close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

కీలక వికెట్‌ ఢమాల్‌..!

ఫత్హేబాద్‌లో బన్సీలాల్‌ లొంగుబాటు
ఎఫ్‌ఎంఎల్‌సీ మోసం కేసులో పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌ : ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌(ఎఫ్‌ఎంఎల్‌సీ) గొలుసుకట్టు మోసం కేసులో సైబరాబాద్‌ ఆర్థిక నేరవిభాగం పోలీసులు పురోగతి సాధించారు. ఈ మోసంలో కీలక నిందితుడు, సంస్థ ఎండీ బన్సీలాల్‌(32)ను ఎట్టకేలకు నగరానికి తీసుకురాగలిగారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. పది రోజుల కస్టడీకి అనుమతించాలని పిటీషన్‌ దాఖలు చేశారు.

తెరపై సీఎండీ.. తెర వెనక ఎండీ
హరియాణా రాష్ట్రంలోని హిసార్‌ కేంద్రంగా ప్రారంభమైన ఎఫ్‌ఎంఎల్‌సీ సంస్థ కార్యకలాపాలు ఉత్తరాదిన హరియాణా, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించాయి. సంస్థ సీఎండీగా రాధేశ్యాం, ఎండీగా బన్సీలాల్‌ వ్యవహరించారు. లక్షలాది మంది సభ్యుల నుంచి సుమారు రూ.3 వేల కోట్లకుపైగా వసూలు చేశారు. రూ.7,500 కట్టి సంస్థలో చేరితే దాదాపు రెండేళ్లలోనే రూ.60వేలు ఇస్తామంటూ మభ్యపెట్టడంతో భారీ సంఖ్యలో సభ్యులు చేరారు. తెలుగురాష్ట్రాల్లోనూ ఆదరణ లభించింది. తొలుత కొంతకాలంపాటు డబ్బు సక్రమంగానే చెల్లించిన నిర్వాహకులు తర్వాత తాత్సారం చేస్తుండటంతో సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. తనను మోసగించారంటూ కూకట్‌పల్లి వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగడంతో అక్రమాల డొంక కదిలింది. కేసు దర్యాప్తు క్రమంలో పోలీస్‌ బృందం హిసార్‌ వెళ్లింది. ఆ సమయంలో రాధేశ్యాంతోపాటు సంస్థ డైరెక్టర్‌ సుందర్‌సింగ్‌ పోలీసులకు చిక్కారు. అప్పట్లో కేవలం రూ.230 కోట్లను మాత్రం బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు. రూ.60లక్షల వరకు జప్తు చేశారు. అయితే పోలీసుల దాడుల విషయాన్ని పసిగట్టిన బన్సీలాల్‌ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. తర్వాతి క్రమంలో రాధేశ్యాంపై సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పీడీ చట్టాన్ని ప్రయోగించడంతో భయంతో బన్సీలాల్‌ పోలీసులకు చిక్కకుండా పలాయనం చిత్తగించాడు. తర్వాత క్రమంలో హరియాణాలోనూ ఈ సంస్థపై పలు మోసం కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి సంస్థ సీఎండీ రాధేశ్యాం అయినా.. ఆర్థిక వ్యవహారాలన్నీ బన్సీలాల్‌ కనుసన్నల్లోనే జరిగాయని పోలీసులు గుర్తించారు.

జాడ దొరుకుతుందా..?
రాధేశ్యాంను అరెస్ట్‌ చేసిన అనంతరం సైబరాబాద్‌ పోలీసులు సంస్థ రికార్డుల్ని జప్తు చేశారు. సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బు.. ప్రమోటర్లకు రివార్డుల రూపంలో తిరిగి చెల్లించిన డబ్బు గురించి ఆరా తీశారు. వాటిని పరిశీలించడంతో సుమారు రూ.1100కోట్ల డబ్బుకు లెక్కల్లేనట్లు గుర్తించారు. దీనికితోడు ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. సుమారు రూ.237కోట్ల ఆస్తుల్ని గుర్తించి జప్తు చేసింది. ఈనేపథ్యంలో సభ్యుల నుంచి సేకరించిన డబ్బును బన్సీలాల్‌ విదేశాలకు తరలించి ఉంటాడా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బన్సీలాల్‌ దొరక్కపోవడంతో వాటిపై స్పష్టత లేకుండా పోయింది.

సైబరాబాద్‌ పోలీసులు ఏడాది క్రితం సీఎండీ రాధేశ్యాంను అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో పారిపోయిన బన్సీలాల్‌ విదేశాల్లో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రూ.వేల కోట్ల మోసం వ్యవహారం కావడంతో అతడి కోసం ఇటు సైబరాబాద్‌ పోలీసులతోపాటు అటు హరియాణా పోలీసులూ వలపన్నారు. హరియాణా పోలీసులు ఇటీవలే అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకోవడంతో అన్ని వైపుల నుంచి బన్సీలాల్‌పై ఒత్తిడి పెరిగింది. ఇక లాభం లేదనుకొని కొద్దిరోజుల క్రితం ఫత్హేబాద్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు.  సంస్థ సభ్యుల నుంచి సేకరించిన డబ్బుతో బన్సీలాల్‌ హరియాణాలోని స్వస్థలం టిబ్బితోపాటు సదల్‌పూర్‌, హిసార్‌, బూనా, హిమాచల్‌ప్రదేశ్‌ బడ్డీలో ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ఒకవేళ హరియాణా పోలీసులు తన కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకోకపోతే విదేశాల్లోనే స్థిరపడే ఆలోచనతోనే బన్సీలాల్‌ ఉన్నట్లు  గుర్తించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.