close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

ఎకరానికి రూ.లక్ష.. కుదిరితే ప్లాటు!

రంగారెడ్డి జిల్లాలో ఓ అధికారి అక్రమార్జన
అనుమతి లేని లేఅవుట్ల నుంచి వసూళ్ల దందా
అక్రమ వెంచర్లపై కిమ్మనని యంత్రాంగం
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మొయినాబాద్‌

ఎకరానికి లక్ష.. లేదంటే ప్లాటు.. నగర శివారుల్లో అక్రమ లే అవుట్ల నుంచి అధికారుల అక్రమార్జన యథేచ్ఛగా సాగిపోతోంది. కంచె చేను మేసిన చందంగా అక్రమాలను నిరోధించాల్సిన వారే.. వసూళ్లదందాకు తెరలేపారు. అక్రమ లే అవుట్ల వ్యవహారంపై గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘భూమంతర్‌’ కథనం చర్చనీయాంశమైంది. అక్రమ బాగోతంలో క్షేత్రస్థాయి సిబ్బందిని పావులు వాడుకుంటూ ఓ అధికారి భారీగా దండుకుంటున్నట్లు తెలిసింది. ఏళ్లతరబడిగా జిల్లాలో తిష్ఠ వేసి.. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేకంగా లక్ష్యాలు విధించి దండిగా వెనుకేసుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..
గత కొన్నాళ్లుగా నగర శివారుల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. వివాదాస్పద భూములకు సంబంధించి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) తీసుకుని విచ్ఛల విడిగా ప్లాట్లు చేస్తున్నారు. వాటికి పంచాయతీల నుంచి అనుమతులున్నాయంటూ బుకాయించి అమాయకులకు కట్టబెడుతున్నారు. వీటికి క్షేత్రస్థాయిలో అడ్డుకట్ట వేసే విషయంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇందుకు జిల్లాకు చెందిన ఓ అధికారి అక్రమార్జనే కారణమని తెలుస్తోంది. జిల్లా పరిధిలోని అక్రమ లే అవుట్లు విచ్ఛలవిడిగా పుట్టుకురావడం వెనుక సదరు అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఏళ్ల తరబడిగా జిల్లాలో తిష్ఠ వేసి వసూళ్ల పర్వానికి తెరలేపారు. సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ స్థాయి అధికారుల నుంచి అడ్డగోలుగా ముడుపులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం నగర శివారుల్లో ఎక్కువగా మొయినాబాద్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, కొత్తూరు, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో పెద్దఎత్తున లే అవుట్లు అవుతున్నాయి. జీవో నం.111 పరిధిలో ఉండటంతో ఇక్కడి ప్రదేశాలు కాలుష్య రహితంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఎక్కువగా ఇక్కడే దృష్టి పెట్టారు.

ప్రత్యేకంగా వసూలు బృందం
సదరు అధికారి జిల్లాలో అయిదుగురు సిబ్బందితో బృందం నియమించుకుంది. వీరు అక్రమ లే అవుట్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి వసూలు చేసుకురావడం విధిగా పెట్టుకున్నారు. లే అవుట్‌ విస్తీర్ణం ఆధారంగా ధరలు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. పదెకరాల్లో ప్లాట్లు విభజిస్తే రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. రహదారి పక్కనే ఉంటే ఎకరానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నారు. వీరు వసూలు చేసి సదరు అధికారికి ముట్టజెబుతున్నారు. మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరులో అక్రమంగా వేసిన లే అవుట్‌లో బినామీ పేరిట సదరు అధికారి ప్లాటు పొందారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే నమ్మకమైన వ్యక్తిని బినామీగా పెట్టుకుని ప్లాటు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని సమాచారం.

ముందుగానే లెక్కలు తేలాలి!
హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం అక్రమ లే అవుట్లు 4 నుంచి 5 వేల వరకు ఉంటాయని అంచనా. వాస్తవానికి వీటిని పంచాయతీ స్థాయిలోనే నిరోధించాలి. అక్రమంగా లే అవుట్లు వేయకుండా అడ్డుకోవాలి. లే అవుట్‌ యజమానులు నేరుగా సదరు జిల్లా అధికారిని ప్రసన్నం చేసుకుని క్షేత్రస్థాయిలో అడ్డగోలుగా ప్లాట్లు చేస్తున్నారు. అక్రమంగా లే అవుట్‌ వేస్తుంటే.. ముందుగానే కలిసి ఎంత విస్తీర్ణమో వివరించి.. అందుకు తగ్గట్టుగా చెల్లింపులు చేస్తున్నారు. ఇలాంటి వసూళ్లకు ప్రత్యేకంగా కార్యాలయంలో ‘నమ్మినబంటు’ నియమించుకున్నట్లు తెలిసింది. సదరు అధికారి వచ్చాకే ఆయా మండలాల్లో ఏకంగా 600 వరకు లే అవుట్లు జరిగినట్లు తెలుస్తోంది. ‘‘మేము క్షేత్రస్థాయిలో లే అవుట్లు కట్టడి చేసే విషయంలో గట్టిగా ఉన్నాం. కానీ స్థిరాస్తి వ్యాపారులు ముందుగానే ఒక అధికారిని కలిసి కావాల్సినంత ముట్టచెప్పి వస్తున్నారు. అక్కడి నుంచి మాకు ఒత్తిళ్లు తప్పడం లేదు. అందుకు లే అవుట్లు కళ్లముందే వెలుస్తున్నా వదిలేస్తున్నాం.’’ మొయినాబాద్‌ మండలానికి చెందిన అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.

అక్రమ లేఅవుట్‌లపై కొరడా!
నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్‌లపై ఎట్టకేలకు పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘భూమంతర్‌’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. చిలుకూరు, సురంగల్‌ రెవెన్యూ పరిధిల్లో అక్రమ లేఅవుట్‌లను కూల్చివేశారు. జీవోనం.111కు విరుద్ధంగా లేఅవుట్‌లు నిర్మిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని డైమండ్‌ గేట్‌ లేఅవుట్‌ సర్వేనం.184, 185, 191, 192, 193, 258లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్న సమయంలోనూ లేఅవుట్‌ నిర్మాణం చేసినట్లు.. కానీ జిల్లా అధికారులు తమను బాధ్యులను చేస్తూ తాఖీదులు జారీ చేస్తున్నారని చిలుకూరు సర్పంచి గునుగుర్తి స్వరూప ఆండ్రూ తెలిపారు. తాము సర్పంచిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం.. ఈ లేఅవుట్‌ను పలుమార్లు కూల్చివేసినట్లు.. తాఖీదులు సైతం ఇచ్చినట్లు.. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకూ నివేదించినట్లు వెల్లడించారు. అక్రమ లేఅవుట్‌లకు తాము అండగా ఉండేది లేదని తెలిపారు. సురంగల్‌లోనూ పలు లేఅవుట్‌లను కూల్చినట్లు సర్పంచి గడ్డం లావణ్యఅంజిరెడ్డి తెలిపారు. లేఅవుట్‌లు నిర్మిస్తున్న స్థిరాస్తి వ్యాపారులకు పలుమార్లు తాఖీదులు పంపించినట్లు.. నిర్మాణాలు ఆపకపోవడంతో కూల్చివేతలు చేసినట్లు తెలిపారు. సురంగల్‌ రెవెన్యూ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న లేఅవుట్‌లకు మూడేసి సార్లు తాఖీదులు ఇచ్చినట్లు.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.