Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రమణకు మళ్లీ అదే వరం? 

ప్రత్యర్థుల బలహీనతే ఆయన గెలుపు సోపానం? 
ఇదే భాజపాకు కలిసొచ్చే అంశం 
అజిత్‌ జోగి ఓట్లు చీల్చడంపైనే పార్టీల విజయావకాశాలు 
ఇదీ ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ముఖచిత్రం 

రమణకు మళ్లీ అదే వరం? 

అదృష్టవంతుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది రమణ్‌సింగే. ఛత్తీస్‌గఢ్‌లో గత మూడు పర్యాయాలు భాజపాను విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ఆయన. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సొంత వ్యూహాల కంటే.. ప్రత్యర్థుల ఓట్ల చీలికే ఆయనకు కలసి వస్తోంది. ఈ దఫా ఆ బాధ్యతను (ఓట్లను చీల్చే పనిని) జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ అధినేత అజిత్‌జోగి తీసుకునేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు..

రమణకు మళ్లీ అదే వరం? 

కాంగ్రెస్‌లో జోగి కలవరం

రమణకు మళ్లీ అదే వరం? మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి ఆవిర్భవించిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. భాజపా నేత, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఒకవైపు.. కాంగ్రెస్‌ మరోవైపు ఉండగా, ఇతర పక్షాలు ఇతోధికంగా ఓట్లను చీల్చుతున్నాయి. గత మూడు దఫాలూ ఇదే జరిగి రమణ్‌సింగ్‌ విజయకేతనం ఎగురవేశారు. సాధారణంగా దీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీపై ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉంటుంది. ఈ అంశమే తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ కొన్ని నెలలుగా కోటి ఆశలు పెట్టుకుంది కూడా. ఇప్పుడు అజిత్‌జోగి పేరుతో వారిలో కొత్త కలవరపాటు మొదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో జోగి కాంగ్రెస్‌ తరఫున గెలుపొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత ఆయన ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్‌ అధికారానికి దూరమయ్యింది. ఇప్పుడు ఆయన ఏకంగా వేరుకుంపటి పెట్టుకున్నారు. అజిత్‌ జోగి-మాయావతి (జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌- బీఎస్పీ) కూటమి రూపంలో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీయవచ్చనేది కాంగ్రెస్‌ ఆందోళన. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలన్నదే మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, భాజపాను మూడు దఫాలు విజయతీరాలకు చేర్చిన రమణ్‌సింగే ఆ పార్టీకి పెద్దదిక్కు. పరిపాలన, నిజాయతీపరుడన్న పేరు, విపక్ష నేతల పరోక్ష ప్రభావం, సహకారమే ఆయన పదవిలో కుదురుకోవడానికి దోహదపడుతోందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులతో కూడిన ఛతీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావమూ అధికమే. అలాంటిచోట అభివృద్ధి పనులు, పరిపాలన సవాలుతో కూడుకున్నదే. అయినప్పటికీ రమణ్‌సింగ్‌ నేర్పుగా పాలన సాగిస్తారని పేరు తెచ్చుకున్నారు. అయితే 2013 ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనుకబాటుతనం వల్ల భాజపాకు ఇబ్బందులు తలెత్తవచ్చేమోనని దిల్లీలోని కమలనాథుల్లో గుబులు కనిపిస్తోంది. అదే సమయంలో మహిళలు, యువతకు స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు ఉద్దేశించిన ఛత్తీస్‌గఢ్‌ సంచార్‌ క్రాంతి యోజన, ఉపాధి హామీ కూలీల కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార వితరణ పథకాలు తమను ఆదుకుంటాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు రామ్‌దయాళ్‌ దెబ్బ

రమణకు మళ్లీ అదే వరం? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రామ్‌దయాళ్‌ ఉయికే గతవారం భాజపాలో చేరారు. వ్యూహాలు రచించాల్సిన తరుణంలోనే సాక్షాత్తూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, గిరిజన ఓటర్లలో పట్టున్న నేత పార్టీకి దూరమవడం, అదీ ప్రత్యర్థి భాజపా గూటికి చేరడం కాంగ్రెస్‌కు అశనిపాతమే అవుతుంది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, భాజపాకు ఇది కలిసొచ్చే అంశం అనడంలో సందేహమే లేదని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహాలపై రామ్‌దయాళ్‌కు సమస్తం తెలిసి ఉన్నందున ఆ మేరకు తన వ్యూహాలను మార్చుకుని భాజపా లాభపడొచ్చని అంటున్నారు. అసోంలో శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమన్‌ బిస్వా శర్మ భాజపాలో చేరినప్పుడు కాంగ్రెస్‌కు ఎదురైన పరిస్థితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోనూ పునరావృతం అవుతుందని కొందరు చెబుతున్నారు. రామ్‌దయాళ్‌ గత ఎన్నికల్లో కీలకమైన పాలి తనఖర్‌ నియోజకవర్గం నుంచి 36,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మళ్లీ పాలి తనఖర్‌ నియోజకవర్గం నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు.

తొలిసారి 
వి.సి.శుక్లా పుణ్యం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఓట్ల చీలికే భాజాపాకు బాగా కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తోంది. 2003లో బహుముఖ పోటీ వల్ల లబ్ధి పొంది భాజపా అధికారంలోకి వచ్చింది. ఓట్ల చీలికలో శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) కీలక పాత్ర పోషించింది. అప్పుడు అధికారం కోల్పోయింది అజిత్‌ జోగియే కావడం గమనార్హం. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత విశ్వసనీయుడిగా మెలిగేవారు. పార్టీ వ్యవహారాల్లో ఆమె పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో టిక్కెట్ల కేటాయింపులో తన మాటే నెగ్గించుకున్నారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన సీనియర్‌ నేత దివంగత వి.సి.శుక్లాను పూర్తిగా పక్కనపెట్టారు. దానిని తట్టుకోలేని ఆయన శరద్‌ పవార్‌ను సంప్రదించి ఎన్‌సీపీని రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో భాజపా 39.26 శాతం ఓట్లు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 36.71 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్‌సీపీకి 7.02 శాతం ఓట్లు లభించాయి. మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీకి 4.45 శాతం ఓట్లు వచ్చాయి. ఒక వేళ ఎన్‌సీపీ రంగంలో లేకుండా ఉండిఉంటే ఆ 7.02% ఓట్లు కాంగ్రెస్‌కే లభించేవి. అప్పుడు 43.73 శాతం ఓట్లతో భాజపాను మించిపోయి ఉండేది.

రెండోసారి 
మేలు చేసిన మాయావతి

2008 ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. వి.సి.శుక్లా మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అయినా కాంగ్రెస్‌ విజయావకాశాలను బీఎస్పీ భారీగా దెబ్బతీసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతాన్ని 38.6 శాతానికి పెంచుకోగలిగింది. భాజపాకు 40.33 శాతం ఓట్లు వచ్చాయి. రెండింటి మధ్య తేడా 1.73 శాతం మాత్రమే. కానీ గెలుపొందిన సీట్లలో మాత్రం భారీ తేడా ఉంది. మొత్తం 90 స్థానాల్లోనూ భాజపాకు 50, కాంగ్రెస్‌కు 38 సీట్లు వచ్చాయి. బీఎస్పీ 6.11 శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు స్థానాలు గెలుచుకుంది.

మూడోసారి 
చిన్నపార్టీల అండ

2013లో భాజపా అధికారంలోకి వచ్చిందంటే అందుకు చిన్నాచితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల అండదండలే కారణం. కాంగ్రెస్‌ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీలు పనిచేశాయి.

రమణకు మళ్లీ అదే వరం? 

రమణకు మళ్లీ అదే వరం? 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.