Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాటా లేదు... మూటా లేదు

ప్రస్తావనకు రాని కాళేశ్వరం జాతీయ హోదా 
పత్తాలేని పసుపు బోర్డు 
బడ్జెట్‌ ప్రసంగంలో వినిపించని విభజన హామీలు 
తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర కోణం నుంచి కేంద్ర బడ్జెట్‌ను పరికిస్తే ఈ సారి కూడా పెదవి విరుపులు, నిట్టూర్పులే మిగిలాయి. బడ్జెట్‌కు ముందు సాగిన పలు విశ్లేషణల్లో ఆశలు ఉప్పొంగగా శుక్రవారం నాటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం చూస్తే నీళ్లు చిలకరించినట్లయింది. రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలు భాజపాకు దక్కడంతో మారిన ఈ రాజకీయ పరిస్థితులతో తెలంగాణకు బడ్జెట్‌ మద్దతు లభిస్తుందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమయినా వాస్తవ చిత్రం నిరుత్సాహాన్ని నింపింది. నీతి ఆయోగ్‌ సిఫార్సులు కూడా బుట్ట దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నివేదనలకు ఆవేదనే బదులైంది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌ ప్రభుత్వం వివిధ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా ఒక్క దానికి కూడా మోదీ ప్రభుత్వం అండగా నిలవలేదు. వేరే ప్రాజెక్టుల మాటా లేదు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన హామీల ముచ్చట అంతకన్నా లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నామమాత్రంగా రూ.4 కోట్లను కేటాయించి కేంద్రం చేతులు దులిపేసుకుంది. 

 

రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.19,718 కోట్లు! 
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో కూడా నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల లేకపోవడం కూడా రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉపాధి హమీ పథకానికి కేటాయింపులు గతం కంటే పెరగలేదు. స్వచ్ఛభారత్‌ మిషన్‌కు కేటాయింపులు తగ్గాయి. రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు అమృత్‌ పథకంలో ఉండగా, వరంగల్‌, కరీంనగర్‌లు స్మార్ట్‌సిటీ కార్యక్రమంలో ఉన్నాయి. ఈ రెండింటికి కలిపి కేంద్రం రూ.13,750 కోట్లను కేటాయించింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో రాష్ట్రానికి కొంత నిధుల పెరుగుదల ఉంటుందని ప్రత్యేకమైన ఆర్థిక తోడ్పాటు మాత్రం లేదని అధికారులు పేర్కొన్నారు. కొత్త బడ్జెట్‌ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.19,718 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్ర పన్నుల్లో 42 శాతాన్ని రాష్ట్రాలకు పంచుతూ వస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రాలకు పంచనున్న రూ.8,09,133.02 కోట్లలో తెలంగాణకు 2.437 శాతం వాటా కింద నిధులు రానున్నాయి. ఈ మొత్తం గతేడాది కంటే రూ.1,157.69 కోట్లు ఎక్కువ. రాష్ట్రానికి వచ్చే మొత్తంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ వాటా అధికంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర జీఎస్‌టీ, ఆదాయ పన్నుల్లో ఎక్కువ మొత్తాలు దక్కుతున్నాయి. కేంద్ర పన్నుల్లో అత్యధిక మొత్తంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.1.45 లక్షల కోట్లు లభిస్తున్నాయి. తెలంగాణ కంటే ఎక్కువ మొత్తం పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, కేరళ ఉన్నాయి. 

 

తెలంగాణకు దక్కింది ఇదే 
సింగరేణి కాలరీస్‌ సంస్థకు రూ.1,850 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.2వేల కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి అది రూ.1100 కోట్లకు తగ్గింది. 
హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చికి రూ.319.39 కోట్లు కేటాయించారు. 
దేశంలోని సీడ్యాక్‌లన్నింటికీ కలిపి రూ.120 కోట్లు కేటాయించారు. అందులో హైదరాబాద్‌కూ కొంత దక్కుతుంది. 
సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి రూ.30 కోట్లు కేటాయించారు. అందులో హైదరాబాద్‌కు కొంత మొత్తం అందనుంది. 
హైదరాబాద్‌లోని నేషనల్‌ ఫిషరీష్‌ బోర్డుకు రూ.80.75 కోట్లు 
కేటాయించారు. 
స్వాతంత్ర సమరయోధుల పింఛన్లు, ఇతర ప్రయోజనాల కోసం రూ.952.81 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత మొత్తం హైదరాబాద్‌ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు దక్కనుంది. 

 

ప్రధానంగా రాష్ట్రం ఆశించిన అంశాలు 

ఇంజినీరింగ్‌ అద్భుతం, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయనిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలి. 

విభజన హామీలైన బయారంలో ఉక్కు పరిశ్రమ, వరంగల్‌లో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ ఏర్పాటు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్‌ కాకతీయ చాలా బాగున్నాయని పేర్కొంటూ నీతి ఆయోగ్‌ మిషన్‌భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5,000 కోట్లు ఇవ్వాలని 2016లో నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వెనుకబడిన పూర్వపు తొమ్మిది జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చేది. ఈ జిల్లాలను పునర్విభజించి 32 జిల్లాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీటికి రూ.50 కోట్లు చొప్పున కేటాయించాలని కోరింది. 
రాష్ట్రంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.