close

ప్ర‌త్యేక క‌థ‌నం

నిర్లక్ష్యం ఇంతింత కాదయా!

స్త్రీ పురుష సమానత్వాన్ని ఏ దేశమూ సాధించలేదు 
సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని ఒక్క దేశమూ అందుకోలేదు 
విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించిన ఎస్‌డీజీల అమలు నివేదిక 
95వ స్థానంలో భారత్‌

మహిళలు ఆకాశంలో సగం అంటారు. స్త్రీ పురుష సమానత్వం గురించి దాదాపు ప్రతి దేశమూ మాట్లాడుతుంది. కానీ ఆచరణలో మాత్రం వారిని ఇప్పటికీ చిన్నచూపే చూస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశమూ ఇప్పటిదాకా స్త్రీ పురుష సమానత్వ లక్ష్యాన్ని అందుకోలేదు. 2030 నాటికి  లింగ సమానత్వం సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీలు) ప్రతిజ్ఞ ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతోంది. ఈ లక్ష్య సాధనకు ఇక మిగిలింది 11 ఏళ్లే అయినా.. ప్రపంచ దేశాల పయనం నత్తనడకన సాగుతోంది. స్త్రీ పురుష సమానత్వ సూచీలో  ప్రపంచంలోని ఏ దేశం రికార్డూ ఆశాజనకంగా లేదన్న విషయాన్ని ఎస్‌జీడీల అమలుపై తాజాగా విడుదలచేసిన నివేదిక కుండబద్ధలు కొట్టింది. మొత్తం 17 ఎస్‌డీజీ లక్ష్యాలను నిర్దేశించుకుంటే.. అందులో 14 లక్ష్యాలను కూడా ఏ దేశమూ అందుకోలేదు.

అంతటా వెనుకబాటే 
మహిళల పట్ల వివక్షను తొలగించడం, హింస, బాల్య వివాహాలు, స్త్రీ జననాంగాల ఛేదనలను అరికట్టి.. వారికి సమానావకాశాలు కల్పించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కీలకమైంది. ఈ విషయంలో నూటికి నూరుశాతం పురోగతిని సాధించిన దేశం ఒక్కటీ లేదు. పేదరికం, ఆరోగ్యం, అక్షరాస్యత, విద్యార్హతలు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాల ప్రాతిపదికగా మొత్తం 129 దేశాల్లో స్త్రీ పురుష సమానత్వం గణాంకాల్ని మదింపు చేశారు. మహిళలకు అందుతున్న అత్యుత్తమ సామాజిక భద్రతా చర్యలు, ఉన్నత ప్రజాసేవలు, కల్పిస్తున్న అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

మరీ ఇంత ఘోరమా..!

* స్త్రీ పురుష సమానత్వ సూచీలో అత్యంత అధ్వాన స్కోరు సాధించిన దేశాల్లో దాదాపు 140 కోట్ల మంది బాలికలు, మహిళలున్నారు. 
* అతివల జీవన స్థితిగతుల మెరుగుదలకు అవసరమైనన్ని చర్యలు చేపట్టలేని దేశాల్లో దాదాపు 280 కోట్ల మంది మహిళలు, బాలికలు ఉన్నారు.

అక్కడ ఎందుకు వెనుకబాటు?

అంతర్యుద్ధాలు, బలహీన ఆర్థిక వ్యవస్థల కారణంగా స్త్రీ పురుష సమానత్వ సాధనలో చాద్‌, డీఆర్‌ కాంగో, యెమెన్‌, నైగర్‌, మారిటేనియాలు ఘోరంగా వెనుకబడి ఉన్నాయి. కొన్ని పేద దేశాల్లో స్త్రీ పురుష సమానత్వం ధనిక దేశాల కన్నా మెరుగ్గా ఉంది. ఉదాహరణకు డెన్మార్క్‌ పార్లమెంటులో 37% మంది మహిళలే ఉంటే... పేద దేశమైన సెనెగల్‌లో 42% మంది ఉన్నారు. ప్రపంచంలోని మూడోవంతు దేశాలకన్నా ఎక్కువగా కెన్యాలో మహిళలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ను వినియోగిస్తున్నారు. అమెరికాలో కన్నా మెరుగ్గా కొలంబియాలో అత్యంత పేద మహిళలకు సామాజిక భద్రతా సహాయం అందుతోంది.

ఏం చేయాలి?

స్త్రీ పురుష సమానత్వం ఆఖరి మెట్టు ఎక్కాలంటే.. ప్రపంచదేశాలు చేపట్టాల్సిన చర్యలేమిటో నివేదిక విస్పష్టంగా సూచించింది. 
* స్త్రీలపై హింసకు అడ్డుకట్ట వేయాలి 
* వాతావరణ మార్పుల్ని అరికట్టాలి 
* స్త్రీలకు మరిన్ని రక్షణ ఛత్రాలు కల్పించాలి 
* మతం, జాతి ఆధారంగా వెనుకబడిన మహిళల పురోభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. 
* మహిళాభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెంచాలి 
* వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి 
* పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనివ్వాలి

ఎస్‌డీజీల్లో హామీ ఇచ్చిన స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించడంలో మేం విఫలమయ్యాం. 2030 నాటికి ఈ లక్ష్య సాధనకు అవసరమైన చట్టాల మార్పు, విధానాల రూపకల్పన, బడ్జెట్‌ కేటాయింపుల్లాంటి వాటిని 129 దేశాల్లో ఒక్కటీ చేయలేదు’’

- అలీసన్‌ హోల్డర్‌ (2030 నాటికి సమానత్వ చర్యల డైరెక్టర్‌)

స్త్రీ పురుష సమానత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం పెట్టుబడులు పెట్టడానికి రాజకీయ సంసిద్ధతను ఏ దేశమూ వ్యక్తంచేయడం లేదు’’

- అన్నే బిర్‌గిట్టే ఆల్బ్రెక్ట్‌సేన్‌ (బాలల హక్కుల ధార్మిక సంస్థ ‘ప్లాన్‌ ఇంటర్నేషనల్‌’ సీఈఓ)

ఈ నివేదిక ప్రపంచానికి కనువిప్పు కావాలి. స్త్రీ పురుష సమానత్వాన్ని అందుకోలేని దేశాల్లో దాదాపు 40% మంది మహిళలు, బాలికలు నివసిస్తున్నారు కాబట్టి ఎస్‌డీజీలను అందుకోలేం’’

- మిలిందా గేట్స్‌ (బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కో ఛైర్‌పర్సన్‌)

స్త్రీ పురుష సమానత్వం ఎక్కడ ఎలా.. 

ప్రపంచ సగటు 65.7

*  మెరుగ్గా ఉన్న మొదటి 10 దేశాలు: డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, స్వీడన్‌, నార్వే, నెదర్లాండ్స్‌, స్లొవేనియా, జర్మనీ, కెనడా, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా 
*  అధ్వానంగా ఉన్న 10 దేశాలు: సియెర్రాలియోన్‌, లైబీరియా, నైజీరియా, మాలి, మారిటేనియా, నైగర్‌, యెమెన్‌, కాంగో, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, చాద్‌ 
*  భారత్‌: 56.2 సగటు స్కోరుతో భారత్‌ 95వ స్థానంలో నిలిచింది. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలోని 23 దేశాల్లో మనది 17వ స్థానం. 
*  చైనా స్థానం 74, పాకిస్థాన్‌ స్థానం 113 
*  90 కన్నా ఎక్కువ ర్యాంకు సాధించిన వాటిని అద్భుత పురోగతి దేశాలుగా, 50 కన్నా తక్కువ ఉన్న వాటిని ఘోరమైన దేశాలుగా విభజించారు. అయితే ఏ దేశమూ 90 ర్యాంకును దాటలేదు. 
*  దారిద్య్ర నిర్మూలన, మహిళల ఆర్థిక భాగస్వామ్య కల్పనలో వెనుకబడిన అమెరికా 77.6 స్కోరు చేసింది. 
*  ఈ సూచీలో ఐరోపా, ఉత్తర అమెరికాలు అగ్రభాగాన ఉంటే, ఆఫ్రికా దేశాలు అట్టడుగునున్నాయి. 

ప్రపంచ బ్యాంకు లెక్క వేరు

ప్రపంచంలోని ఆరు దేశాలు మహిళలకు సమాన హక్కులు కల్పించాయని ప్రపంచబ్యాంకు గత మార్చి నెలలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వాటిలో బెల్జియం, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, లాత్వియా, లక్సెంబర్గ్‌, స్వీడన్‌లు ఉన్నాయి. ఈ విషయంలో ఇవి నూటికి నూరుశాతం మార్కులు సాధించాయి. మధ్య ఆసియా, సహారా ఎడారి చుట్టుపక్కల దేశాలు మాత్రం 47.4 స్కోరుతో వెనుకబడి ఉన్నాయి.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.