close

ప్ర‌త్యేక క‌థ‌నం

రక్తపిపాసి.. ఈ రహదారి!

నెలకు కనీసం 30 ప్రమాదాలు
అడుగుకో గొయ్యి.. లెక్కలేనన్ని గుంతలు
కుదేలవుతున్న సామాన్యుల కుటుంబాలు
వరంగల్‌ - తొర్రూరు రహదారి దుస్థితి
పట్టించుకోని జాతీయ రహదారుల సంస్థ
వెలిశాల ఫల్గుణాచారి
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

క్కని రహదారులంటే ప్రగతికి మార్గాలని చెబుతారు. కానీ అదేం పాపమో.. మన రోడ్లు మాత్రం ప్రాణాలు తోడేసే రక్తపిపాసుల్లా మారుతున్నాయి. నిర్మాణం సరిగాలేకపోవడం.. నిర్వహణ పట్టించుకోకపోవడం.. ఎలాగోలా బతికేయడానికి అలవాటుపడిన జనం ఎట్లాగైనా సర్దుకుంటార్లే అనుకునే అధికారులు.. మౌలిక వసతులు, చక్కని రవాణా మార్గాలపై దృష్టిపెట్టని నిర్లక్ష్య, ఉదాసీన పరిస్థితులు..
వెరసి విలువైన ప్రాణాలెన్నో గాలిలో కలిసిపోతున్నాయి. కుటుంబాలెన్నో కోలుకోలేకుండా దెబ్బతింటున్నాయి!
ఒక్కపూట ప్రయాణం వారి బతుకును రోడ్డున పడేయడం కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా!
ఇదిగో.. ఉదాహరణకు వరంగల్‌ - తొర్రూరు రోడ్డును చూద్దాం రండి. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తుంది..

ఈనాడు, హైదరాబాద్‌

రోదనలు.. ఆర్తనాదాలు.. రక్తపు మరకలు.. 108 అంబులెన్సుల సైరన్లు! గాలిలో కలుస్తున్న ప్రాణాలు.
ఆ రహదారిపై ప్రయాణమంటేనే వణుకు పుడుతోంది. తెలియనివారైతే తప్పకుండా తెలుసుకుని వెళ్లాల్సిందే. రక్తపిపాసిలా మారిన ఆ జాతీయ రహదారి భారీ గోతులతో నిండి ఉంది. ఒక గోతి నుంచి తప్పించుకున్నా మరో గొయ్యి మింగేస్తోంది. ఎవరో కసికొద్దీ తవ్వారా అన్నంత లోతులో ఉంటున్నాయి.

నెలకు దాదాపు 30కి పైగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారి నెం. 563 ఎన్నో కుంటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అధికారుల పట్టింపు లేకపోవడంతో అమాయకులు సమిధలవుతున్నారు. గాయాలపాలవుతున్న వారు ఆర్థికంగా, శారీరకంగా కోలుకోలేక కుదేలవుతున్నారు. ప్రధానంగా తొర్రూరు నుంచి ఐనవోలు మండలం వరకు ఇవి నిత్యకృత్యంగా మారాయి.

దర్జీ వృత్తితో ధీమాగా బతికే వరంగల్‌ జిల్లా కక్కిరాలపల్లి నివాసి రామగిరి నర్సింగం కుటుంబాన్ని వరంగల్‌ - తొర్రూరు జాతీయ రహదారిలోని ఓ గొయ్యి ఛిన్నాభిన్నం చేసింది. ‘ఆ రోజు ఆగస్టు 18వ తేదీ. నా ఇద్దరు పాపలను హన్మకొండ హాస్టల్లో దించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నా. పంథిని బ్రిడ్జి ఎక్కుతున్నా. పక్కనే గొయ్యి వద్ద ఒక కారు నెమ్మదించింది. దాని వెనుక వేగంగా వచ్చిన కారు ఒకటి దాన్ని ఢీకొట్టి మా బండిని కొట్టేసింది. అంతే నా కాలు నుజ్జు అయింది. ఒక పాప ఎగిరి బ్రిడ్జిపై నుంచి వాగులోని తుమ్మచెట్టుపై పడింది. ముళ్లపై నుంచి జారి వాగులో పడింది. ప్రాణాలైతే దక్కాయి కాని అందరికీ గాయాలు కాగా రూ. రెండు లక్షలకు పైగా ఖర్చయింది. నేను ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికీ ఆ గొయ్యి వద్ద రోజుకు ఒక్కటైనా ప్రమాదం జరుగుతూనే ఉంది.’’

ద్విచక్ర వాహనదారులు బలి

ద్దీగా ఉండే ఈ రహదారిలో ప్రమాదాల సంఖ్య విపరీతంగా ఉంటోంది. వాటి బారిన పడుతున్న వారిలో దిచక్ర వాహనాల వారే ఎక్కువగా ఉంటున్నారు. తొర్రూరు నుంచి 50 కిలోమీటర్ల దూరమే ఉండటంతో దిచక్ర వాహనాలపై కూడా రాకపోకలు సాగిస్తుంటారు.  ఖమ్మం వైపు నుంచి వరంగల్‌కు వచ్చే వాహనాలన్నీ ఈ మార్గం మీదుగానే వెళ్తుంటాయి. జాతీయ రహదారి కావడంతో వాహనదారులు దూసుకుపోతున్నారు. మధ్యమధ్యలో లోతైన గోతుల కారణంగా అదుపు తప్పి పడిపోతున్నారు.
50 కిలోమీటర్లలో ఉన్న ప్రమాదకరమైన గోతులు 110
ఈ ఏడాది మొత్తం మరణాలు 12

లెక్కలేని ప్రాణాలు..

కొద్దిరోజుల క్రితమే రాజేంద్రప్రసాద్‌, రాములు మృతిచెందగా ఇటీవలి కాలంలో నలభై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
పంథిని బ్రిడ్జి చివర ఉన్న గోతుల్లో పడి రెండు రోజుల క్రితం ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలు గాయపడ్డారు.
ల్లంద ఎస్సీ కాలనీ ఎదుట సోమవారం రాత్రి మూడు ప్రమాదాలు చోటుచేసుకోగా తొర్రూరు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు చెందిన మూడు కుటుంబాలవారు తీవ్రంగా గాయపడ్డారు.
ర్ధన్నపేట మండల శివారులో కల్వర్టు వద్ద ఇటీవల ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న (గుంతలున్న) స్థలాలు: తొర్రూరు శివారు, రాయపర్తి, సన్నూర్‌, డీసీ తండా, నీలగిరి స్వామి తండా, సన్నూర్‌, ఇల్లంద ఎస్సీ కాలనీ, పెట్రోల్‌ బంక్‌, 155/2 చప్టా, కక్కిరాలపల్లి క్రాస్‌ రోడ్డు, బ్రిడ్జి, పంథిని, పున్నెలు క్రాస్‌రోడ్‌
ప్రమాదాల సంఖ్య: గరిష్ఠంగా ఒక్కోరోజు 3

గోతులతో ఆరోగ్యానికి పెద్ద దెబ్బ
- నరసింహ స్వామి, సూపరింటెండెంట్‌, సీహెచ్‌సీ, వర్ధన్నపేట

* మా ఆస్పత్రికి నెలకు కనీసం 20 మంది వరకు వస్తున్నారు. గాయాలతో వస్తున్న వారికి ప్రథమ చికిత్స చేసి వరంగల్‌కు పంపిసున్నాం.
* గోతుల్లో ప్రయాణాల వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
* తుంటి ఎముకలు బలహీనమవుతాయి.
* గర్భ స్రావాలు చోటుచేసుకుంటాయి కనుక గర్భిణులు జాగ్రత్త వహించాలి.
* కార్లలో ప్రయాణించే వారి మెడ, తలకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి.

జాతీయ రహదారుల శాఖకు లేఖ రాశాం
- సంపత్‌ బండారి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌, వర్ధన్నపేట

రోజూ రాత్రి ఒక్క ప్రమాదమైనా సంభవిస్తోంది. ఏదో ఒక ఫోన్‌ వస్తూనే ఉంటుంది. మంగళవారం రాత్రి ఇల్లంద సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారు గాయపడ్డారు. అటువైపు వెళ్తున్న నేను గమనించి వారిని ఆస్పత్రికి తరలించా. అధికారుల ఆదేశాలతో మేం కూడా తాత్కాలిక మరమ్మతులు చేస్తూనే ఉన్నాం. పూర్తిస్థాయిలో బాగుచేయాలంటూ రెండు నెలల క్రితమే జాతీయ రహదారుల సంస్థకు లేఖ రాశాం.

మరమ్మతుకు రూ.20 కోట్లు వ్యయం
- మదన్‌మోహన్‌, సహాయ ఇంజినీరు, జాతీయ రహదారుల సంస్థ

ఈ రహదారి మరమ్మతులకు దాదాపు రూ. 20 కోట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లో టెండర్లు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గోతులను ఎప్పటికప్పుడు పూడ్చుతున్నాం. ఇటీవల నిరంతరాయంగా భారీ వర్షాలు కురవడంతో మళ్లీ గోతులు పడ్డాయి. తాత్కాలిక  మరమ్మతులు చేపడుతున్నాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.