close

ప్ర‌త్యేక క‌థ‌నం

నత్తగుల్లంతు

దివిసీమ కేంద్రంగా స్మగ్లర్ల దందా
అరుదైన రకాలకు ముప్పు
దెబ్బతింటున్న జీవ వైవిధ్యం
ఈనాడు - విజయవాడ

మరావతికి సమీపంలో ఉన్న కృష్ణా అభయారణ్యంలో అల్పజీవుల మనుగడ ప్రమాదంలో పడింది. కొన్ని అరుదైన నత్తలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి చెన్నై మీదుగా సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌, తదితర దేశాలకు అక్రమ మార్గంలో ఇవి తరలిపోతున్నాయి. వీటిలో పోషక విలువలు ఉండటంతోపాటు అక్కడి రెస్టారెంట్లలో విపరీతమైన డిమాండు నెలకొనడంతో స్మగ్లర్లకు వరంగా మారింది. అటవీ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో స్మగ్లర్లు ఆడిందే ఆటగా సాగిపోతోంది.

జీవావరణంలో కీలకం...
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నదికి 2 వైపులా దాదాపు 194 చ.కి.మీ. పరిధిలో అడవి విస్తరించి ఉంది. ఇందులో పలు అరుదైన జంతు, జీవజాలం మనుగడ సాగిస్తోంది. వీటిలో నత్తలు ఒకరకం. అందులో కొన్ని జాతులను వన్యప్రాణి సంరక్షణ చట్టంలో చేర్చారు. ఇవి మనుగడ సాగిస్తున్నాయంటే అక్కడ స్వచ్ఛమైన వాతావరణం ఉన్నట్లుగా పరిగణిస్తారు. నత్తలు నీటిలోని మలినాలను శుభ్రం చేస్తాయి.

చట్టం ఏం చెబుతోంది?

వన్యప్రాణి సంరక్షణ చట్టంలో చేర్చినవి..: ఆయిస్టర్‌, కరోనియా ట్రిటోనిస్‌, నాటిలిస్‌ పొంపిలియస్‌.
నిషేధం: చట్టంలో పేర్కొన్న వాటిని పట్టుకుని  తీసుకెళ్లడం, ఎగుమతి చేయడం చట్టరీత్యా నేరం.
నిషేధం లేనివి: బుడత గుల్ల, కరెంటు కాయ, చివరి గుల్ల, బొంగరం  నత్తగుల్ల.

రోజుకు 10 టన్నులు...
దివిసీమలోని ఈలచెట్ల దిబ్బ, నాచుకుంట, ఎదురు మొండి, కోడూరు, హంసల దీవి, పాలకాయతిప్ప, ఎడ్లంక, తదితర ప్రాంతాల నుంచి నత్తల రవాణా సాగుతోంది. అక్కడి నుంచి కూలీలను పడవల్లో అభయారణ్యంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఏరిన నత్తలను పడవల్లో మడ అడవిలోని పాయల ద్వారా ఒడ్డుకు తెస్తారు. అక్కడ సిద్ధంగా ఉన్న మినీ లారీలు, ఇతర వాహనాల్లోకి చేరుస్తారు. వీటిని ఏరినందుకు కూలీలకు ఒక్కొక్కరికి కిలోకు రూ.50 వరకు చెల్లిస్తారు. లారీల్లో సరకును చెన్నై తరలిస్తారు. కొందరు రైళ్ల ద్వారా చెన్నైకి పంపిస్తున్నారు. కొందరు వ్యాపారులు గుంటూరు  జిల్లా పొన్నూరు, బాపట్ల రైల్వేస్టేషన్లకు సరకును చేర్చి అక్కడి నుంచి చెన్నై వెళ్లే రైళ్లకు పార్సిళ్లద్వారా పంపుతున్నారు. అక్కడి ప్రధాన వ్యాపారులు వీరికి కిలోకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తారు. అక్కడి నుంచి డిమాండును బట్టి సముద్ర మార్గంలోగానీ, వాయు మార్గంలోగానీ విదేశాలకు రవాణా చేస్తారు. అక్రమంగా రవాణా చేసేందుకు దాదాపు ఐదుగురు వ్యాపారులు పని చేస్తున్నారు. రోజుకు ఒక్కొక్కరు 2 నుంచి 3 టన్నుల చొప్పున మొత్తం దాదాపు 10 టన్నుల మేర రవాణా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నత్తల మాంసాన్ని వేరు చేసి రవాణా చేస్తున్నారు. చిప్పలను సున్నం తయారీ కర్మాగారాలకు తరలిస్తున్నారు.

అంతా మిలాఖత్‌
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కృష్ణా అభయారణ్యంలోని జీవులను తరలించడం నేరం. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అటవీ, పోలీసు సిబ్బంది విఫలమవుతున్నారు. స్మగ్లర్లు కొందరు కిందిస్థాయి సిబ్బందికి లంచాలిచ్చి తమ పని కానిస్తున్నారు. అభయారణ్యం బయట వీటి రవాణాను అరికట్టాల్సిన పోలీసుశాఖలోని కొందరిని స్మగ్లర్లు మచ్చిక చేసుకుని అక్రమ రవాణాకు అడ్డులేకుండా చూసుకుంటున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 9 కింద అక్రమంగా వేటాడటం, జీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి నేరాల కింద కేసులు పెట్టే అవకాశముంది. 5ఏళ్ల నుంచి 6ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు 5 కేసులే పెట్టారు. 3 పడవలను స్వాధీనం చేసుకున్నారు.

నిఘా పెంచాం
నత్తలను అక్రమంగా తరలించే వ్యవహారంపై గట్టిగా దృష్టి పెట్టాం. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి అక్రమ రవాణాకు ఉపయోగించే పడవలకు శాఖాపరంగా అందే రాయితీలను ఆపేయించాం. సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

- భవాని, అటవీశాఖ రేంజ్‌ అధికారి, అవనిగడ్డ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.