close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

శివారు.. పరిశ్రమల జోరు!

టీఎస్‌ ఐపాస్‌తో పారిశ్రామిక అభివృద్ధి

యువత ఉపాధికి మార్గం

న్యూస్‌టుడే, జిన్నారం

నిర్మాణంలో పరిశ్రమ

గతంతో పోలిస్తే పరిశ్రమల స్థాపన సులభమని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. టీఎస్‌ ఐపాస్‌ వచ్చాక జిల్లాలో 1500 వరకు చిన్నా పెద్ద పరిశ్రమలు ఏర్పాటైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పరిశ్రమల ఏర్పాటు సాగుతోంది. టీఎస్‌ ఐపాస్‌ వచ్చి ఐదేళ్లు పూర్తయిన తరుణంలో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలోని జిన్నారం, పటాన్‌చెరు, గుమ్మడిదల, సంగారెడ్డి, హత్నూర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ ప్రాంతాల్లో సుమారు 1500 వరకు చిన్నా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడల్లోనే చాలా పరిశ్రమలు వచ్చాయి. బాహ్యవలయ రహదారి, పటాన్‌చెరు, నర్సాపూర్‌ జాతీయ రహదారి, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకోవడానికి అవకాశం అన్నింటికీ మించి మార్కెట్‌కు అనువుగా ఉండగా ఈ ప్రాంతాలను పారిశ్రామిక వేత్తలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటి 3వేల ఎకరాల భూములను సేకరించగా, మెడికల్‌ డివైజ్‌ పార్కులో కొన్ని పరిశ్రమల నిర్మాణం ఇటీవల ప్రారంభమయింది.

రసాయనేతర పరిశ్రమలే ఎక్కువ

రసాయన పరిశ్రమల వల్ల తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బంది పడిన శివారు ప్రాంతాలు అటువంటి పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వటం లేదు. దీంతో రసాయనేతర పరిశ్రమలే వస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కాగితం, యంత్రాల విడి భాగాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.

అభివృద్ధికి సూచిక

- సుమతి, ఎంపీడీవో, జిన్నారం

కొత్త పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధికి సూచిక. టీఎస్‌ ఐపాస్‌తో పారిశ్రామిక వేత్తలకు మేలు జరుగుతోంది జిన్నారం లాంటి శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావడం సంతోషాన్ని కలిగిస్తోంది. యువతకు ఉపాధితో పాటు గ్రామాలకు ఆదాయ వనరులు పెరుగుతాయి.

నూతన పారిశ్రామిక వాడలు ఇవే..

జిన్నారం మండలం శివానగర్‌లోని ఎల్‌ఈడీ బల్బుల తయారీ పార్కు

అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ శివారులోని మెడికల్‌ డివైజ్‌ పార్క్‌

పటాన్‌చెరు మండలం నందిగామలో మహిళా పారిశ్రామిక పార్కు.

ఇదీ టీఎస్‌ ఐపాస్‌

2015లో టీఎస్‌ ఐపాస్‌ ఆన్‌లైను విధానం ప్రభుత్వం ఆవిష్కరించింది. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు సర్కారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో అనుమతి మంజూరు చేస్తున్నారు. భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించటం, ఎలాంటి అవినీతి లేకుండా అనుమతులు మంజూరు చేయడం దీని ప్రత్యేకత.

అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి

- ప్రదీప్‌, యువకుడు

ప్రభుత్వ లక్ష్యం స్థానిక యువతకు ఉపాధి కల్పించడం. ఇది చాలా పరిశ్రమలు పట్టించుకోవటం లేదు. దీంతో యువత నిరాశతో ఉన్నారు. పరిశ్రమల ఏర్పాటును స్వాగతించాలని ఉన్నా అన్యాయం జరుగుతుందనే బాధ ఉంది. అది జరుగకుండా చూడాలి.

మంచి పరిణామం

- పి.ప్రకాశంచారి, సర్పంచి గడ్డపోతారం

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించటం మంచి పరిణామం. అయితే పంచాయతీలకు కనీస సమాచారం ఇవ్వాలి. స్థానికంగా మా వంతు సహకారం అందిస్తాం. ఒక్కోసారి ఏర్పాటయ్యే పరిశ్రమ ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటివి ఉండకూడదు.

గతంలో ఏళ్లు పట్టేది

- ఎం.ఆనంద్‌రావు, పారిశ్రామిక యాజమాన్యాల సంఘం కార్యదర్శి, ఐడీఏ బొల్లారం

గతంలో పరిశ్రమల స్థాపనకు 13 ప్రభుత్వ శాఖల చుట్టూ ఏడాది తిరిగినా అనుమతి వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా కంప్యూటర్‌ ముందు కూర్చుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో అనుమతులు వస్తున్నాయి. దీంతో అవినీతికి తావులేదు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.