close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

అతనికి ఇల్లు అద్దెకు ఇస్తే అంతే సంగతులు

గచ్చిబౌలి న్యూస్‌టుడే: అతను చదివింది బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌.. కానీ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేసి ఏయిర్‌ ఇండియాలో పైలెట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించాడు. ఐటీ కారిడార్‌లోని అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో అద్దెకు దిగాడు. పక్షం రోజుల్లో ఫ్లాట్‌లో ఉన్న వస్తువులను మాయం చేసిన నిందితుడితోపాటు అతనికి సహకరించి మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావులు వివరాలు వెల్లడించారు...కూకట్‌పల్లి జైనగర్‌లో ఉంటున్న ధూళిపూడి శ్రీవాత్సవ(30) దిల్లీలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో 2012లో బీటెక్‌ మెకానికల్‌ పూర్తి చేశాడు. తరువాత కొంతకాలం పాటు బెంగళూరులోని ఓ బస్సుల సర్వీస్‌ కేంద్రంలో సర్వీసింగ్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. అయితే జల్సాలకు అలవాటు పడిన ఇతను ఉద్యోగం మానేసి దొంగతనాలను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో అద్దెకు ఉండేందుకు ఖరీదైన ఫ్లాట్లు గురించి ఆన్‌లైన్‌లో వాకబు చేశాడు. ఐటీకారిడార్‌ ప్రాంతంలోని గోల్ఫ్‌ఎడ్జ్‌ అపార్టుమెంట్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు ఉందని తెలియడంతో సదరు ఫ్లాట్‌ యజమాని కేశవ్‌కు ఫోన్‌ చేసి తాను ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశానని, ప్రస్తుతం తాను ఎయిర్‌ ఇండియాలో పైలెట్‌గా పనిచేస్తున్నట్లు  పరిచయం చేసుకున్నాడు. విధుల్లో భాగంగా తాను లండన్‌లో ఉన్నాయని, ఒకటి రెండు రోజుల్లో నగరానికి వస్తానని, ఫ్లాట్‌ అద్దెకు కావాలని చెప్పాడు. అనంతరం నకిలీ ఆధార్‌ కార్డు, గుర్తింపు కార్డును సృష్టించి వాటిని కేశవ్‌కు వాట్సాప్‌ చేశాడు. అద్దె డబ్బులను ఆన్‌లైన్‌లో చెల్లించానని, సంబంధించిన మార్ఫింగ్‌ రసీదును సైతం పంపాడు. అనంతరం గత అక్టోబర్‌ 15న ఫ్లాట్‌లో అద్దెకు దిగాడు. ఆన్‌లైన్‌లో జమ చేసిన అద్దె డబ్బులు ఒకటి రెండు రోజుల్లో ఖాతాలో జమ అవుతాయని ప్లాట్‌ యజమానిని తన మాయమాటలతో నమ్మించాడు. ఇక అదును చూసుకొని అవకాశం దొరికినప్పుడుల్లా ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తరలించాడు. టీవీ, ప్రొజెక్టర్‌, స్క్రీన్‌, రిఫ్రిజిరేటర్‌, హోంథియేటర్‌ను ఎత్తుకెళ్లాడు. అనంతరం అక్టోబర్‌ 30 నుంచి ఫ్లాట్‌కు రావడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన యజమాని అతనికి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందనలేకపోవడంతో ఫ్లాట్‌ లోపలికి వెళ్లి చూడగా వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు అతను పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీవాత్సవతోపాటు అతని నుంచి దొంగలించిన వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న సరూర్‌నగర్‌కు చెందిన సాంబరాజ్‌కుమార్‌(49)ని అరెస్టు చేసి వారి నుంచి రూ.4 లక్షలు విలువ చేసే వస్తువులతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.