close

ప్ర‌త్యేక క‌థ‌నం

బహిరంగ తాగుడు...భయపెట్టే తూగుడు!

 మందుబాబులకు రహదారులే బార్లు
 మద్యం దుకాణాల దగ్గర వీరంగం
 జనావాసాల్లో పెరుగుతున్న ఆగడాలు
 ‘ఈనాడు’ క్షేత్ర పరిశీలన

రద్దీ రహదారులపైనే మందుబాబులు సిట్టింగులేస్తున్నారు. చుక్కేసి జనం మధ్యనే చిందులు తొక్కుతున్నారు. తాగుతూ.. ఊగుతూ.. వాగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం కొన్నవారు దుకాణం దగ్గరే తాగేస్తున్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల మద్యం దుకాణాల పరిసరాల్లో ఇదే పరిస్థితి. మద్యం కొన్నవారు దుకాణం దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. తగిన పర్యవేక్షణ కొరవడటంతో మత్తులో తూగుతూ ఘర్షణలకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. అటుగా వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఖాళీ మద్యం సీసాలు, నీటి పొట్లాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర ‘ఈనాడు’ ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలనలో కనిపించిన దృశ్యాలివి.

 న్యూస్‌టుడే యంత్రాంగం, ఈనాడు, అమరావతి

వీధిలోనే మద్యపానం

కడప జిల్లా వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో నివాస ప్రాంతాల్లో 2 మద్యం దుకాణాలున్నాయి. వీటిని ఆనుకుని ఉన్న పిరమిడ్‌నగర్‌ వీధిలో మందుబాబులు బహిరంగంగా తాగుతున్నారు. వృషభేశ్వర కాలనీ, చేనేత కాలనీలకు వెళ్లేవారు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడే ఓ ప్రైవేటు పాఠశాల ఉంది.

బార్‌ కాదు.. బస్‌ షెల్టరే!

విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ కూడలి వద్దనున్న బస్‌షెల్టర్‌ ఇది. పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం ఇక్కడే నిరీక్షిస్తుంటారు. ఈ బస్‌షెల్టర్‌ ఎదురుగా ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటైంది. సాయంత్రమైతే చాలు... మందుబాబులు బస్‌షెల్టర్‌ను బారుగా మార్చేస్తున్నారు. నగర శివారు ఆనందపురంలో మద్యం దుకాణానికి ఎదురుగా ఉన్న మందుల దుకాణం దగ్గర తాగుతున్నారు.

ప్రయాణికులు నిరీక్షించే చోటే...

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలోని కొండాలమ్మచింత కూడలి నిత్యం రద్దీగా ఉంటుంది. బస్సులు, ఆటోల కోసం వందల మంది ప్రయాణికులు నిరీక్షిస్తుంటారు. దీనికి అత్యంత సమీపంలోనే కొండాలమ్మ అమ్మవారి ఆలయమూ ఉంది. ఈ ప్రాంతంలో ఏర్పాటైన దుకాణం దగ్గర రహదారి పక్కనే కొందరు మందు తాగుతూ నానా రభస సృష్టిస్తున్నారు. కూడలిలో నిలుచోవాలంటేనే మహిళలు వణికిపోతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనే...

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో మండల పరిషత్‌, తహసీల్దార్‌, విద్యాశాఖాధికారి, వ్యవసాయాధికారి కార్యాలయాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఈ దారిలోనే ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటైంది.

ఆలయం పక్కనే...

చిత్తూరు జిల్లా తిరుపతి కేటీరోడ్డు అన్నారావు కూడలి సమీపంలో శివాలయం పక్కనే మద్యం దుకాణాన్ని పెట్టారు. కుప్పం బస్టాండులోనే మద్యం దుకాణం ఏర్పాటు చేశారు.

ఆరుబయటే...

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కూడలిలోని పలు దుకాణాల దగ్గర ఆరుబయటే మద్యం తాగుతున్నారు.

ఎక్కడికక్కడే ధూంధాం

* విజయనగరం జిల్లా డెంకాడలో జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. చీపురుపల్లిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న మద్యం దుకాణానికి వెళ్లే మార్గంలోనే బాలికల ఉన్నత పాఠశాల, శివాలయం ఉన్నాయి.
* శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పట్టుమహాదేవి కోనేరు ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట ఏర్పాటు చేసిన దుకాణాల దగ్గర కొనుగోలు చేసిన మద్యాన్ని మందుబాబులు అక్కడే తాగుతున్నారు. పలాసలో ‘ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం’ పక్కనే అధికారులు దుకాణాన్ని తెరిచారు.
* పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు-కొయ్యేటిపాడు రోడ్డులో కాలనీకి ఆనుకుని మద్యం దుకాణం పెట్టారు.

నిఘాతోనే: మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచాలి. ప్రతి దుకాణం బయటా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలి. మద్యం దుకాణాలున్న చోట తినుబండారాలు అందుబాటులో లేకుండా చేయాలి.

నలుగురు నడిచే దారిలో...

అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రం నుంచి లత్తవరానికి వెళ్లే మార్గంలో ఏర్పాటైన మద్యం దుకాణమిది. దుకాణంలో కొనుగోలు చేసిన మద్యాన్ని రహదారిపైనే తాగుతూ మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. పది గ్రామాల వారు రాకపోకలు సాగించేందుకు ఇదే ప్రధాన రహదారి.

స్థానిక పోలీసులకు బాధ్యత అప్పగిస్తాం

కొత్త విధానం కాబట్టి అక్కడక్కడా కొన్ని ఇబ్బందులుంటాయి. పర్మిట్‌ గదులుంటే మద్యం దుకాణాలు క్లబ్బుల్లా మారిపోతున్నాయనే వాటిని తీసేశాం. ఇప్పటికీ ఎక్కడైనా అదే పరిస్థితి ఉంటే కచ్చితంగా చర్యలు చేపడతాం. బహిరంగ ప్రదేశాల్లో తాగేవారిని నియంత్రించే బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పగిస్తాం. మద్యం దుకాణాలవద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఆ పరిసరాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా జరిగితే.. మీడియాతో పాటు ఎవరైనా మా దృష్టికి తీసుకురావొచ్చు.
- కె.నారాయణస్వామి, ఉపముఖ్యమంత్రి (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.