close

ప్ర‌త్యేక క‌థ‌నం

నేటి రాజకీయాలకు డబ్బుచేసింది 

అప్పట్లో బంజారాహిల్స్‌లో స్థలం ఇస్తే వద్దన్నా.. 
ఆనాటి ఎమ్మెల్యే కొండిగారి రాములు ఆదర్శ ప్రస్థానం 
ఈనాడు - హైదరాబాద్‌ 
నేటి రాజకీయాలకు డబ్బుచేసింది 

రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. నిజాయతీగా ప్రజల కోసం బతకాలని భావించా. ఊళ్లో సొంతంగా చిన్న ఇల్లు కట్టుకునేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది నేటి ప్రజాప్రతినిధుల సంపాదన.. రాజకీయాల్లో అవినీతిని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతోంది. సేవ కోసం ఎవరూ రాజకీయాల్లోకి రావడం లేదు.. డబ్బు సంపాదనకే రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి.
- కొండిగారి రాములు

సర్పంచి పదవి దక్కితే చాలు కొద్దినాళ్లలోనే రూ. లక్షలు వెనకేసుకుంటున్న నాయకులున్న రోజులివి. హైదరాబాద్‌ నగర శివారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన కొండిగారి రాములు సంపాదించుకున్న ఆస్తులేమీ లేవు. నిజాయతీకి మారుపేరుగానే ఉన్నారు. వారసులకు పదవులు ఇప్పించుకోవాలని కూడా ఆయన ఏనాడూ తపన పడలేదు. ఇప్పటి డబ్బు రాజకీయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని.. రాజకీయాలు మారాలంటే యువత పూనుకోవాల్సిందే అని అంటున్న  కొండిగారి రాములు తన మనసులో మాటను ‘ఈనాడు’తో పంచుకున్నారు.

సేవ చేసేందుకే వచ్చేవాళ్లం... 
‘‘వందల ఎకరాలు సొంత ఆస్తులను ప్రజల కోసం త్యాగం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వామపక్ష ఉద్యామాల వైపు ఆకర్షితుడినయ్యాను. ఆ తరవాత అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. సీపీఎం తరఫున 1989, 1994 ఎన్నికల్లో రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాను. 1989లో మా ఎన్నికల ఖర్చు రూ. 88,000 మాత్రమే. అది కూడా పార్టీ తరఫునే ఖర్చుపెట్టేవారు. 1994లో రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాం. కార్యకర్తలంతా కాలినడకన, సైకిళ్ల మీద ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేసేవారు. అభ్యర్థిగా నాకు ఒక్కరికే ప్రచారంలో పాల్గొనేందుకు జీపు ఇచ్చారు. మొదటిసారి గెలిచినప్పుడు శాసన సభ్యులకు గౌరవ వేతనం రూ. 7500. ఇందులో రూ. 1000 మాత్రం కుటుంబ ఖర్చులకు తీసుకొని మిగిలిన మొత్తాన్ని పార్టీకి ఇచ్చేసేవాడిని. రెండోసారి గెలిచినప్పుడు గౌరవ వేతనం రూ. 18,000. అప్పుడు నా కుటుంబ అవసరాలకు రూ. 1200 తీసుకొని మిగిలినది పార్టీకి ఇచ్చేసేవాడిని. ఇలా ఇవ్వాలనేది పార్టీ నిబంధన. అప్పుడు పార్టీలు ఎవరిని నిర్ణయిస్తే వారే అభ్యర్థులుగా ఉండేవారు. నేను శాసనసభకు గెలిచిన వెంటనే కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు నా దగ్గరకు వచ్చారు.. ‘సార్‌ ఎమ్మెల్యేగా గెలిచిన వారు ప్రతి కాంట్రాక్టు పనిలోనూ కొంత పర్సంటేజీ కమీషన్‌గా తీసుకుంటారు. మీకెంత ఇవ్వమంటారని’ అడిగారు. ఆ మాట విని ఆశ్చర్యపోయా.. ‘నాకు డబ్బులు వద్దు.. ప్రజల కోసం చేసే పనులు పక్కాగా చేయండి చాలని’ చెప్పాను.

500 గజాల స్థలం వద్దన్నా.. 
మేము శాసనసభకు ఎన్నికైన తరవాత అప్పటి ప్రభుత్వం శాసన సభ్యులందరికీ బంజారాహిల్స్‌లో ఒక్కొక్కరికి 500 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించింది. అప్పట్లోనే వాటి విలువ ఎంతో ఎక్కువగా ఉండేది. అయినా తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. వద్దని చెప్పేశాను. సీపీఎం తరఫున గెలిచిన ఇతర సభ్యులు కూడా తీసుకోలేదు. 1999లో ఓడిపోయిన తరవాత నాకు ఇల్లు లేకుండాపోయింది. ఇబ్రహీంపట్నంలో మా నాన్న నుంచి నాకు దక్కిన ఇల్లు కూలిపోయింది. నాకు మరో సంపాదన లేదు. చిన్న ఇల్లు కట్టుకోడానికి సహకరించమని అభిమానులను కోరాను. అంతా రూ.వెయ్యి.. రెండు వేలు చొప్పున చందాలు వేసుకొని ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఉన్న ఆస్తి అదొక్కటే’’.

నేటి రాజకీయాలకు డబ్బుచేసింది 

యువత డబ్బు ఆశించొద్దు 
డబ్బు రాజకీయాలను యువత వ్యతిరేకించాలి. 
డబ్బు ఖర్చుపెట్టి ఓట్లు కొనుక్కొనే వ్యవస్థ పోయి నిజాయితీగా ప్రజలకు సేవ చేసే వారే అధికారంలోకి రావాలంటే.. ముందుగా యువతే స్పందించాలి. డబ్బు ఆశించకుండా ఓట్లు వేయాలి. 
నాకు ముగ్గురు పిల్లలు.. ఒక కుమారుడికి క్యాన్సర్‌ వచ్చింది. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నాడు. మూడోవాడు ఐటీఐ పాసయ్యాడు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.