close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

వేసవిలో.. కోతలు లేకుండా కార్యాచరణ  


మాట్లాడుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి

 

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం : రానున్న వేసవిలో జిల్లాలో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడానికి పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీరు సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. వేసవిలో విద్యుత్తు వినియోగం అధికమైనప్పుడు సమస్యలు తలెత్తకుండా ఫీడర్ల మధ్య దూరాన్ని తగ్గించామని వివరించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక అంశాలను ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన తెలిపారు. గత వేసవిలో ఏ ప్రాంతంలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంది..? ఎక్కడ తక్కువ ఉంది..? అనే లెక్కలను బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా అక్కడ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. లోవోల్టేజీ సమస్య వస్తున్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత ఫీడర్లలో ఇప్పటికే మరమ్మతులు చేపట్టి కాలం చెల్లిన పరికరాలను మార్పు చేసినట్లు వెల్లడించారు. పురుషోత్తపట్టణం, రాజమహేంద్రవరం గ్రామీణంలోని బాలాజీపేట, రామవరంలలోని 220కేవీ విద్యుత్తు కేంద్రాల నుంచి దగ్గరలో ఉన్న కోరుకొండ, జగ్గంపేట, మండలాల్లో ఉన్న 132/33, 33/11కేవీ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా తీసుకుంటున్నామని.. దీంతో వాడకం అధికంగా ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుందని పేర్కొన్నారు. మామూలు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 10.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తే వేసవిలో 17మిలియన్‌ యూనిట్ల వరకు వినియోగిస్తారని.. ఆ సమయాల్లో ఎదురయ్యే సమస్యలను కూడా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌ఈ వివరించారు.

తక్షణమే మరమ్మతులు..

వేసవిలో ఎక్కడైనా అధిక లోడు, తక్కువ లోడు సమస్యలు తలెత్తినా.. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైనా తక్షణమే పరిష్కరించడానికి ప్రతి డివిజినల్‌ ఇంజినీరు కార్యాలయం పరిధిలో 16, 40, 60, 100, 160, 360 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లు 10 నుంచి 15 వరకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇలా జిల్లాలో రెండు వేల వరకు ఉన్నాయన్నారు. సమస్య వచ్చి తరువాత ఎంత సేపట్లో సిబ్బంది పరిష్కరిస్తున్నారో నిఘా ఉంచామని చెప్పారు. వినియోగదారుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈ తెలిపారు. జిలాల్లో 220/132కేవీ.. 6, 132/33కేవీ..16, 33/11కేవీ..202 విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయని, ఇవి కాకుండా ముమ్మిడివరం, గొల్లప్రోలులో 33/11కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం పూర్తయిందని త్వరలో వాటినికూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

సేద్యానికి పగటిపూట..

జిల్లా వ్యాప్తంగా 318 ఫీడర్ల పరిధిలో 48,500 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని.. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతుల ప్రకారం దాదాపు 40వేల కనెక్షన్లకు పగటిపూట 9గంటల విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్నామని.. మిగిలిన వాటికి కూడా 9గంటల విద్యుత్తులో కొన్ని గంటలు పగలు..కొన్ని గంటలు రాత్రి ఇస్తున్నామని చెప్పారు. మిగిలిన కనెక్షన్లకు కూడా పగటిపూటే సరఫరా ఇవ్వడానికి గోపాలపురం, ఈలకొలను, సింగంపల్లి, మురారి, ఎస్‌.రాజాపురం, ఇరుపాలెం ప్రాంతాల్లో కేవలం వ్యవసాయ విద్యుత్తు కోసమే 33/11కేవీ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలా కాకుండా వ్యవసాయేతర అవసరాల కోసం ప్రపంచబ్యాంకు నిధులతో మరో 5చోట్ల కొత్తగా 33/11విద్యుత్తు కేంద్రాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అన్నవరంలో 132కేవీ విద్యుత్కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని అయినో ఈ వేసవికి అది పూర్తవ్వదని చెప్పారు.

గత ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని..

గతేడాది ఎన్నికల నేపథ్యంలో వేసవిలో చేపట్టాల్సిన విద్యుత్తులైన్ల మరమ్మతులు చేపట్టలేదు. వర్షాకాలంలో చేయడం వల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమస్య పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. గత నెల నుంచే ప్రతి విద్యుత్తు కేంద్రం పరిధిలో నెలలో మూడు రోజుల పాటు మరమ్మతులు చేపడుతున్నాం. దీనికి ప్రత్యేకించి ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ మూడు రోజుల పాటు ఎర్త్‌పైపులు, కండక్టర్లు, విద్యుత్తు లైన్లలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తారు. అందువల్ల వేసవిలో పెద్దగా సమస్యలు ఉండవు. ఒక వేళ వచ్చినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని పర్యవేక్షక ఇంజినీరు సత్యనారాయణరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.