close

గురువారం, డిసెంబర్ 05, 2019

ప్రధానాంశాలు

ఐదేళ్లలో ప్రగతి పతాక రెపరెప

జిల్లా సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపైనా చర్చ

ప్రస్తుత పరిస్థితిపై నివేదికలు సిద్ధం

జరగాల్సింది కొండంత అని చెప్పే అవకాశం

నేడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర అభివృద్ధి నిపుణుల కమిటీ

 

 

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు, నంద్యాల-న్యూస్‌టుడేకర్నూలు జిల్లా అభివృద్ధి నివేదికలకు తుది మెరుగులు దిద్దారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పరవళ్లు... ఆర్థికాభివృద్ధిలో అడుగులపై పవర్‌ పాయింట్‌ ప్రదర్శన ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మరో ఐదేళ్లలో జిల్లా ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉంటుందని ‘రాష్ట్ర అభివృద్ధి నిపుణుల కమిటీ’కి తెలిపేందుకు సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా సమగ్రాభివృద్ధికి ఇంకా ఏం చేయాలన్న అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సర్వోన్నతాధికారి వీరపాండియన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి నిపుణుల కమిటీ కన్వీనర్‌/మెంబర్‌ జీఎన్‌ రావు(విశ్రాంత ఐఏఎస్‌ అధికారి) నేతృత్వంలో ఆరుగురు సభ్యులు జిల్లాకు ఆదివారం రానున్నారు. సుమారు రెండు గంటలు ఈ బృందం పర్యటించనుంది. ముందుగా అన్ని శాఖల ద్వారా జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుంటారు. మౌలిక సదుపాయాలు, అన్నిరంగాల్లో ప్రస్తుత పరిస్థితిని జిల్లా అధికారులు వివరించనున్నారు. ఆ తర్వాత కర్నూలు సమగ్రాభివృద్ధికి ఇంకా ఏం కావాలనకుంటున్నారనేది అడిగి తెలుసుకోనున్నారు. కర్నూలు నగరంతోపాటు, జిల్లా సమాచారంతో రెండు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు ఇవ్వనున్నారు. ఆదాయ అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అంశాలను వివరిస్తూ, ప్రాజెక్టులు వంటి వాటిని పూర్తిచేయడానికి రాష్ట్రం సహకరించేలా చూడాలని కోరనున్నారు.

తలసరి ఆదాయం ఇలా...

జిల్లాలో పాడి పశువులు 48.80 లక్షలుండగా, జీవీఏ రూ.4,304 కోట్లుగా చూపించనున్నారు. మత్స్య సంపదపై ఏటా రూ.217 కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలపనున్నారు. పండ్లు, కూరగాయలు, పూలు ఏటా 20.98 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తున్నట్లు లెక్క తేల్చారు. 2017-18లో ముందస్తుగా వేసిన అంచనా మేరకు జిల్లాలో తలసరి ఆదాయం రూ.1,19,638గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత వ్యాపార రంగాలు ఇలాగే కొనసాగితే తలసరి ఆదాయం 2024-25 నాటికి రూ.3,04,904గా ఉండవచ్చని అంచనా వేశారు. కానీ, 2025 విజన్‌ ఆధారంగా రూ.3,24,096లుగా తలసరి ఆదాయం ఉంటుందని గతంలో భావించారు. 2025 విజన్‌కి, అధికారుల ప్రస్తుత అంచనాకు చూస్తే రూ.19,192 తక్కువగా ఉంటుందని నిపుణుల కమిటీకి నివేదించనున్నారు.

కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే...

ప్రస్తుతం జిల్లాలో కేసీ కెనాల్‌, తుంగభద్ర లోలెవల్‌, హైలెవల్‌, తెలుగుగంగ, శ్రీశైలం కుడి బ్రాంచ్‌ కెనాల్‌, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టుల ద్వారా 4.68 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీళ్లందించారు. జిల్లాలో మరికొన్ని ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తే రైతాంగం అభివృద్ధి చెందుతుందని చెప్పనున్నారు. రూ.4,300 కోట్లతో గుండ్రేవులను పూర్తిచేస్తే 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయవచ్చని, రూ.1985 కోట్లతో ఆర్డీఎస్‌ పూర్తయితే 40 వేల ఎకరాలు, రూ.1943 కోట్లతో వేదవతి పూర్తయితే 80 వేల ఎకరాలు, కుందూ నది రూ.1486 కోట్లతో అభివృద్ధి చేస్తే 1.50 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసుకోవచ్చని కమిటీకి వెల్లడించనున్నారు.

ప్రధానంగా ఇవే...

● కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

● కర్నూలులో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేయాలి.

● రహదారులకు సంబంధించి అనంతపురం-అమరావతి జాతీయ రహదారి 80 కి.మీ. రూ.232 కోట్లతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ చేయాలని కోరనున్నారు. దీంతోపాటు జాతీయ, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ఆర్‌ఆర్‌ శాఖల ద్వారా 5,179 కి.మీ. రోడ్లు వేయడానికి రూ.7,770 కోట్లకు కొత్తగా ప్రతిపాదనలు చేశారు. ఇవన్నీ పూర్తయితే రవాణా సౌకర్యం పరిశ్రమల ఏర్పాటుకు సులువుగా ఉంటుందని కోరనున్నారు. కర్నూలు, ఆదోని, బనగానపల్లిలో రింగు రోడ్ల ఏర్పాటుకు రూ.800 కోట్లు అవసరమని నివేదించనున్నారు.

● రెండు రాష్ట్రాలకు మార్గం సుగమమయ్యేలా కృష్ణా నదిపై సిద్ధేశ్వరం వంతెనను రూ.900 కోట్లతో ఏర్పాటు చేయాలనే అంశం తెరపైకి రానుంది. పుట్టీలు, బోట్లల్లో ప్రమాదకరంగా నది దాటుతూ మృత్యువాతపడ్డ సంఘటనలూ వివరించే అవకాశం ఉంది.

● జిల్లాలో గుట్టపాడు వద్ద 400/132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం, తంగడంచెలో 220/132/33 కేవీ ఉప కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలపనున్నారు.

పారిశ్రామికంగా...

గడివేముల మండలంలోని గని-శకునాలలో 5,811.36 ఎకరాల్లో సౌరశక్తి పార్కును రూ.6 వేల కోట్లతో ఏర్పాటు చేశారు. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తును ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. ఏడాదికి రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక వ్యవస్థకు ఇవి తోడవుతాయని సూచించనున్నారు. పిన్నాపురం వద్ద నిర్మించే వెయ్యి మెగావాట్ల సౌరశక్తి, 550 మెగావాట్ల పవన విద్యుత్తు వ్యవస్థలు కూడా త్వరితగతిన పూర్తయితే మరింతగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడతాయని అధికార యంత్రాంగం నిపుణుల కమిటీకి నివేదించనుంది. ఓర్వకల్లు విమానాశ్రయం త్వరతిగతిన పూర్తయితే పారిశ్రామికంగా, పర్యాటకంగా మేలు జరుగుతుందనే అంశాన్ని పొందుపరిచారు. జిల్లాలో సిమెంట్‌ పరిశ్రమలలో వేలాది మందికి ఉపాధి కలిగిందని, జైన్‌ ఇరిగేషన్‌, జైరాజ్‌ ఇస్పాత్‌ పరిశ్రమలతో కొత్తగా 14 వేల మందికి ఉపాధి కలిగినట్లు వివరించనున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.