close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటుపై వేటు 

ఓటుపై వేటు 

హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గంలో ఈ చోద్యం చూడండి.

అది 16-8-131 డోర్‌ నంబరు ఇల్లు. ఇక్కడ ఏకంగా 694 మంది ఓటర్లు ఉన్నారట.

జాబితా చూసిన జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు క్షేత్రస్థాయికెళ్లి విచారిస్తే ఎనిమిదిమందే ఉండటం గమనార్హం.

అదే నియోజకవర్గంలోని 16-2-52/బీ/1 డోర్‌నంబరులో 478 మంది, 16-3-535లో 440, 16-8-592లో 407, 16-11-20లో 402, 16-11-577లో 363, 16-11-606లో 308, 16-8-149/2లో 302మంది ఓటర్లున్నారు.

తాజా జాబితాలోనూ ఇదే పరిస్థితి ఉంది.. హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఓటరు జాబితాల్లో తప్పులు, లోపాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక కారణాలు, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం... కారణాలేవైనా కాని.. ఈ లోపాలు ఎన్నికల ప్రక్రియకు అవరోధంగా మారుతాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓటరు జాబితాల్లో లోపాలపై ‘ఈనాడు’ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా విస్తుగొలిపే వాస్తవాలెన్నో వెలుగుచూశాయి. అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

‘ఈనాడు’ పరిశోధన వివరాలు సంక్షిప్తంగా..

ఓటుపై వేటు 

ఓటరెట్లా ఓడెనంటే 
ఓటుపై వేటు 

ప్రజాస్వామ్య పండుగకు వేళ సమీపిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అధికారులు ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ప్రజాస్వామ్య ప్రియులు పిలుపునిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. కవులు తమ కవితలు, పాటల ద్వారా చైతన్యపరుస్తున్నారు. గాయకులు గజ్జెకట్టారు. పల్లెలు పట్టణాలు ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. ఓటర్లు కూడా తమ పాలకులను ఎన్నుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన యువతీ యువకులు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఓటు వేయకుంటే నేను మరణించిన వారితో సమానమే అని భావిస్తూ వృద్ధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ... 
ఎన్నికలకు మూలాధారమైన రాష్ట్రఓటర్ల జాబితాలో లోపాలు ఎంతో మందికి నిరాశ కలిగిస్తున్నాయి. 
ఇప్పటికే ఎన్నో సార్లు ఓటేసిన వారి పేర్లు ఈ సారి గల్లంతయ్యాయి. 
కొత్తగా నమోదు చేసుకున్న వారిపేర్లు జాబితాలో కనిపించడంలేదు. 
చాలాచోట్ల ఫొటోలు తారుమారయ్యాయి. 
కొన్ని చోట్ల ఒకే ఇంట్లో వందలాది ఓట్లు నమోదయ్యాయి 
బతికున్నా చనిపోయినట్లు పేర్కొని ఓట్లు తొలగించారు.

ఇంకా ఎన్నెన్నో లోపాలు... మరెన్నో సిత్రాలు

సాంకేతిక కారణాలు, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం... కారణాలేవయినా ఎంతో మంది ఓటరు దేవుళ్లు మాత్రం ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. వారికి సమాధానం దొరుకుతుందా? ప్రజాస్వామ్యం సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందా?

ఓటు జారీ గల్లంతయిందే.... 
ఓటుపై వేటు 

ఈమె పేరు శోభాదేవి. ఖమ్మం నగరంలోని ద్వారకానగర్‌. నలుగురి కుటుంబ సభ్యుల్లో ముగ్గురికే ఓటు ఉంది. అమె పేరు లేదు. పరిశీలనకు వచ్చిన అధికారులకు ఈ విషయం చెప్పినా కొత్త జాబితాలో సరిదిద్దలేదు.

ఓటుపై వేటు 

విశ్రాంత ఎస్సై అయిన కత్తి సుబ్బయ్య ఖమ్మంలోని శ్రీరాంనగర్‌లో ఉంటున్నారు. అక్కడ ఉన్న ఓటు ఆయనకు తెలియకుండానే రోటరీనగర్‌కు మారింది. ఇది తెలిసి సవరణకు దరఖాస్తు చేశారు. తాజా జాబితాలో మార్చలేదు సరికదా రోటరీనగర్‌లోనూ గల్లంతయింది.

ఓటుపై వేటు 

డాక్టర్‌ కె. లక్ష్మణ్‌రావు, మలక్‌పేట వీకేడాగేనగర్‌ హౌజింగ్‌ సొసైటీ అధ్యక్షుడు. ఆయన ఇంట్లో (16-2-740/75/52)  నాలుగు ఓట్లున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇప్పుడు మాత్రం ఆయన ఓటు గల్లంతయ్యింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తే మళ్లీ దరఖాస్తు చేసుకోమన్నారు.

ఓటుపై వేటు 

మలక్‌పేట ఎస్బీహెచ్‌ జీఏ-1 కాలనీ సంక్షేమ సంఘం కోశాధికారి కె. శ్రీరామమూర్తి 16-2-752/5 నెంబరు ఇంట్లో  ఉంటున్నారు. ఆయన, ఆయన భార్య ఓటునూ తొలగించారు. వారి ఇంట్లో కిరాయికి ఉన్నవారివి మాత్రం ఉన్నాయి. గతంలో ఉండి ఖాళీ చేసినవారివి ఇప్పటికీ ఉన్నాయి. గత 40 ఏళ్లుగా ఉన్న తమ ఓట్లు ఎందుకు తీశారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఒకే కుటుంబంలో ఇద్దరి ఓట్లు.. 
ఓటుపై వేటు 

రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌నకు చెందిన చిప్ప శంకర్‌, లక్ష్మి దంపతుల ఓట్లు  గల్లంతయ్యాయి. ఇటీవలే శంకర్‌ సింగరేణిలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ నెల 12న విడుదలైన తుది జాబితాలో ఇద్దరి పేర్లూ లేవు. కుమారుడి పేరు ఉంది. భార్యాభర్తల ఇద్దరి ఓట్లు తుది జాబితాలో లేకపోవడంతో కంగుతిన్నారు. ఇపుడు దరఖాస్తు చేసుకున్నా ఈ ఎన్నికలకు ఓటు హక్కు వస్తుందా లేదా అన్న ప్రశ్నకు అధికారులూ సమాధానం చెప్పడంలేదు.

బతికుండగానే చంపేశారు 
ఓటుపై వేటు 

మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన మల్క శంకరయ్య బతికి ఉండగానే చనిపోయినట్టుగా ఓటరు జాబితాలో చేర్చారు. ఇప్పటికి ఆయన వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు..

మహిళలు, పురుషులు తారుమారు 
ఓటుపై వేటు 

ఖమ్మం నగరంలోని శ్రీరాంనగర్‌కు చెందిన మైలవరపు అమూల్య ఇంటి నెంబర్‌ 20-4-187లో నివాసం ఉంటున్నారు. ఓటరు జాబితాలో ఆమె పేరు వద్ద పురుషుడి ఫొటోతో ప్రచురించారు.

మరణాన్ని మార్చారుఓటుపై వేటు 

ఈమె పేరు జటంగి నర్సమ్మ. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారం నివాసి. భర్త పేరు లింగయ్య. పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 140లో ఈమెకు ఓటు హక్కు ఉండేది. ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆమె పేరును మరణించిన వారి జాబితాలో చేర్చారు. లింగయ్య మొదటి భార్య అవిలమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆమె పేరును తొలగించమంటే నర్సమ్మ పేరు తీసివేశారు.

మరాఠీలకు తెలుగు జాబితా....

జుక్కల్‌ నియోజకవర్గంలో మరాఠి భాష మాట్లాడేవారు ఎక్కువగా నివాసం ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు 2009, 2014లలో ఓటరు జాబితాను మరాఠిలో ముద్రించి పోలింగ్‌కేంద్రాల వారీగా పంపిణీ చేశారు. ప్రస్తుతం కేవలం తెలుగులోనే ముద్రించి పంపిణీ చేస్తున్నారు. జాబితాలో పేర్ల పునరుక్తులను తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నూతన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడంతో కేవలం తెలుగులోనే  ముద్రించినట్లు అధికారులు చెబుతున్నారు.

గొర్రెదాటు 
ఓటుపై వేటు 

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని 164 పోలింగ్‌ బూత్‌ పరిధిలో 1002 మంది ఓటర్లు ఉన్నారు. జాబితా డొల్లతనాన్ని ‘న్యూస్‌టుడే’ బయటపెట్టింది.   డోర్‌ నెంబర్‌ 3-5-40 ఇంట్లో ఉన్న ఓ మహిళ పేరును ‘గొర్రె’గా నమోదు చేశారు. ఆమె ఫొటో ఏకంగా 9 సార్లు ముద్రించారు. నిజానికి ఆమె పేరు గొర్రె అమల. ఆన్‌లైన్‌లోనూ పూర్తిగానే నమోదయింది. కానీ జాబితాలో ఇంటిపేరును మాత్రమే ప్రచురించారు. నిధి అనే మరో మహిళ పేరు 6 సార్లు నమోదైంది. రాహుల్‌ పేరుతో ఉన్న మరో వ్యక్తికి అధికారులు నాలుగు సార్లు చోటు కల్పించారు. ఒక్క బూత్‌కు సంబంధించిన జాబితాలోనే ఇన్ని తప్పులు ఉండటం విశేషం. అయినా అధికారులు సరిదిద్దకపోవడం గమనార్హం.

బూత్‌ వద్ద కనిపించని జాబితాలు

ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ప్రతి పోలింగ్‌బూత్‌లో ప్రదర్శించాల్సి ఉంది. కానీ చాలా చోట్ల బూత్‌ల వద్ద అవి కనిపించడం లేదు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 80 శాతం కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. బూత్‌ల్లో పెట్టాల్సిన వాటిని కూడా రాజకీయ పార్టీలకే అందించినట్లు సమాచారం. దీంతో కొత్తగా ఓటు, సవరణలకు నమోదు చేసుకున్న వారి పేరు జాబితాలో ఉందో..? లేదో..? తెలుసుకోవడానికి వీలులేకుండా పోయింది

రోహింగ్యాలకూ ఓట్లు..

మయన్మార్‌ నుంచి శరణార్థులుగా హైదరాబాద్‌కు వచ్చిన రోహింగ్యాలకు సైతం పాతబస్తీలో ఓట్లు ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. నిబంధనల మేరకు వారికి ఎలాంటి గుర్తింపుకార్డు మంజూరు కాకూడదు. అయినా ఆరు నియోజకవర్గాల పరిధిలో 189 మంది రోహింగ్యాలకు ఓటరు కార్డులు జారీ అయ్యాయి. గుర్తింపుకార్డులను కొందరు కిందిస్థాయి అధికారులు అంగట్లో సరకులా విక్రయిస్తుండటమే ఇందుకు కారణమని ఇటీవల ‘ఈనాడు’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.

వలస కార్మికుల పేర్లు రెండు చోట్లా తొలగింపు 
ఓటుపై వేటు 

పొట్టచేత పట్టుకొని వలస వెళ్లిన కార్మికులది మరో విచిత్ర పరిస్థితి. వారికి సొంతూళ్లలో ఓటు తీసివేయగా, వలస వెళ్లిన చోటా ఆ హక్కు లభించలేదు. ఉదాహరణకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2014 జాబితా నుంచి 1,65,497 ఓట్లను అధికారులు తొలగించారు. ఇందులో సగానికిపైగా వలస వెళ్లినవారివే ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలామందికి ఉపాధి పొందుతున్న పట్టణంలోనూ ఓటు లభించలేదు. పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పెద్దఎత్తున గ్రామీణులు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడే ఉపాధి చూసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరంతా పండగలు.. పబ్బాలకు సొంతూళ్లకు వస్తుంటారు. స్థానికంగా లేనందున అధికారులు వారి పేర్లు తొలగించారు.

నామినేషన్ల గడువు వరకూ సరిదిద్దుతాంఓటుపై వేటు 

కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఈఆర్వో నెట్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ద్వారా సింహ భాగం తప్పులు సరిదిద్దగలిగాం. బోగస్‌ ఓటర్ల ఏరివేతతో పాటు మృతుల పేర్లూ తొలగించాం. దేశం మొత్తం మీద ఈ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోనే తొలిసారిగా వినియోగించాం. సాంకేతిక సమస్యల వల్ల ఒకే వ్యక్తికి పలు ఓట్లు ఉన్నట్లు తాజాగా గుర్తించాం. వాటిని త్వరలో తొలగిస్తాం. ఇంకా ఏమైనా ఫిర్యాదులుంటే నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు చక్కదిద్దుతాం. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నదే మా లక్ష్యం
- తెలంగాణ  రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌
మలక్‌పేట నియోజక వర్గంలో ఒకే ఇంట్లో వందల ఓట్లు ఉండటంపై హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ను వివరణ కోరగా పాతబస్తీలో డోర్‌ నెంబర్ల వ్యవస్థ సరిగా లేదన్నారు. దీంతో 2017లో కూడా ఇలాంటి ఫిర్యాదులే వస్తే అధికారులు పరిశీలించారన్నారు. అనర్హులుంటే తొలగించామని, కొందరికి బైనెంబర్లతో ఓటక్కు కల్పించామన్నారు. తాజా ఫిర్యాదునూ పరిశీలిస్తామన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.