close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక ఆధునిక వైకుంఠధామాలు!

10 చోట్ల గ్యాస్‌ ఆధారిత దహనవాటికలు

విద్యుత్తుతో నడిచేవాటికీ మోక్షం

అధికారులకు ఆదేశించిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌

రాజధాని పరిధిలో ఆధునిక వైకుంఠధామాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కొత్త తరహాలో ఎల్పీజీ గ్యాస్‌తో నడిచే శ్మశానవాటికలను 10 చోట్ల అందుబాటులోకి తీసుకోవాలని బల్దియా నిర్ణయించింది. ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో 4 గ్యాస్‌ ఆధారిత శ్మశానవాటికలను ఏర్పాటుచేయాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇతర జోన్లలో మరో 6 అందుబాటులోకి రానున్నాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని యంత్రాంగం చెబుతోంది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ జోనల్‌ కమిషనర్లకు పలు ఆదేశాలిచ్చారు.

నగరంలో 850కి పైగా శ్మశానవాటికలు ఉన్నాయి. అయినా కరోనా మృతుల అంత్యక్రియలకు ఇబ్బందులు తప్పడంలేదు. వాటి నిర్వహణపై జీహెచ్‌ఎంసీీకి పట్టు లేకపోవడంతో స్థానికులు అడ్డుకుంటున్నారు. చివరకు అధికారులు పట్టుబట్టి ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించేందుకు ఒప్పించారు. అక్కడా యంత్రాంగం నిర్లక్ష్యం బయటపడింది. అసంపూర్తిగా కాలిన మృతదేహాలను వీధి కుక్కలు పీీక్కుతిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. యుద్ధప్రాతిపదికన నగరవ్యాప్తంగా ఉన్న అన్ని శ్మశానవాటికలకు ప్రహరీలు నిర్మించాలని.. షెడ్లతోపాటు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ జడ్సీలను ఆదేశించారు. మూడు విడతల్లో అక్కడ రక్షణ సిబ్బందికి విధులు కేటాయించి, 24గంటల పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

అవి నెలాఖరుకు

ప్రస్తుతం బన్సీలాల్‌పేట, సనత్‌నగర్‌, అంబర్‌పేట శ్మశానవాటికల్లో విద్యుత్తు దహనవాటికలు ఉన్నా పనిచేయట్లేదు. కట్టెలతోనే దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు నిర్వహణలోని షేక్‌పేట మహాప్రస్థానంలో విద్యుత్తు దహనవాటిక ఒక్కటే వినియోగంలో ఉంది. పనిచేయనివాటికి మరమ్మతులు చేసి నెలాఖరుకు అందుబాటులోకి తేవాలని అర్వింద్‌కుమార్‌ ఆదేశించారు.

పర్యావరణ హిత విధానంలో..

విద్యుత్తు దహనవాటికల్లో శవాలను పర్యావరణహిత విధానంలో దహనం చేస్తారు. ఎలాంటి వైరస్‌లైనా భస్మమవుతాయి. ‘‘ప్రజల్లో అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకొస్తాం’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఏర్పాటుచేసే గ్యాస్‌ ఆధారిత దహనవాటికలు సైతం ఆధునిక సాంకేతికతతో పనిచేస్తాయన్నారు. బట్టీలాంటి నిర్మాణంలో పెద్దయెత్తున మంటను వెదజల్లే రెండు గొట్టపు పైపులు ఉంటాయని, మృతదేహాన్ని గరిష్ఠంగా 1200డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భస్మం చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.