాతీయ భాషగా హిందీ రాద్ధాంతం ఒకటి. తెలుగు భాషాభివృద్ధికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు చేస్తున్న కృషి కూడా ప్రభుత్వాలు, మేధావులు, సాహితీవేత్తలు చేయలేని పరిస్థితి.
- కడప సాంస్కృతికం, న్యూస్‌టుడే

సవాళ్లను అధిగమిస్తేనే ప్రయోజనం
- శ్రీపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు వందేమాతరం ఫౌండేషన్‌
పిల్లలు భాషలు ఎలాగైనా నేర్చుకోగలరు. మా అమ్మాయి తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. ఆంగ్లం నేర్చుకునేందుకు రోజూ గంటన్నర సమయం ఆంగ్ల సినిమాలు వీక్షించే అవకాశం కల్పించడంతో ఆ భాషపై పట్టు సాధించింది. 88 మంది విద్యార్థులపై ఇంగ్లిషు సినిమాలు చూపటం ద్వారా భాషను అలవోకగా నేర్చుకునేలా ప్రయోగం చేస్తున్నాం. పిల్లలకు ఇంగ్లిషు నేర్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. విద్యాసంస్థల్లో ఆంగ్లమాధ్యమం అభ్యసించినా ఇంటికొచ్చాక మళ్లీ తెలుగులోకి మారుతున్నారు. బోధనాంశంగా ఇంగ్లిషు కోసం విద్యాసంస్థల్లో తగిన ఏర్పాట్లు ఉండాలి.

ఏడోతరగతి వరకూ బోధనాంశంగా ఉండాలి
- వడ్డేపల్లి కృష్ణ, సినీ రచయిత, కవి
మాతృభాషను కేవలం భాషగా మాత్రమే చూడకూడదు. అది సంస్కృతితో ముడిపడిన జీవనవేదం. తెలుగు నేర్చుకోకుంటే పిల్లలకు సంస్కృతి ఎలా తెలుస్తుంది. 1-7వ తరగతి వరకు తెలుగు బోధనాంశంగా ఉండాలి. ఆ తరువాత పైతరగతులకు వెళ్లే కొద్దీ ఆంగ్ల మాధ్యమంలో బోధించవచ్చు. పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధించటం కూడా సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. పిల్లలకు వ్యాకరణం తెలియకుండా పరభాష బోధించటం ద్వారా రెండింటికీ దూరమవుతారు. ప్రాథమిక పాఠశాల స్థాయి వరకు తెలుగు తప్పనిసరి చేయటం ద్వారా మాతృభాషలో అనర్గళంగా మాట్లాడగలరు.

రెండు భాషలూ అవసరమే
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు శాఖ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
ఒకటో తరగతి నుంచే అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన వినేందుకు బాగానే ఉంది. కానీ ఆచరణలో దీని ఫలితాలపట్ల మేధావుల వర్గంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ద్వారా పేద, వర్గాలకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాల్లో ఇది ఆచరణ సాధ్యం కాదనేది నా అభిప్రాయం. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు వారి పాఠ్యాంశాల్లోని సందేహాలు తీర్చేంతటి విషయ పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండదు. దీనివల్ల దీర్ఘకాలంలో వీళ్లు పాఠశాలలకు వెళ్లటం మానేసే ప్రమాదమూ ఉంది. ఆంగ్లభాషను ఒకటో తరగతి నుంచి నేర్పాలి. రెండు భాషలూ పిల్లలకు అవసరమే. తగిన సమయంలో విద్యార్థులకు ఆయా అంశాలను దగ్గర చేయటం ద్వారా వారి ఉన్నతికి బాటలు వేసినట్టవుతుంది.

అనువాదంతో పురోగతి
- డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, సాహితీవేత్త
ఇంతటి పోటీ ప్రపంచంలోనూ తెలుగు మాధ్యమంపట్ల ఆసక్తి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఓ ఐఏఎస్‌ అధికారి తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదవించారు. భాషతో సంస్కృతి, సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. తాను ఏ మాధ్యమంలో చదవాలనే విషయాన్ని బయటి వ్యక్తులు నిర్దేశించకూడదు. ఎంపిక వారి వ్యక్తిగత ఇష్టాయిష్టానికే వదిలేయాలి. 1919లోనే నిజాం ప్రభువు వైద్య విద్యసహా పలు అంశాలను ఉర్దూలో అనువాదం చేయించారు. తమిళనాడులో ప్రజలు, పాలకులు తమ భాషకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. అనేక పుస్తకాలను తమిళంలోకి తర్జుమా చేయించారు. అందుకు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అధికార భాషగా తెలుగును అన్ని స్థాయిల్లో అమలు చేయాలి.

సరి కానే కాదు
- గంటేడ గౌరునాయుడు, రచయిత
ప్రాథమిక విద్య ఆంగ్ల మాధ్యమంలో జరగాలనటం సరికాదు. మాతృభాషలోనే విద్యాబోధన జరగటం శాస్త్రీయం. ఐదేళ్ల వయసు పిల్లలకు అమ్మభాషలో  చెప్తేనే తెలుసుకుంటారు. ప్రపంచంలో చాలా దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో పరభాషా పదాలను, వాక్యాలను పరిచయం చేసి అవగాహన కల్పించటం సులభం కాదు. ఆ భాషలో సుశిక్షితులైన వారికే సాధ్యం కాదు. రెండు మాధ్యమాలలోనూ బోధనతో ఫలితం ఉండవచ్చు. అయితే పిల్లలకు ఏ మాధ్యమం ఎంచుకోవాలో తెలియదు. రెండు మాధ్యమాల్లోనూ బోధన జరగాలి. ఇప్పుడు సక్సెస్‌ స్కూళ్లలో జరుగుతున్నది అదే. మాతృభాషలో బోధన లేకపోతే తెలుగు మాట్లాడగలిగినా తెలుగులో రాయగల, చదవగలవారు ఉండరు. తెలుగువాళ్లం.. తెలుగులో చదువుకోవటానికి అవకాశం లేని స్థితి రాకూడదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.