close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

దళారీల చేతుల్లోకి ప్రభుత్వ గోనె సంచులు?

రుద్రాక్షపల్లిలో వెలుగులోకి

రైతు ఫిర్యాదుతో లారీని సీజ్‌ చేసిన పౌరసరఫరాల డీటీ

అధికారులు వచ్చే వరకు లారీ కదలకుండా బైఠాయించిన రైతు నాగిరెడ్డి

రుద్రాక్షపల్లి(సత్తుపల్లి), న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే ధాన్యం తరలించే గోనె సంచులు విచ్చలవిడిగా దళారీల చేతుల్లోకి వెళ్తున్నాయి. సత్తుపల్లి మండలంలో సోమవారం వెలుగు చూసిన ఘటనే ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. వివరాలను పరిశీలిస్తే... సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన రైతు ఒగ్గు నాగిరెడ్డి కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని బుగ్గపాడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా తన 200 బస్తాల ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. అతని ధాన్యం ఇప్పటివరకు కొనలేదు. ఈ క్రమంలో రుద్రాక్షపల్లికే చెందిన రేషను డీలర్‌ శ్రీనివాసరెడ్డి ప్రధాన రహదారిపై ఆరబోసిన తన ధాన్యాన్ని మధ్యవర్తి ద్వారా ఓ దళారీకి విక్రయించారు. ఆ దళారీ తన వద్ద పని చేసే బాషా అనే గుమస్తా ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి కూలీలతో లారీలోకి లోడు చేయిస్తున్నాడు. దీనిని రైతు నాగిరెడ్డి అడ్డుకుని, 15 రోజులుగా యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రోడ్లపై పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారేంటని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులనూ ప్రశ్నించారు. ఆ ధాన్యాన్ని తాము కొనుగోలు చేయలేదని వారు చెప్పడంతో... అసలు ప్రభుత్వం సరఫరా చేసే గోనె సంచులు దళారీ వద్దకు ఎలా వచ్చాయని నిలదీశారు. లోడింగ్‌ అయిన లారీని కదలకుండా ధాన్యం లారీ ఎదుట బైఠాయించారు. రైతు ఆందోళన చేస్తున్న సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ డీటీ సురేందర్‌ గ్రామానికి చేరుకుని విచారించగా ధాన్యం తరలించే గోనె సంచులు ఆ సొసైటీ పరిధిలోనివి కాదని తేలింది. అసలు దళారీ ఎవరు? అతనికి ప్రభుత్వ గోనెసంచులు ఎక్కడి నుంచి వచ్చాయని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా అప్పటి వరకు అక్కడే ఉన్న గుమస్తా అదృశ్యమయ్యాడు. లారీ డ్రైవర్‌ నాగేశ్వరరావు మాత్రం తాను కిరాయికి లారీని పెట్టానని తనకేమీ తెలియదని చెప్పాడు. అదృశ్యమైన గుమస్తా చరవాణికి పౌర సరఫరాల అధికారి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో లారీని సీజ్‌ చేసి సత్తుపల్లిలోని రైస్‌ మిల్లులో భద్రపరిచారు.

ప్రభుత్వ ముద్రతో ఉన్న గోనె సంచులు

దీనిని బట్టి చూస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన గోనె సంచులు పక్కదారిన దళారీల చేతుల్లోకి వెళ్తున్నాయనేది స్పష్టమవుతోంది. అధికారులకు తెలిసే గోనె సంచులు బయటకు వస్తున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ అంశమై డీటీ సురేందర్‌ వివరణ ఇస్తూ లారీని సీజ్‌ చేశామని, పూర్తిస్థాయిలో విచారించి నివేదికను జేసీకి అందిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.