close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

తిరుమలకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..!

కేశఖండనకు బయలుదేరిన కుటుంబం
ముగ్గురు మృతితో విషాదం

భక్తితో చిన్నారి పుట్టెంట్రుకలను వేంకన్నకు సమర్పించేందుకు కుటుంబమంతా కొత్త కారులో బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే తిరుమల గిరులు. ఇంకెంత అందరం కాసేపట్లో గమ్యస్థానం చేరేస్తామని సంతోషంగా అనుకుంటుండగానే లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు కబళించింది. ఎంతో ఆశతో అల్లుడి కోసం మూడు కత్తిరింపులు ఇవ్వాలంటూ వచ్చిన మేనమామ, మనువడి వేడుకను తిలకించాలని వచ్చిన అమ్మమ్మ, బతుకుబండిని లాగేక్రమంలో నాలుగు డబ్బులు సంపాదించకోవచ్చని వచ్చిన అద్దె చోదకుడు దుర్మరణం చెందారు. ఫలితంగా ఓ కుటుంబం ఏకైక కుమారుడితో పాటు ఇల్లాలిని కోల్పోగా.. అద్దెకు వచ్చిన చోదకుని కుటుంబంలో విషాదఛాయలు మిగిలాయి.

రైల్వేకోడూరు గ్రామీణ,న్యూస్‌టుడే: కడప జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని రాఘవరాజపురం సమీపంలోని ప్రధాన రహదారి పై శుక్రవారం రాత్రి 2 గంటల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్‌ జిల్లా  కంకల్‌కు చెందిన 8 మంది కుటుంబం సభ్యులు అద్దె చోదకునితో పాటు చిన్నారి ఆశుష్‌ పుట్టెంట్రుకలను వేంకటేశ్వరస్వామి సమర్పించేందుకు తిరుమల బయలుదేరారు. ప్రారంభం నుంచి సాఫీగా జరిగిన కారు ప్రయాణం మరో రెండుగంటల్లో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా ముందు వెళ్తున్న భారీ వాహనం అకస్మిక బ్రేకు వేయడంతో వెనుకనే వస్తున్న కారు నియంత్రణ కోల్పోయి ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో షాద్‌నగర్‌కు చెందిన చోదకుడు బాలరాజు, చిన్నారి అమ్మమ్మ సింగాసుజాత, మేనమామ ప్రశాంత్‌ అక్కడికక్కడే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారి తల్లి వాణి, తండ్రి శ్రీనివాస్‌, పిన్ని ప్రియాంక, నాన్నమ్మ రమాదేవి తీవ్రగాయాలతో ఘటనా స్థలం వద్ద ఆర్తనాదాలు చేయడం చూపరులను కలిచివేసింది. పదినెలల పసికందు ఆశుష్‌ ఎలాంటి గాయం లేకుండా బయటపడడం విశేషం.

కుటుంబానికి ఒక్కడే కొడుకు
సుజాత, హనుమంతులకు ప్రశాంత్‌ ఆడపిల్లల తరువాత ఒకే కుమారుడు. అల్లుడి పుట్టెంట్రుకల సాంగ్యంలో కత్తిరింపులు చేయాలని వచ్చిన ప్రశాంత్‌ స్థానిక కళాశాల్లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. తండ్రి హనుమంతు స్థానికంగా చిన్న కిరాణా కొట్టు నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం మేనల్లుడి వేడుకలో పాల్గొనేందుకు తిరుమలకు పయనమయ్యారు. ఉన్నట్టుండి భార్య, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారంటూ తెలిసిన వార్త ఆ తండ్రిని తీవ్రంగా కలచివేసింది. తనని, తన రెండో కుమార్తెను అనాథలను చేసింది.

అద్దె చోదకునిగా వచ్చి..
షాద్‌నగర్‌కు చెందిన మృతుడు బాలరాజు చాలా కాలం నుంచి చోదకునిగా పని చేస్తున్నారు. కొంత కాలం కిందటి తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి చోదక వృత్తిలో వచ్చే సంపాదనలతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తిరుమలకు సుదూర ప్రయాణం చేయాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితమే కొన్న కొత్త కారుకు అనుభవమున్న చోదకుడు కావాలని శ్రీనివాస్‌ స్నేహితులను సంప్రదించడంతో తిరుమలకు వెళ్లేందుకు అద్దె చోదకునిగా బాలరాజుకు కుదిరారు. కారు తీసుకుని బయలుదేరి వస్తే షాద్‌ నగర్‌లో ఎక్కుతానని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరిన వీరు వందల కిలోమీటర్లు ప్రయాణించి గమస్యస్థానం చేరేక్రమంలో బాలరాజు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కనీటి పర్యంతమవుతున్నారు.

సోదరుని మృతిని జీర్ణించుకోలేకపోతున్న అక్క
తన కుమారుడి కేశ ఖండనకు వచ్చిన తమ్ముడు మృతి చెందిన విషయాన్ని సోదరి వాణి జీర్ణించుకోలేక పోతోంది. బతికనంత వరకూ తమ్మునిగా తోడు నీడగా కాపాడుకుంటానంటూ చెప్పిన తమ్ముడు, కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లి మృతి చెందడంతో ఆమె శోక సంద్రంలో మునిగింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.