close

ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనకెందుకు భాయ్‌...

సమాచారం ఇచ్చేందుకు వెనుకంజ

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సికింద్రాబాద్‌: నగరంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కళ్లెదుట కొన్ని దారుణాలు జరుగుతున్నా ఎవరూ స్పందించి సకాలంలో పోలీసు యంత్రాంగానికి సమాచారమివ్వకపోవడం విస్తుగొలుపుతోంది. సికింద్రాబాద్‌, జియాగూడ ఘటనలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ‘‘వారాసిగూడలో ఉంటున్న ఇంటర్‌ విద్యార్థిని నజ్మాతో మాట్లాడేందుకు ప్రేమోన్మాది షోయబ్‌ గురువారం అర్ధరాత్రి దాటాక 12.55గంటలకు వెళ్లాడు. పెళ్లి చేసుకోనంటూ నజ్మా తెగేసి చెప్పడంతో షోయబ్‌ ఆమెను చంపి మేడపై నుంచి మృతదేహాన్ని కిందికి పడేశాడు. 1.20గంటలకు అక్కడినుంచి వెళ్లిపోయాడు...శుక్రవారం ఉదయం 7.15గంటలకు ఓ వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేస్తేగాని విషయం వెలుగులోకి రాలేదు. ’’ నజ్మా మృతిచెందింది అర్ధరాత్రి 1.20గంటలకు.. కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు గమనించలేదు సరే... కానీ ఆ ప్రాంతంలో రోజూ ఉదయం 5గంటల నుంచే హడావుడి ఉంటుంది. ఏ ఒక్కరికి మృతదేహం కనిపించలేదా?..  పోలీసులు ఇదే విషయాన్ని స్థానికులను ప్రశ్నించగా... మాకు తెలీదు సార్‌ అంటూ సమాధానమిచ్చారు. 1.20 నుంచి 7గంటల వరకూ సుమారు ఆరుగంటలపాటు శవం అక్కడే ఉండడం గమనార్హం.

మేకలమండిలోనూ అంతే..  జియాగూడలోని మేకలమండిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. మేకల వ్యాపారి సచిన్‌ను అతడి స్నేహితుడు హత్య చేశాడు. రాత్రి 10.30గంటల నుంచి 11 గంటల మధ్య  ఈఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేకల మండిలో నలుగురురైదుగురు వ్యాపారులు, స్థానికులున్నారు. ఇంతేకాదు... అక్కడికి రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 6గంటల వరకూ ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు లారీల్లో మేకలు రవాణా చేస్తారు. వాటిని దించేందుకు, లెక్కపెట్టుకునేందుకు వ్యాపారులు, పనివాళ్లుంటారు. తమ కళ్లెదుట దాడి జరుగుతున్నా అక్కడున్నవారు గమనించలేదా అన్నది ప్రశ్న. సచిన్‌ చనిపోయిన గంటకు సమాచారం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సచిన్‌, అతడి స్నేహితుడి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు గమనించినా ఎవరూ సముదాయించలేదని తెలుస్తోంది. కనీసం డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పినా  పోలీసులు చేరుకునేవారు. ఈ సంఘటనలే కాదు... ఎదురుగా చెయిన్‌స్నాచింగ్‌ జరిగినా, ఒక వ్యక్తిని అతడి ప్రత్యర్థులు కొడుతున్నా.. రోడ్డు ప్రమాదమై క్షతగాత్రులు కిందపడి బాధపడుతున్నా ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్లిపోయేవారే ఎక్కువని పోలీసు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.  ఇకనైనా వైఖరిలో మార్పు రావాలని, తమ దృష్టికి ఏం వచ్చినా పౌరులు తక్షణం సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.