గురువారం, డిసెంబర్ 05, 2019
ఇద్దరు హైదరాబాద్ వాసుల మృతి
మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠి సమీపంలో ఘటన
జైనథ్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు, పాండ్రకవడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు కలిసి కారులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పిప్పల్‌కోఠి గ్రామ చేరువలో జాతీయ రహదారిపై తెల్లవారు జామున 3 గంటల సమయంలో వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. వాహనం నుజ్జునుజ్జయ్యింది. హైదరాబాద్‌లోని చప్పల్‌బజార్‌కు చెందిన యోగేశ్‌గుప్తా (37), చార్మినార్ దగ్గర సిటీ కాలేజీ సమీపంలో నివసిస్తున్న పటాలీ కిషోర్‌కుమార్ కృష్ణాచార్య (36) మృతిచెందారు. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో కారు డ్రైవింగ్ చేస్తున్న వికాస్ అగర్వాల్ (40), యోగేష్ అగర్వాల్ (35) ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం గమనించిన ఓ లారీ డ్రైవర్ ఇద్దరు క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పాండ్రకవడ ఏపీఐ (అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్) వినోద్ జల్కే, హెడ్ కానిస్టేబుల్ హోందేల్ ఉగ్డే, పారఠన్భోరి హెడ్ కానిస్టేబుల్ పవార్లు అక్కడికి చేరుకొని చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు పంచానామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏపీఐ తెలిపారు. 20 మీటర్ల వరకు రహదారిపై బీటీ నిర్మాణం చేపట్టకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పిప్పల్‌కోఠి గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగుతుంటాయని, ఈ ప్రాంతంలో పది వరకు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని రహదారిపై బైఠాయించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతామని నచ్చజెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు