Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మనకూ ముప్పు?

19 ఏళ్ల కనిష్ఠానికి వాహన విక్రయాలు 
ఖరీదైన వస్తువుల జోలికెళ్లని జనం 
ఇవన్నీ ఆర్థిక మాంద్యం సంకేతాలేనా?

బిస్కట్‌ ప్యాకెట్‌ కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  
- బ్రిటానియా లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ బెర్రీ 

ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5% దాటకపోవచ్చు. ప్రభుత్వం 7% వృద్ధి ఉంటుందని చెబుతోంది, కానీ 6.5% నమోదైనా అదృష్టమే. ప్రైవేటురంగానికి ఇది క్లిష్టమైన సమయం. 
- ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ వార్షిక సమావేశంలో ఛైర్మన్‌ ఏ.ఎం.నాయక్‌

మాంద్యం లక్షణాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగేతర ఆర్థికసంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), గృహరుణ సంస్థలకు నగదు లభ్యత లేకపోవటం, అప్పులిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవటం దీనికొక ముఖ్యమైన కారణం. 
- హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ 

ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యం సంకేతాలు భారత్‌లోనూ కనిపిస్తున్నాయా..? దేశ ఆర్థికరంగంలో జరుగుతున్న పరిణామాలు, నిపుణుల అభిప్రాయాలను పరిశీలిస్తుంటే పరిస్థితి పూర్తి సజావుగా లేదని స్పష్టమవుతోంది. బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. వాహనరంగం సహా పలు రంగాల్లో అమ్మకాలు పతనమవుతున్నాయి.  స్టాక్‌మార్కెట్లు పతనం అవుతున్నాయి. ఇవన్నీ మన దేశం కూడా ఆర్థికమాంద్యానికి దగ్గరవుతోందన్న సూచనలిస్తున్నాయి. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెడుతోంది. 

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం మున్ముందు తలెత్తబోయే సంక్షోభానికి సూచికగా పలువురు ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు. పలు రంగాల్లో అమ్మకాలు తగ్గిపోవటం, బంగారం ధర అనూహ్యంగా పెరగటం, రూపాయి విలువ పతనం.. ఇలాంటివన్నీ దేశ ఆర్థికవ్యవస్థ బాగా లేదనడానికి సంకేతాలని స్పష్టమవుతోంది. ఈ వేడి ఇప్పటికే వినియోగదారులకు తగులుతోంది. అందుకే వారు కొనుగోళ్లకు తొందరపడటం లేదు. ఖరీదైన వస్తువుల జోలికి వెళ్లటం లేదు. అమ్మకాలు క్షీణించడానికి ఇదే కారణం. దీనికితోడు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాలు చూస్తే మున్ముందు ఇంకా పతనావస్థ ఉందనే అభిప్రాయం కలగక మానదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తుంది.

వృద్ధిరేటు నేల చూపులు! 
ఇటీవల వరకూ మనదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగానే వృద్ధిరేటు నమోదుచేస్తుందని అంచనావేశారు. కానీ ఇప్పుడది 6.5% దాటితే గొప్ప అని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.

స్టాక్‌ మార్కెట్‌కు దెబ్బ 
దేశ ఆర్థికవ్యవస్థ స్థితిగతులను స్టాక్‌మార్కెట్‌ ముందే పసిగడుతుంది. దాన్నొక ప్రమాణంగా తీసుకుంటే గత నెలరోజుల్లో ఏం జరిగిందో అర్థమవుతుంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ) సూచీ అయిన సెన్సెక్స్‌ 3,000 పాయింట్లు, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) సూచీ- నిఫ్టీ 1,000 పాయింట్లు పతనం అయ్యాయి. మదుపరులు రూ.10 లక్షల కోట్లకు పైగా సంపదను పోగొట్టుకున్నారు. కీలక రంగాల్లో ఇప్పటికే పతనావస్థ కనిపిస్తోంది. వాహన, స్థిరాస్తి రంగాలు ఇందుకు సంకేతాలు. ఈ రంగాలు కుంగిపోతే దాన్ని మాంద్యానికి సంకేతంగా ఆర్థికనిపుణులు పరిగణిస్తారు.

వాహన, స్థిరాస్తి రంగాల కుదేలు 
దేశంలో వాహన రంగం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. ఇప్పుడున్నంత పతనం వాహన రంగంలో ఎన్నడూ లేదని సియామ్‌(వాహన తయారీదారుల సంఘం) చెబుతోంది. వాహన తయారీదారులు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించారు. డీలర్ల వద్ద కార్ల నిల్వ పెరిగిపోయి, స్థిరాస్తి రంగంలోనూ అదే పరిస్థితి. చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ నగరాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ధరల్లో పెరుగుదల లేకపోగా క్రయవిక్రయాలు మందగించాయి. హైదరాబాద్‌ ఒక్కటే దీనికి మినహాయింపు. వచ్చే ఆరేడు నెలల్లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు తగ్గొచ్చని నైట్‌ ఫ్రాంక్‌- ఫిక్కీ- నరెడ్కో సర్వేలో స్పష్టమైంది. ‘‘స్థిరాస్తిలోనే కాక వాహన, వినియోగ వస్తువుల రంగాల్లో అమ్మకాలు తగ్గుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌ శిశిర్‌ బైజాల్‌ పేర్కొన్నారు.

బంగారం ధర పెరుగుతోందంటే.. 
ఆర్థికమాంద్యం దగ్గరవుతోందనడానికి ఒక సంకేతం బంగారం ధర అనూహ్యంగా పెరగడం. ఇది గతంలో నిరూపితమైంది. ఇప్పుడూ ఇదే జరగబోతోందా? ఇటీవల ఉన్నట్టుండి పసిడి కొండెక్కి కూర్చుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న పెట్టుబడి సాధనం బంగారం. 2008 ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.11,000 వరకు ఉంది. ఏడాది తిరిగేసరికి రూ.14,500కు చేరింది. ప్రపంచవ్యాప్త ఆర్థికమాంద్యమే దీనికి కారణం. తర్వాత కోలుకుంది. ఇటీవల చాలాకాలం పాటు 10 గ్రాముల బంగారం ధర రూ.32,000- రూ.33,000 మధ్య ఉంది. తర్వాత జోరు పెరిగింది. జులై 1, 2019న హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.34,800. ఈ నెల 1న రూ.35,700కు చేరుకుంది. అంటే ఒక నెలలోనే రూ.900 పెరిగింది. ఈనెల 14న ఇంకా పెరిగి రూ.38,920 పలికింది. రెండు వారాల్లో దాదాపు రూ.3,220 పెరిగింది. ఇప్పటికే బంగారం ధర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది.

మాంద్యానికి కారణాలేమిటి? 
ప్రస్తుత మాంద్యానికి ఎన్నో కారణాలున్నట్లు ఎస్‌బీఐ నివేదిక విశ్లేషించింది. ప్రపంచవ్యాప్త పరిస్థితులకు తోడు మనదేశంలో సంస్థాగత కారణాలు కనిపిస్తున్నాయంది. వేతనాలు తగ్గి.. పొదుపు పడిపోయింది. వస్తు-సేవల గిరాకీ తగ్గడానికి ఇదో ముఖ్యమైన కారణమని విశ్లేషించింది. ‘‘కొత్త పెట్టుబడులు లేక.. ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ప్రైవేటు పెట్టుబడులు క్షీణించాయి. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటురంగం వాటా 2007-14 మధ్య 50% ఉంటే, 2015-19 మధ్య 30%కు పడిపోయింది. వివిధ రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది. ఉత్పత్తి సామర్థ్య వినియోగం 76.1% కంటే లేదు. ఇది పెరగాలంటే రంగాలవారీగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి’’ అని ఈ నివేదిక పేర్కొంది. వాహన రంగం అన్ని దేశాల్లోనూ పతనాన్ని చూస్తోంది. చైనాలో ఈ రంగం పెను సంక్షోభంలో ఉంది. అమెరికాలో చాలాకాలం తర్వాత ఇటీవలే అమ్మకాలు కొంత పెరిగాయి. జర్మనీలో ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వాహన విక్రయాలు 12% తగ్గాయి.

ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వ కసరత్తు 
ఇటీవల స్టాక్‌మార్కెట్లు కుదేలవడం, వాహనరంగ సంక్షోభం, వినియోగ వస్తువుల అమ్మకాల తగ్గుదల లాంటి సంకేతాలు చూసిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కొన్ని రంగాలకు రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడిన ప్యాకేజీలను ప్రకటించాలని యోచిస్తోంది. జీఎస్‌టీ భారాన్ని తగ్గించటం, డిమాండ్‌ పెరిగేందుకు రాయితీలు ఇవ్వడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, రుణ లభ్యతను పెంపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం... లాంటి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పారిశ్రామికవేత్తలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అవుతున్నారు. దిద్దుబాటు చర్యలు చేపడతామనే సంకేతాలూ ఇస్తున్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం నుంచి త్వరలో కొన్ని సానుకూల చర్యలుంటాయని పారిశ్రామికవర్గాలు ఆశిస్తున్నాయి.

- ఈనాడు బిజినెస్‌ బ్యూరో

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.