నీరోడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి

సంపాదకీయం

నీరోడుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి

ట్టసభలు సంకుచిత రాజకీయ సంగ్రామ వేదికలుగా దిగజారిపోవడంకన్నా ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా అప్రతిష్ఠ మరేముంటుంది? సమకాలీన చరిత్రను పరికిస్తున్న ఆలోచనాపరుల్ని కలచివేస్తూ అటువంటి దుస్థితి దేశంలో పోనుపోను పొటమరిస్తోంది. లోగడ రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో కేఆర్‌ నారాయణన్‌- సర్వసత్తాక వ్యవస్థ అయిన చట్టసభ స్వీయ సమీక్షతో తప్పులు గ్రహించి సరిదిద్దుకోవాలని, అవసరమైతే తనను తాను దండించుకోవాలని నిర్దేశించారు. అలా జరగకపోవడం వల్లనే న్యాయపాలిక జోక్యం అనివార్యమవుతోంది! సుమారు ఆరేళ్లక్రితం అప్పటి కేరళ ఆర్థికమంత్రి కేఎమ్‌ మణి శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఉద్యుక్తులైన తరుణంలో ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్‌ సభ్యులు అడ్డుకున్నారు. లంచాలు మేశారన్న ఆరోపణలకు గురైన వ్యక్తి బడ్జెట్‌ సమర్పించే వీల్లేదని నినాదాలు చేస్తూ మైకులు, కంప్యూటర్లు విరగ్గొట్టారు. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆరుగురు విపక్ష ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మరుసటి ఏడాది ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపట్టిన ఎల్‌డీఎఫ్‌ వాటిని ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దిగువ న్యాయస్థానంలో, హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చినా వెనక్కి తగ్గని ఎల్‌డీఎఫ్‌ సర్కారుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలోనూ తల బొప్పికట్టింది. 105(3), 194(3) రాజ్యాంగ అధికరణల ప్రకారం విశేషాధికారాలు దఖలుపడిన చట్టసభల సభ్యులపై స్పీకర్‌ అనుమతి లేకుండానే కేసులు పెట్టడమేమిటన్న రాష్ట్రప్రభుత్వ వాదన ‘సుప్రీం’ ఎదుట వీగిపోయింది. హక్కులతోపాటు బాధ్యతల్నీ నిర్వర్తించాల్సిందేనన్న ధర్మాసనం చట్టాలకు అతీతమైన ప్రత్యేక సౌకర్యాలేమీ ప్రజాప్రతినిధులకు లేవంటూ- ఆస్తుల్ని నష్టపరచడం స్వేచ్ఛ కానే కాదని స్పష్టీకరించింది. విశేషాధికారాలు, సభాహక్కుల పేరిట ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనల్ని చెదరగొడుతూ గౌరవ ప్రతినిధులకు కచ్చితంగా పరిధులు నిర్ధారించిన తాజా తీర్పు చరిత్రాత్మకమైంది!

కాలక్రమంలో గౌరవ సభ్యుల నడవడి హుందాతనం సంతరించుకుని ప్రజాస్వామ్య పరిపుష్టీకరణకు దోహదపడుతుందని తొలి లోక్‌సభాపతి మవులంకర్‌ ఆకాంక్షించారు. అటు పార్లమెంటులో ఇటు శాసనసభల్లో దురావేశ ప్రదర్శనలు ఎలా పెచ్చరిల్లుతున్నాయో దేశ ప్రజలు నిర్విణ్నులై తిలకిస్తున్నారు. తరతమ భేదాలతో పలు చట్టసభలు రౌద్ర, భయానక, బీభత్సరస ప్రదర్శనలకు నెలవులై నిశ్చేష్టపరుస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరో విధంగా పార్టీల ధోరణి- చట్టసభల ఔన్నత్యాన్ని కుంగదీస్తోంది. విస్తృత ప్రజాప్రయోజనాల్ని లక్షించి సహేతుకంగా నిలదీసే ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రభుత్వం తలపోయకూడదు. పరిపాలన, శాసన నిర్మాణం అసాధ్యమయ్యే పరిస్థితిని విపక్షాలూ సృష్టించకూడదు. ఇరువైపులా అటువంటి మౌలిక అవగాహనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఊపిరులూది సత్ప్రమాణాలు నెలకొల్పడంలో కీలక భూమిక పోషిస్తుంది! దాదాపు 28 ఏళ్లక్రితం యూపీ ముఖ్యమంత్రి విశ్వాస పరీక్ష వేళ అసెంబ్లీలో ప్రజ్వరిల్లిన హింసాకాండపై నియుక్తమైన జస్టిస్‌ అచల్‌ బిహారి శ్రీవాస్తవ కమిటీ సహేతుక ప్రతిపాదనలందించింది. పరిధి మీరి ప్రవర్తించిన సభ్యులను ‘రీ కాల్‌’ చేయడానికి, వారి సభ్యత్వం రద్దయ్యేలా చూడటానికి చట్ట సవరణల్ని అది ప్రతిపాదించినా- ఇన్నేళ్లలో ఎన్నదగ్గ ముందడుగు పడనేలేదు. లక్షల మంది తరఫున జనవాణి వినిపించడానికి, బాధ్యతాయుత శాసన నిర్మాతలుగా వ్యవహరించడానికి చట్టసభల్లో అడుగిడుతున్న ప్రతి ఒక్కరూ వాటి గౌరవాన్ని నిలబెట్టాలి. వాస్తవంలో ఆ బాధ్యత కొరవడుతున్నందువల్లనే ఆసేతుహిమాచలం చట్టసభలకు గౌరవ హాని వాటిల్లుతోంది. జనస్వామ్య కాంక్షల్ని తేజరిల్లజేసే సంస్కరణలతో యూకే, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, స్వీడన్‌ తదితరాలు పురోగమిస్తుండగా- ప్రజాతంత్ర భారతి వెలాతెలాపోతోంది. ‘సర్వోన్నత’ నిర్దేశంతోనైనా దీటైన కార్యాచరణకు ప్రభుత్వాలు, స్వయం క్షాళనకు పార్టీలు చొరవ కనబరిస్తేనే- చట్టసభల ప్రతిష్ఠ నిలబడుతుంది!


మరిన్ని

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న