close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

ఉల్లి సాగు పెంపే లక్ష్యం

రాయితీపై విత్తన సరఫరాకు ప్రభుత్వ నిర్ణయం

మూడేళ్ల తర్వాత రైతులకు చేయూత

న్యూస్‌టుడే, గద్వాల

 

ఉండవొెల్లి మండలంలో ఖరీఫ్‌లో సాగైన ఉల్లి పంట (పాతచిత్రం)

ఉల్లి ధరలు ఘాటెక్కి, సామాన్యుల కంట తడిపెట్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా ఉల్లిని రైతులు సాగు చేస్తుండేవారు. విత్తన ధరలు ఆకాశాన్నంటడం, సాగుకు పెట్టుబడులు అధికం కావడంతో ఉల్లి సాగు విస్తీర్ణం నానాటికి తీసికట్టుగా మారింది.

దీంతో స్థానికంగా ఉల్లి లభ్యత లేక డిమాండు అధికమైంది. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో ధరలు అమాంతం పెరిగాయి. జిల్లాలో ఉల్లి కిలో ధర రూ.110 వరకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. హోటళ్లు, తినుబండారాల స్టాళ్ల వద్ద ఉల్లి వినియోగాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఉల్లి సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రైతులను ప్రోత్సహించేందుకు రాయితీపై విత్తన పంపిణీ చేపట్టనుంది.

ఖరీఫ్‌లో 3,786 ఎకరాలు.. రబీలో 325

జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ ఉల్లి సాగు విస్తీర్ణం 8,750 ఎకరాలుగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,786 ఎకరాల్లో మాత్రమే సాగైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా సాగైన పంటలో సగం వరకు దెబ్బతినగా జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. రబీలో సాధారణ సాగు 4,500 ఎకరాలు ఉండగా 325 ఎకరాలు మాత్రమే సాగైంది. సాగు తగ్గటానికి కారణం విత్తన ధరలు పెరగడం, పెట్టుబడులు భారం కావడమేనని రైతులంటున్నారు. ఎకరా ఉల్లి సాగు కోసం మూడు కిలోల వరకు విత్తనం అవసరం అవుతుందని, కిలో విత్తనం బహిరంగ మార్కెట్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకు ఉందని రైతులంటున్నారు. ఎకరా సాగుకు కనీసం రూ. 10వేలు పెట్టుబడి అవుతుందని వివరిస్తున్నారు. కూలీల కొరత, సస్యరక్షణ చర్యలతో పెట్టుబడులు తడిసి మోపడవుతున్నాయని వాపోతున్నారు. ఈ క్రమంలోనే రైతులు ఉల్లి సాగును గణనీయంగా తగ్గించుకున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

రాయితీతో ప్రయోజనం

ఉల్లి సాగును పెంచటానికి రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఉద్యాన శాఖ ద్వారా సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు ఉల్లి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. మూడేళ్లుగా ఉద్యాన శాఖ ఎలాంటి విత్తనాలు రాయితీపై సరఫరా చేయటం లేదు. గతంలో కూరగాయల విత్తనాలతో పాటు ఉల్లి విత్తనాలను రాయితీపై సరఫరా చేసేవారు. మూడేళ్ల తర్వాత ఉల్లి కొరత పట్టిపీడిస్తోన్న తరుణంలో రాయితీ విత్తనాలు అందజేయనుండటం ఊరట కలిగిస్తున్నా.. కూరగాయల విత్తనాలు కూడా అందజేస్తే ప్రయోజకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.

ఆదేశాలు రావాల్సి ఉంది..

ఉల్లి విత్తనాలు రాయితీపై రైతులకు అందజేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. లిఖిత పూర్వక ఆదేశాలు రావాల్సి ఉంది. వస్తే ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి విత్తన సరఫరాకు చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి, గద్వాల

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.