
ప్రత్యేక కథనం
న్యాయస్థానాల ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం
పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు
* ఆయనో పేద రైతు. తనకున్న కొద్దిపాటి భూమే అతనికి ఆసరాÅ. స్థానికంగా చేపట్టిన చెరువు పనుల వల్ల ఆ భూమి కాస్తా మునిగిపోయింది. దీంతో ఆయన కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి పరిహారం చెల్లించాలని 2013లో తీర్పు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోలేదు. దీంతో పిటిషనర్ హైకోర్టులో కోర్టుధిక్కార వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్లు తేల్చారు. కలెక్టర్, సబ్‌డివిజన్ డిప్యూటీ ఇంజినీర్లకు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష విధించారు.* వారు చిరుద్యోగులు. చాలీచాలనీ జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై కమిటీ వేసి, నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. 2015లో ఇచ్చిన ఈ తీర్పు అమలుకు నోచుకోకపోవడంతో గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మికులు హైకోర్టులో కోర్టుధిక్కరణ కేసు దాఖలు చేయాల్సి వచ్చింది.
* ఆయన సాధారణ బిల్డరే. అయినా ఎంత తెగింపో చూడండి. ఓ అయిదంతస్తుల భవన నిర్మాణంపై వివాదం తలెత్తడంతో కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు ఇచ్చింది. అయినా పనులు ఆపలేదు. దీంతో కోర్టు రూ. లక్ష జరిమానా విధించింది
* శాసనసభ్యులను బహిష్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. అయినా అమలులోకి రాకపోవడంతో న్యాయశాఖ, శాసనసభ కార్యదర్శులపై ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
సామాన్యుడి నుంచి అత్యున్నత అధికారుల వరకు కోర్టు ఉత్తర్వులను ఎలా గౌరవిస్తున్నారనడానికి ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ శాసనాలను రూపొందిస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖది. శాసనవ్యవస్థ రూపొందించిన శాసనాలను అమలు చేయడంలో కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనపుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగం, చట్టాల ద్వారా సామాన్యుడికి దక్కిన హక్కులకు భంగం కలిగినపుడు న్యాయవ్యవస్థ రక్షణగా నిలబడుతుంది. కోర్టు ఉత్తర్వులను ఎవరైనా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే రాను రాను ఉత్తర్వుల అమలులో అధికారుల నుంచి సామాన్యుడి వరకు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులైతే ఏమిటనే ధోరణి పెరిగిపోతోంది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయ్యాకే కొన్ని ఉత్తర్వులు, తీర్పులు అమలవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వాలు, బాధ్యత ఉన్న అధికారులు కూడా ఇదే ధోరణిలో ఉండటం గమనార్హం. రైతు రుణ విమోచన కమిషన్, సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, సమాచార కమిషన్ నియామకాలు, రాష్ట్ర భద్రత కమిషన్ ఏర్పాటు, పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఏర్పాటు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాకే అమలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కోర్టు ధిక్కరణ పూర్వాపరాలు
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కోర్టు ధిక్కరణపై విచారణ అమలులో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1800 కింద మొదట ఏర్పాటైన సుప్రీం కోర్టులు, ఆపైన ఇండియన్ హైకోర్టుల చట్టం 1861 కింద ఏర్పాటైన హైకోర్టులు విచారణ చేపట్టేవి. 1952లో కోర్టు ధిక్కరణ చట్టం వచ్చేదాకా బ్రిటిష్ కాలంనాటి 1926 చట్టమే అమలులో ఉండేది. ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ 1960లో బిల్లు తీసుకువచ్చారు. దానిపై కమిటీని ఏర్పాటు చేసి అంతిమంగా 1952నాటి చట్టం స్థానంలో 1971లో కోర్టు ధిక్కరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లేకపోయినప్పటికీ రాజ్యాంగంలోని అధికరణ 129, 215ల కింద సుప్రీంకోర్టు, హైకోర్టులకు కోర్టు ధిక్కరణ కేసులను చేపట్టే అధికారం ఉంది.
పదే పదే ఆగ్రహం ఉత్తర్వుల అమలులో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై పలుమార్లు హైకోర్టు మండిపడింది. కొన్ని సంఘటనల్లో అవినీతిపరులతో కుమ్మక్కై తీర్పులు అమలు చేయడంలేదన్న అనుమానాలూ వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులున్న అంశాన్ని పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉన్నారా అంటూ నిలదీసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇలాంటి అధికారుల తీరు న్యాయవ్యవస్థను హేళన చేయడమేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని కేసుల విచారణ సందర్భంగా కోర్టులను పక్కదారి పట్టించేలా తప్పుడు సమాచారం అందించిన సంఘటనల్లో సుమోటో కోర్టు ధిక్కరణగా తీసుకున్న ఘటనలెన్నో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ నేతలు ఏపీలో కోడిపందేల్లో పాల్గొన్న సంఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాలు చేసేవారే వాటిని ఉల్లంఘించడంపై అసహనం వ్యక్తం చేసింది. |
క్రిమినల్ కోర్టు ధిక్కరణలు తక్కువే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రచురణలు చేయడం, కోర్టులను దూషించడం, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించే సంఘటనలపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కోర్టుల్లో న్యాయమూర్తులపై న్యాయవాదులు చేసే ఆరోపణలు, విమర్శలపై కోర్టులు తీవ్రంగా స్పందించాయి. కోర్టు విధులకు ఆటంకం కలిగించడం, న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో జోక్యం వంటివన్నీ క్రిమినల్ కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయి. పరిధి దాటి వ్యవహరించిన హైకోర్టు న్యాయమూర్తి సైతం కోర్టు ధిక్కరణ కింద శిక్ష అనుభవించిన అరుదైన సంఘటన కూడా మన న్యాయచరిత్రలో చోటుచేసుకుంది. అయితే తీర్పుల్లోని లోపాలపై నిష్పక్షపాతంగా, సదుద్దేశంతో విమర్శించవచ్చు. |
ఏటికేడు పెరుగుతున్న కేసులు కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడం, ఉల్లంఘించడం (సివిల్ కోర్టు ధిక్కరణ) కింద దాఖలవుతున్న ధిక్కరణ కేసులు ఏటికేడు పెరుగుతూ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఏడాదికి సగటున రెండు వేలకు పైగా ఈ తరహా పిటిషన్లు దాఖలవుతున్నాయి. 2010లో 1927 పిటిషన్లు దాఖలుకాగా ఈ ఏడాది అక్టోబరునాటికే 2795కు చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టుల్లోనూ 2017 జూన్ 30నాటికి 568 క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసులు, 96,310 సివిల్ కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఈ ఏడాది ఏప్రిల్‌నాటికి 683 సివిల్, 15 క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. |
కఠిన శిక్షలు లేనందువల్లేనా? కోర్టు ధిక్కరణకు పాల్పడినవారికి కఠిన శిక్షలు విధించే అవకాశం లేకపోవడమూ ఉత్తర్వుల అమలులో జాప్యానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గరిష్ఠంగా ఆరు నెలల జైలు, జరిమానా మాత్రమే కోర్టు ధిక్కరణ చట్టం కింద శిక్ష విధించవచ్చు. శిక్షలు పడినప్పటికీ వాటిపై అప్పీళ్లు దాఖలు చేస్తూ చివరికి జరిమానా, లేదంటే అదీ లేకుండా బయటపడుతున్న సంఘటనలున్నాయి. శిక్ష పడేముందు తీర్పులను అమలు చేస్తూ ‘మన్నింపు’ కోరడంతో తప్పించుకుంటున్నారు. |
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..