close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

హస్తకళలు.. ఆదరణ కరవు


వస్త్రంపై బ్లాక్‌ ప్రింటింగ్‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో తయారయ్యే ‘ఇక్కత్‌’ పట్టు చీరలు కళాత్మకమైనవి. ఈ వస్త్రాలకు ‘పెటెంట్‌’ లభించడం ఈ కళాకారుల గొప్పదనాన్ని తెలుపుతోంది. భారతీయ పురాతన కళల్లో టై అండ్‌ డై, బాతిక్‌, బ్లాక్‌ ప్రింటింగ్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌లకు ఆదరణ ఉండేది. రానురాను అప్పటి హస్తకళలకు ఆదరణ కొరవడి కనుమరుగవుతున్నాయి. జిల్లాలోని చేనేతలు మగ్గాలపై నేసే వస్త్రాలు, కుమ్మరులు తయారు చేసే మట్టిపాత్రలు, వడ్రంగులు కలపపై చేసే నగిషీ పనులు, ఇత్తడి, కంచులోహాలతో చేసే కళాఖండాలు ఉమ్మడి నల్గొండ జిల్లా హస్తకళలకు ఖిల్లా అని నిరూపిస్తున్నాయి. ఖండాంతర ఖ్యాతిని సాధిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే ఈ కళాఖండాలను సృష్టించేందుకు మరింత మంది కళాకారులు ముందుకొచ్చే అవకాశముంది.

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే

నేటి నుంచి హస్తకళల వారోత్సవాలు

బాతిక్‌, బ్లాక్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌

భారతీయ పురాతన కళల్లో బాతిక్‌, బ్లాక్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌ ప్రముఖంగా ఉండేవి. సాదా వస్త్రాలపై కళాకారులు తమ చిత్రకళా నైపుణ్యంతో, ప్రకృతి నుంచి సేకరించిన సప్త వర్ణాల మేళవింపుతో అందమైన డిజైన్లను చిత్రించేవారు. కాలక్రమంలో ఈ కళ కొన్ని ప్రాంతాలకే, కొందరు కళాకారులకు మాత్రమే పరిమితమైంది. ఈ కళను ఇప్పటి తరానికి అందించాలని ఫ్యాషన్‌ డిజైనర్‌ మల్కాపురంలో కార్యశాలను ఏర్పాటు చేశారు. ఔత్సాహిక కళాకారులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు.

సమస్త వృత్తుల కళాకారులు

పల్లెల్లోని కుమ్మరి సారె, పద్మశాలీల మగ్గం, వడ్రంగి ఉలి, కమ్మరి కొలిమి ఇవన్నీ హస్తకళాకారుల కార్యక్షేత్రాలు. సమస్త వృత్తుల కళాకారులు తయారు చేసిన కళారూపాలను ఆదరించేవారు కరవయ్యారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం హస్తకళాకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులిచ్చి, వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచే శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నారు. నేటి నుంచి నిర్వహించనున్న హస్తకళా వారోత్సవాల్లో జిల్లాలోని హస్తకళాకారులకు ప్రత్యేక గుర్తింపు, ఉపాధినిచ్చే ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరముంది.

తేలియా రుమాల్‌...

నల్గొండ జిల్లా పుట్టపాక చేనేత కళాకారుల అద్భుత కళా నైపుణ్యానికి మచ్చుతునక తేలియా రుమాల్‌. రైతులు పండించే పత్తి నుంచి నూలును తయారు చేసి దానికి ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో ప్రత్యేకమైన రంగులద్దుతారు. ఆ దారానికి ప్రకృతి అందాలను ప్రతిబింబించే పలురకాల డిజైన్లను రూపొందిస్తారు. నిలువు, పేకల్లో ఒక్కో పోగును మగ్గంపై కలబోసి అద్భుతమైన డిజైన్లతో వస్త్రాన్ని నేస్తారు. ఈ కళాప్రక్రియ కేవలం ఈ ప్రాంతానికే సొంతం. ఈ వస్త్రం లండన్‌లోని మ్యూజియంలో భద్రపర్చారంటేనే ఈ వస్త్రం గొప్పదనమేంటో అర్థమవుతుంది. ఈ వస్త్రాలను నేసిన కళాకారులకు భారత ప్రభుత్వం జాతీయ హస్తకళల పురస్కారాలను రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం చేసి సత్కరిస్తున్నది.

పోచంపల్లి పట్టుచీర

పోచంపల్లి పట్టుచీరకు ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చింది ‘ఇక్కత్‌’ కళా నైపుణ్యం. అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్‌ డిజైనర్లను, వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ చీరలను ఆకర్షణీయమైన వర్ణాలతో, సంప్రదాయ డిజైన్లతో చేనేత కళాకారులు తమ హస్తాలతో తయారు చేస్తారు. 1999లో భారత ప్రభుత్వం రూపొందించిన జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ చట్టం ప్రకారం ఈ చీరకు మేథో హక్కు లభించింది. దీనికి అనుకరణలు లేకుండా రక్షణ చర్యలు తీసుకుంటే పోచంపల్లికి ప్రత్యేకించిన ఈ హస్తకళారూపం ముందుతరాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది.

స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మట్టి పాత్రలను

కళాత్మకంగా మార్చడంతో శిక్షణపొందుతున్న మహిళలు

కళాత్మకమైన మట్టిపాత్రలు

హస్త కళాకారులు మట్టితో అద్భుత కట్టడాలు నిర్మించడంతో పాటు పలు అలంకరణ వస్తువులను రూపొందించేవారు. మట్టితో వినాయకుడిని తయారు చేసి పూజించే సంప్రదాయం ఉంది. దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇవన్నీ హస్త కళాకారుల చేతుల్లో జీవం పోసుకునేవే! కళాత్మక వస్తువులకు పూర్వ వైభవం తేవడానికి పలు రకాల వస్తువులను మట్టితో తయారు చేసి ఉపాధి పొందడానికి భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో కళాకారులకు శిక్షణనిస్తున్నారు.

బంజారా అలంకరణ వస్త్రాలు

బంజారాలు అత్యధిక సంఖ్యలో నివసించే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు వారి వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ. అద్దాలు, పూసలు, బంగారు, వెండి బీడ్స్‌తో బంజారా మహిళలు కుట్టిన వస్త్రాలు కళాత్మకంగా ఉంటాయి. ఫ్యాషన్‌ డిజైనర్లను సైతం అబ్బురపరిచే ఈ వస్త్ర నైపుణ్యం సినీ పరిశ్రమను సైతం ఆకట్టుకుంటుంది. పలు సినిమాల్లో ఇక్కడి బంజారా మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాత్మక డిజైనర్‌ వస్త్రాలను సినీ నాయికలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ కళాత్మక కుట్లు, అల్లికలను వృత్తిగా మలిచి ఉపాధి కల్పించడానికి హస్తకళల శాఖ గిరిజన తండాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుంది.

మల్కాపురంలో ప్రాచీనమైన బాతిక్‌ డిజైన్‌ను వస్త్రంపై వేస్తున్న కళాకారుడు


ఇత్తడి హస్తకళాకారులు

చండూరులో వెండితో రూపొందిస్తున్న ఆలయంలో ఉండే శివలింగం

ప్రాణ మట్టం తయారు చేస్తున్న కళాకారుడు సర్వేశ్‌

చండూరు, న్యూస్‌టుడే: చండూరు ఇత్తడి కార్మికులు హస్తకళల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరొందారు. గతంలో 300 కుటుంబాలు దీనిపైన ఆధారపడేవి. ప్రస్తుతం 50 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇత్తడి, రాగి, వెండితో వస్తువులను, పాత్రలను, పూజాసామాగ్రి, పూజ మందిరాలు, ఆలయాలో ఉండే వెండి నగిషీలు, ధ్వజస్తంభాలకు ఇత్తడి తొడుగులు, రథ పీటలు, ఇత్తడి బిందెలు వంటివి తయారు చేస్తారు. హైదరాబాదుతో చుట్టు పక్కల రాష్ట్రాల వారు ఆర్డర్లు ఇస్తారు. ఆలయాలు నిర్మించేవారు వివిధ రకాల ఆభరణాలను, అలంకరణ వస్తువులను వీరితోనే చేయిస్తుంటారు. ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా కేవలం చేతి పనిద్వారానే వస్తువులను తయారు చేయటం ఇక్కడి కార్మికుల ప్రత్యేకత.


ముందు తరాలకు అందించాలని...

- కె. కృష్ణమూర్తి, ఫ్యాషన్‌ డిజైనర్‌, మల్కాపురం

నిఫ్ట్‌లో సిర్టిఫికెట్‌ కోర్సు చేశాను. దిల్లీలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌లో శిక్షణపొందాను. థర్డ్‌ వరల్డ్‌ ఎక్స్‌పోర్టు హౌజ్‌లో ఫ్యాషన్‌ కోఆర్డినేటర్‌గా ఉద్యోగం చేశాను. తర్వాత కొంత కాలానికి మల్కాపురంలో ‘మిమి క్రాఫ్ట్స్‌’ ప్రారంభించాను. భారతీయ సంప్రదాయ హస్తకళలపై పరిశోధన చేయడం, ఆనాటి కళలను సజీవంగా ఉంచడం, వాటికి మెరుగులద్ది ముందు తరాలకు అందించడానికి కృషి చేస్తున్నాను. పాలకులు హస్తకళలు అంతరించకుండా చూడాలి. ముందు తరాలకు ఈ కళలను అందించాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.