close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

అంగట్లో అన్నీ ఉన్నాయ్‌...

ముచ్చటైన మేలి ముత్యాలు కావాలా..
అందమైన చేతులకు రాళ్ల గాజులు అలంకరించుకుంటారా..
పుష్ప సౌరభాలు ఆస్వాదించేందుకు సిద్ధమా..
పలు రకాల ఫలాలు ఆరగిద్దాం వస్తారా..
మెచ్చిన సాహిత్యం పఠించాలనుకుంటున్నారా..
చౌకగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు..
అందుబాటు ధరల్లో గృహోపకరణాలు కొనాలని ఉందా..
ఇలా ఒకటేమిటి.. అన్ని వర్గాల అభిరుచులను, అవసరాలను తీర్చేందుకు భాగ్యనగరం విభిన్న మార్కెట్లకు అడ్డాగా నిలుస్తోంది.

- న్యూస్‌టుడే, హిమాయత్‌నగర్‌


వాహనాల కింగ్‌ కింగ్‌ కోఠి

నగరంలో ద్విచక్ర వాహనం లేకపోతే జీవించడం కష్టం అన్నట్లు ఉంటాయి పరిస్థితులు. కొందరు ప్రైవేటు రుణాలపై వాహనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడకపోవచ్చు. అందుకే వాడిన వాహనాలు తక్కువ ధరకు లభిస్తాయనే ఉద్దేశంతో ఆటో కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి వారికి అనువైన కేంద్రం కింగ్‌కోఠి. అన్నిరకాల వాహనాలు ముస్తాబై విక్రయానికి ఉంటాయి.్చ
* పాతవే.. కానీ కొత్తగా ముస్తాబై ఉంటాయి.
* బడ్జెట్‌లో కావాల్సింది కొనొచ్చు.
* మంచి కండిషన్‌లో ఉన్న వాహనాలూ తక్కువ ధరకే లభిస్తాయని నమ్మకం.
* చూసి కాకుండా నడిపి కొంటే మంచిది.
* తెలిసిన మెకానిక్‌నూ తీసుకెళ్లాలి.
* అన్ని పత్రాలున్నాయో అక్కడే చూసుకోవాలి.
ధరలు :  మొదట షోరూం ధరలే చెబుతారు. మెకానిక్‌ను తీసుకెళ్లి అంచనా వేసుకొని నచ్చిన ధరకు మాట్లాడుకోవాలి.
పనివేళలు : ప్రతీరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.

ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్‌ నుంచి 40 నంబరు బస్సులో వచ్చి కింగ్‌కోఠి స్టాపులో దిగాల్సి ఉంటుంది. కూకట్‌పల్లి వైపు నుంచి వచ్చేవారు 83కె బస్సులో చేరుకోవచ్చు.
ఎంత కాలం నుంచి:  30 ఏళ్ల నుంచి.
వ్యాపారం: రోజుకు కనీసం 200 వాహనాలు విక్రయిస్తారు.


ముచ్చటైన ముత్యాలు


హైదరాబాద్‌ ముత్యాలకు పెట్టింది పేరు. నాణ్యమైన ముత్యాల కోసం దేశ, విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. చార్మినార్‌లోని పటేల్‌ మార్కెట్‌ అంటేనే ముత్యాల విక్రయాలకు ప్రసిద్ధి. ఇతరప్రాంతాలలోనూ లభించినా, ఇక్కడ ముత్యాలకు రంధ్రాలు చేయడంలో ఎంతో నేర్పరులున్నారని పేరుంది. అంతేనా.. మంచి ముత్యాలను ఎంచి.. వాటికి నగిషీలు చేయడంలోనూ ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.

విశేషం..
* నాణ్యమైన ముత్యాలు దొరుకుతాయి.
* ఖరీదైన బర్సా ముత్యాలనూ  కొనొచ్చు.
* ముత్యాలకు రూపునిచ్చి, అతి చిన్న రంధ్రాలు చేయడంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక పేరుంది.
* ముత్యాలకు నగిషీలు దిద్ది, ఆభరణాలలో పొందుపర్చుతారు.
ధరలు : క్యారెట్‌ రూ.1000 అంటారు. ధర విషయంలో మాట్లాడొచ్చు. ్చ
పనివేళలు : ప్రతీ రోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.

ఇలా వెళ్లొచ్చు
దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకు అనేక రూట్లలో బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నడక మార్గంలోనే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
ఎంత కాలం నుంచి ఉంది : నిజాంల కాలం నుంచి.


ఎలక్ట్రానిక్‌ వస్తు నిధి గుజరాత్‌ గల్లీ

మనకు ఇంట్లో టీవీ ఉండొచ్చు. దానికి సౌండ్‌ సిస్టమ్‌ కోరుకుంటాం. అలాంటివి ఎక్కడ లభిస్తాయనే ప్రశ్నకు కోఠిలోని గుజరాతీ గల్లీ సమాధానం. చిన్నచిన్న శుభకార్యాలకు మొదలు.. బహిరంగ సభలకు వాడే పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ల వరకు ఈ ప్రాంతంలో లభిస్తాయి. అన్ని రకాల ఔత్సాహిక ఛాయాగ్రాహకులకు అవసరమైన స్టూడియో పరికరాలూ సమీపంలోనే లభిస్తాయి.

విశేషం..
* పెద్ద కంపెనీల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ పరికరాలు లభిస్తాయి.
* స్పీకర్లు,ఆంప్లిఫయర్లు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, కాలర్‌ మైకులూ దొరుకుతాయి.
* ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వింతలు చూడొచ్చు.
* కళాశాల ప్రాజెక్టు వర్కుకు కావాల్సినవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ధరలు : సామర్థ్యాన్నిబట్టి ధరలుంటాయి. విదేశీ మాల్‌ ఉంటుంది. అవగాహనతో వెళ్లడం మంచిది.
పనివేళలు : ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (ఆదివారం, పండగ రోజులు సెలవు).

ఇలా వెళ్లొచ్చు
కూకట్‌పల్లి వైపు నుంచి 187 నంబరు బస్సులో చేరుకోవచ్చు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి 1వి, 107 నంబరు బస్సులతో కోఠికి చేరుకుంటే అక్కడి నుంచి నడిచి వెళ్లొచ్చు.
ఎంత కాలం నుంచి:  1980 నుంచి. నిత్యం
రూ.కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.


పుష్ప మేళా

 

మనం పండగల వేళ, శుభకార్యాలకు ఇళ్లను పూలతో తీర్చిదిద్దుతుంటాం. ఆయా సందర్భాలలో పూల ధరలు ఆకాశాన్ని చేరుకుంటుంటాయి.  ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేవే గుడిమల్కాపూర్‌, జాంబాగ్‌ పూల మార్కెట్లు. ఏ వేళలోనైనా కావాల్సిన పుష్పాలను ఈ ప్రాంతాలలో పొందవచ్చు. కిలోల చొప్పున విక్రయిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద మాలలూ సిద్ధంగా ఉంటాయి.

విశేషం..
* ఆయా కాలాలలో లభించే పుష్పాలు, నిత్యం దొరికే పూలకు ఈ మార్కెట్‌ కేంద్రం.
* వేల మందికి జీవనాధారం.
* రైతులే కొయించుకొచ్చి అప్పటికప్పుడు విక్రయిస్తుంటారు.
* పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో కాలు తీసి కాలు పెట్టలేనంత రద్దీ ఉంటుంది.
ధరలు : సమీపంలోని రైతులే పండించినవి కావడంతో నగరంలో రూ.వందల్లో ధర ఉంటే ఇక్క రూ.పదుల్లోనే వస్తాయి.
పనివేళలు : ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు మొదలవుతాయి.

ఇలా వెళ్లొచ్చు
సనత్‌నగర్‌ నుంచి 9, 9ఎఫ్‌ బస్సుల్లో మొజాంజాహి నుంచి జాంబాగ్‌ చేరుకోవాలి.
గుడిమల్కాపూర్‌ వెళ్లాలంటే.. నారాయణగూడ, నల్లకుంట నుంచి 6టి బస్సులో వెళ్లొచ్చు.
ఎంత కాలం నుంచి : జాంబాగ్‌ మార్కెట్‌ 60 ఏళ్లది. గుడిమల్కాపూర్‌ 30 ఏళ్ల క్రితంది.
సందర్శకులు: జాంబాగ్‌ మార్కెట్‌కు రోజుకు 2వేల-4 వేలు, గుడిమల్కాపూర్‌కు రోజుకు
5వేల మందికి వస్తారు.


సాహిత్య.. సంగమం

 

చిన్నప్పుడెప్పుడో చదివిన పుస్తకం మళ్లీ చదవాలని దొరక్క విసిగిపోయిన వారికి అబిడ్స్‌ ఆదివారం మార్కెట్‌ స్వాగతం పలుకుతోంది. అబిడ్స్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అరుదైన, పాత, కొత్త పుస్తకాల విపణి ఉంటుంది. పుస్తకాలూ అతి తక్కువ ధరకు లభ్యం అవుతాయి. కొత్త, పాత, విద్య, కల్పితాలు, నవలలకు సంబంధించిన సమస్త పుస్తక సాహిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

విశేషం..
* తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, ఇతర భాషల్లోని పాత పుస్తకాలూ ఉంటాయి.
* మీ వద్ద అవసరం లేని పుస్తకాలుంటే వ్యాపారులు కొంటారు కూడా.
* పుస్తకయాత్ర అబిడ్స్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌, కోఠి గల్లీల్లో సాగుతుంది.
ధరలు : పాత పుస్తకాలపై బేరం చేస్తే వ్యాపారి చెప్పిన ధర కంటే 60శాతానికి తగ్గించొచ్చు. కొత్తవీ తక్కువ ధరకు పొందొచ్చు.
ఎప్పుడు : ఆదివారం తప్పని సరిగా ఉంటుంది. సెలవు రోజుల్లోనూ స్థానిక వాణిజ్య సముదాయాలు మూసి ఉంటే వాటి ఎదుటే దర్శనమిస్తాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. ్చ

ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్‌ నుంచి అబిడ్స్‌, కోఠిలకు 8ఎ, 40 బస్సులు అందుబాటులో ఉంటాయి. కూకట్‌పల్లి నుంచి 187నంబరు బస్సులు ఉంటాయి.
ఎంత కాలం నుంచి ఉంది : 4 దశాబ్దాలు, సందర్శకులు: సుమారు 2 వేలు


వన్నెలీనే వస్త్రాలు

నచ్చిన దుస్తులు, తక్కువ ధరకు దొరుకుతాయంటే మహిళలు ఎంత దూరమైనా వెళ్లేందుకు ఇష్టపడుతారు. అన్నిరకాల డిజైన్లు, రంగుల దుస్తులు రెడీమేడ్‌లో దొరకవు. ఇందుకు నగరమంతా గాలించి నచ్చిన రకాలవి సొంతం చేసుకోవడానికి తగిన సమయం సరిపోదు. తక్కువ సమయంలో తక్కువ ధరలో అనుకున్నవి లభించాలంటే చార్మినార్‌ పటేల్‌ మార్కెట్‌కు వెళ్లాల్సిందే.

విశేషం..
* అన్ని బ్రాండెడ్‌ దుస్తుల తరహాలోనివి దొరుకుతాయి.
* నాణ్యత, రంగులకు ప్రసిద్ధి.
* ఆర్థిక స్థితులనుబట్టి ఆయా ధరల్లో లభిస్తాయి.
* డ్రెస్‌ మెటీరియల్‌, చీరలు, కర్టెన్లు, దుప్పట్లూ ఉంటాయి.
ధరలు : బయటి మార్కెట్లతో పోల్చితే 50 నుంచి 60 శాతం తక్కువ ఉంటాయి.
పనివేళలు : ప్రతీ రోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.

ఇలా వెళ్లొచ్చు
ఉప్పల్‌ నుంచి 71, ఎల్బీనగర్‌ నుంచి 78, అమీర్‌పేట నుంచి 9 నంబరు బస్సులలో చార్మినార్‌ చేరుకోవచ్చు. అక్కడికి వందల అడుగుల దూరంలోనే ఈ మార్కెట్‌ ఉంది.
ఎంత కాలం నుంచి ఉంది : దశాబ్దాల క్రితం నుంచే..
రోజు సందర్శకులు: సుమారు పదివేలకు తక్కువ ఉండరు.


సందడిగా అంగడి

జుమ్మేరాత్‌ బజార్‌

ఒకప్పుడు చోర్‌ బజార్‌గా పేరున్న ఈ ప్రాంతం ప్రతి గురువారం ఉంటుంది. అందువల్ల దానిపేరు జుమ్మేరాత్‌ బజార్‌గా మారింది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. అందుకే ప్రతి గురువారం తెల్లవారు జామునే ఇక్కడికి వేల మంది వస్తుంటారు. ఓపికతో వెతుక్కుంటే ఇంట్లో ఉపకరించే వస్తువులన్నీ మన ఆర్థికావసరాన్నిబట్టి కొనుక్కోవచ్చు.

విశేషం..
* పాత కాలం నాణేలూ దొరుకుతాయి.
* పనికిరాని వస్తువులు బాగు చేసి ఇస్తారు.
* ఎలాంటి వస్తువైనా, పరికరమైనా ఇక్కడ లభించి తీరాల్సిందే.
* నాణ్యమైనవి కావాలంటే తెల్లవారుజామున 5 గంటలకే చేరుకోవాలంటారు.
* గృహోపకరణాలు కుప్పగా  వేలం వేస్తారు.
ధరలు : రూ.10 పెన్ను నుంచి రూ.లక్షలు విలువైన మిల్లులూ దొరుకుతాయి. కానీ  నాణ్యతను బట్టి మాట్లాడుకోవాలి.
పనివేళలు : కేవలం గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుంది.

ఇలా వెళ్లొచ్చు
నారాయణగూడ నుంచి 137 నంబరు బస్సు, అమీర్‌పేట నుంచి 9ఎఫ్‌ బస్సుల ద్వారా బేగంబజార్‌ స్టాపునకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఐదు నిమిషాల నడకతో మార్కెట్‌కు వెళ్లొచ్చు.
ఎంత కాలం నుంచి: 50 ఏళ్లకంటే ముందే. సందర్శకులు: కనీసం రూ.2వేల-10వేల మంది


సెల్‌  చలో చలో

చరవాణికి ఏమైనా సమస్యలు తలెత్తితే సంస్థకు చెందిన సర్వీస్‌ సెంటర్‌కు వెళతాం. అది సాధ్యం కానప్పుడు గుర్తుకొచ్చేదే జగదీష్‌ మార్కెట్‌. చరవాణుల చిరునామా ఇది. నచ్చిన సిరీస్‌ ఫోన్లు ఎలా పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రాంతం దోహదపడుతుంది. ఇక్కడ కొంటే విధిగా బిల్లు తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

విశేషం..
* కొత్త, పాత చరవాణులు లభ్యం అవుతాయి. కొనే ముందు చూసుకోవాలి.
* ఫోను బ్యాక్‌ కేసుల నుంచి ప్రతి ఒక్కటీ దొరుకుతుంది.
* ఎంత పాతదైనా మరమ్మతు చేస్తారు,
* కొత్త, పాత సాఫ్ట్‌వేర్లూ లభిస్తాయి.
ధరలు : చరవాణులపై అవగాహన ఉంటే మీకు నచ్చిన ఫీచర్లను కలబోసి తక్కువ ధరలో చక్కని ఫోను కొనొచ్చు.
ఎప్పుడు : ఉదయం 11 గంటల నుంచి
రాత్రి 8  గంటల వరకు (ఆదివారం సెలవు).

ఇలా వెళ్లొచ్చు
అబిడ్స్‌ స్టాపులోనే బస్సు దిగి, సమీపంలోనే ఉన్న సంతోష్‌-స్వప్న సినిమా థియేటర్ల పక్క వీధిలోకి ప్రవేశిస్తే అదే జగదీష్‌ మార్కెట్‌.
ఎంత కాలం నుంచి ఉంది : 2006
సందర్శకులు: రోజు 2 వేల-4 వేలు


బొమ్మల బజార్‌ బేగంబజార్‌

మసాలాలు, ప్లాస్టిక్‌ ఆటబొమ్మలు, ఎలక్ట్రానిక్‌ ఆటబొమ్మలు, వంటింటి సామగ్రికి ఈ బేగంబజార్‌ ప్రసిద్ధి. అన్నిరకాల వస్తువులు దొరుకుతాయి. అజీజ్‌ ప్లాజా భవనం మొత్తం ఆటబొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులే కనిపిస్తాయి. ప్లాజా దాటి గల్లీలోకి వెళ్తే.. మసాలాల ఘుమఘుమలు రారమ్మని ఊరిస్తుంటాయి. పెద్ద పెద్ద కార్యాలకు ఇక్కడి నుంచే వంట సామగ్రి తీసుకెళ్తుంటారు.

విశేషం..
* అవసరమైన మసాలా దినుసులు, పిల్లల బొమ్మలు, ఆట సామగ్రి దొరుకుతాయి.
* వంటింట్లో ఉపకరించే ప్రతి వస్తువు దొరుకుతుంది.
* బహుమతులు, స్టీలు సామాన్లు ఉంటాయి.
* పెళ్లిళ్ల కాలంలో అది ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది.

ధరలు : బయటికంటే తక్కువ ధరకే దొరుకుతాయి. స్టీలు వస్తువులు, ఆట వస్తువులూ బయటికంటే 50 శాతం తక్కువకు వస్తాయి.
పనివేళలు :  ఆదివారం, పండగ రోజుల్లో మినహా ప్రతీరోజు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.

ఇలా వెళ్లొచ్చు
మౌలాలి, తార్నాక నుంచి 4 నంబరు బస్సులో, సికింద్రాబాద్‌ నుంచి 1వ నంబరు బస్సులో అఫ్జల్‌గంజ్‌ వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి కేవలం 5 నిమిషాల నడకతో బేగంబజార్‌కు చేరుకోవచ్చు.
ఎంత కాలం నుంచి:  కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పడింది. నిత్యం వేల మంది వస్తుంటారు.


సాంకేతిక అడ్డా సీటీసీ

కొత్తగా కంప్యూటర్‌ కొనాలనుకుంటే నెట్‌లోనే చూస్తాం. కావాల్సింది ఉన్నా ఆర్థిక వెసులుబాటు ఉండకపోవచ్చు. కంప్యూటర్‌లో కొత్తగా వచ్చిన సాఫ్ట్‌వేర్‌ను, కొత్త వీడియోగేమ్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలనుకున్నా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే సౌలభ్యం లేనివారు ఇక్కడికి రావాల్సిందే. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ పనితీరు వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

విశేషం..
* సెకండ్‌ హ్యాండ్‌, కొత్త ల్యాపీలు లభిస్తాయి.
* ఏ ఆపరేటింగ్‌ (అధికారిక, అనధికారిక) సిస్టమైనా ఇన్‌స్టాల్‌ చేస్తారు.
* సీపీ, ల్యాపీల మరమ్మతులకు వందల కేంద్రాలు ఉన్నాయి.
* సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, కంప్యూటర్‌లకు అనుసంధాన పరికరాలూ లభిస్తాయి.
ధరలు : సంస్థలకు చెందిన అధికారిక సాఫ్ట్‌వేర్లు కచ్చితమైన ధరలుంటాయి. కానీ మరమ్మతులో బేరం ఆడొచ్చు.
పనివేళలు : ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (ఆదివారం సెలవు).

ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సెంటర్‌ లేదా ప్యాట్నీ వద్ద బస్సు దిగి నడిచి వెళ్లొచ్చు. మెహిదీపట్నం నుంచి 5 నంబరు, కూకట్‌పల్లి నుంచి 10 నంబరు బస్సులున్నాయి.
ఎంత కాలం నుంచి: 2000లో ప్రారంభం
సందర్శకులు: రోజు కనీసం 20వేలు (అంచనా)


పేదల సంత

ఎర్రగడ్డ బజార్‌

 

నగరంలో కొన్ని వందల రకాల ఉత్పత్తులు, అందులోనూ భిన్నమైనవి ఒకేచోట ఎక్కడైనా దొరుకుతాయా అనే ప్రశ్నకు ఏకైక సమాధానం ఎర్రగడ్డ బజార్‌. దుస్తులు మొదలుకొని నాటు కోడి వరకు, బస్సు టైరు మొదలుకొని టేపు రికార్డరు వరకు, సీడీల నుంచి పెన్‌డ్రైవ్‌ల వరకు మన రోజువారీ దినచర్యలో కనిపించే ప్రతి వస్తువును ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

విశేషం..
* పశువులు, జిమ్‌ పరికరాలు, సౌందర్య సాధనాలు అన్ని దొరుకుతాయి.
* కిలోమీటరు దూరం వరకు రోడ్డుకు రెండు వైపులా విస్తరించి ఉంటుంది.
* చిన్న లోపాలున్న బ్రాండెడ్‌ వస్తువులూ వ్యాపారులు తక్కువ ధరకు పెడతారు.

ధరలు :  వస్తువుల నాణ్యతను బట్టి వ్యాపారులు ధరలు నిర్ణయిస్తారు. బేరం ఆడి ధరలు తగ్గించుకోవచ్చు.
పనివేళలు : ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.

ఇలా వెళ్లొచ్చు
నారాయణగూడ, ఉప్పల్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు 113కె నెంబరు, సికింద్రాబాద్‌ నుంచి వచ్చేవారు 10వ నెంబరు బస్సుల్లో రావచ్చు. చార్మినార్‌ వైపు వారికి 9వ నంబరు బస్సులున్నాయి.
ఎంత కాలం నుంచి ఉంది : 40 ఏళ్ల నుంచి. సందర్శకులు: సుమారు 10 వేలు.


అగ్గువలో ఆరోగ్యం!

పండ్ల మార్కెట్‌

ఆరోగ్యానికి ఫలాలు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. ఆయా కాలాల్లో పండే పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పొందవచ్చని వైద్యులు చెబుతుంటారు. అన్ని రకాల పండ్లు కావాలంటే అందరూ కొత్తపేట పండ్ల మార్కెట్‌కు రావాల్సిందే. బయట మార్కెట్లో దొరికినా ఆ ధర భరించలేమని వ్యాపారులూ ఇటే వస్తారు. సామాన్యులూ వచ్చి పెద్ద మొత్తంలో ఇక్కడే కొంటారు. నగరంలో పెద్ద మార్కెట్‌ ఇదే!

విశేషం..
* లారీల్లోంచి పండ్లు దిగుమతి చేసేటప్పుడు తక్కువ ధరకు వస్తాయి.
* పెద్దఎత్తున కొనుగోలు చేసేవారికి మాత్రమే ఉపయుక్తం.
* దేశంలో దొరికే రకాలన్నీ దొరుకుతాయి.
* మార్కెట్‌ ముందు కాలిబాటపై కొనేటప్పుడు మాత్రం మంచివో కావో చూసుకోవాలి.
ధరలు :  హోల్‌సేల్‌గా కొంటే తక్కువ ధరలకు వస్తాయి.
పనివేళలు :  ఉదయం 6 గంటల నుంచి రాత్రి చీకటి పడే వరకు. పండగ దినాల్లో అన్ని రకాల ఆకులు, గుమ్మడికాయలు లభిస్తాయి.

ఇలా వెళ్లొచ్చు
సికింద్రాబాద్‌ నుంచి ‘1వి’ బస్సులు, కూకట్‌పల్లి వైపు వారికి ‘186’ బస్సులుంటాయి.  మార్కెట్‌ ఎదుటే దిగొచ్చు. మెట్రో స్టేషన్‌ కూడా ఉంది.
ఎంత కాలం నుంచి: 20 ఏళ్లు దాటింది.
సందర్శకులు: హోల్‌సేల్‌ వ్యాపారులు ఎక్కువ వస్తుంటారు.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.