close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాగర గర్భంలో గరళం   

పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 
ప్రక్షాళనలో డచ్‌ యువకుని దార్శనికత

సాగర గర్భంలో గరళం 
 
 

ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. వాడి పారేసిన చిన్నా చితకా వస్తువులన్నీ వాటి గర్భంలో కొండ గుట్టలుగా పేరుకుపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్ర జీవుల ఉనికిని ఇవి దెబ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్‌ నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల జలచరాలకు ఇబ్బంది కలుగుతోంది. అవి పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. ప్లాస్టిక్కి ఆహారానికి మధ్య తేడాను పసిగట్టే సామర్థ్యం వాటికి లేక వ్యర్థాన్నంతా మింగుతున్నాయి. అదంతా వాటి పొట్టను ఆక్రమించేస్తోంది. దీంతో అవి ఆహారాన్ని స్వీకరించలేక పోతున్నాయి. సముద్ర పర్యావరణానికి ముప్పుగా కూడా మారిన  ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. డచ్‌ యువకుడు బొయాన్‌ శ్లాట్‌ (24) ఈ దిశగా చేస్తున్న కృషి స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. 
  
 

సాగర గర్భంలో గరళం 
 

సాంకేతికత అనేది మార్పునకు దోహదం చేసే అద్భుతమైన వనరు. మానవ సామర్ధ్యాన్ని ఇది ద్విగుణీకృతం చేస్తుంది. 
పసిఫిక్‌ మహాసముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను  తొలగించే పనికి పూనుకున్నాం. రాబోయే రెండు మూడేళ్లలో 60 వరకూ పరికరాలను అమర్చటం ద్వారా సగం పని పూర్తవుతుంది. 
2040 నాటికి 90 శాతం పూర్తిచేయాలనేది మా లక్ష్యం.

- బొయాన్‌ శ్లాట్‌

విశిష్ట పరిశోధకుడు శ్లాట్‌

సాగర గర్భంలో గరళం 
 

నెదర్లాండ్స్‌కు చెందిన శ్లాట్‌ బాల్యం నుంచి ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులు  రూపొందించటంపై ఆసక్తి చూపేవాడు. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదువును మధ్యలోనే వదిలేశాడు.. 
14 ఏళ్ల వయసులో 213 వాటర్‌ రాకెట్లను ఒకేసారి ప్రయోగించి గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు. 
గ్రీసు జలాల్లో ఈత కొడుతూ  అక్కడ చేపల కంటే ప్లాస్టిక్‌ ఎక్కువ ఉన్న విషయాన్ని గ్రహించాడు. సముద్రంలో ప్లాస్టిక్‌ కాలుష్యంపై తొలిసారిగా అతని దృష్టి పడింది. కొన్ని వ్యర్థాలను సేకరించి పరిశోధనకు సిద్ధమయ్యాడు 
ఈ ప్రక్రియ ఎలా చేపట్టాలో వివరిస్తూ 2012లో ఒక ప్రదర్శన ద్వారా  బాహ్య ప్రపంచానికి  తెలిపాడు. 
ఆ మరుసటి ఏడాది ‘ఓషన్‌ క్లీనప్‌’ సంస్థకు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం దీనికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. 
160 దేశాలకు చెందిన 38వేల మంది శ్లాట్‌ పిలుపునకు స్పందించారు. దాదాపు 2.2 మిలియన్‌ డాలర్ల నిధిని క్రౌడ్‌ఫండింగ్‌ ద్వారా సేకరించాడు. 
యూరప్‌, సిలికాన్‌ వ్యాలీలో పారిశ్రామికవేత్తలు కూడా సహకరించటంతో దాదాపు 30 మిలియన్‌ డాలర్ల మొత్తం పోగయ్యింది. 
ప్రణాళికల్లో మార్పులు చేర్పుల అనంతరం చివరికి ఒక బ్లూప్రింట్‌ను రూపొందించాడు. 
గత ఐదేళ్లుగా శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్‌ బృందాలు శ్లాట్‌ ప్రణాళిక అమలు సాధ్యాసాధ్యాలపైన చర్చిస్తున్నాయి. 
ప్రపంచంలో ఐదు మహాసముద్రాల్లో అతి పెద్దదయిన  పసిఫిక్‌ మహాసముద్రంలో  ప్లాస్టిక్‌ వ్యర్థాల (గార్బేజి ప్యాచ్‌)ను అతి తక్కువ వ్యయంతో  ప్రక్షాళన చేయవచ్చని ప్రకటించాడు. ఈ కార్యక్రమం ఈ మధ్యనే ప్రారంభమైంది. 
శ్లాట్‌ కృషికి  గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ‘ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డుతో పాటు పలు పేరొందిన అవార్డులు దక్కాయి. ఈ ఏడాది యూరోన్యూస్‌ అవార్డు, యూరోపియన్‌ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్‌జాబితాలోనూ అతని పేరు చోటుచేసుకుంది.

ప్లాస్టిక్‌ నిర్మూలన ఇలా..

రెండువేల అడుగుల ప్లాస్టిక్‌ పైపులైనును, 10 అడుగుల నైలాన్‌ స్క్రీన్‌ను ఉపయోగించి ఈ ప్రయోగం చేపడతారు. 
గాలి, అలలు, వాటర్‌ కరెంట్స్‌ సాయంతో సముద్రం అట్టడుగున ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను చిలుకుతారు. అనంతరం దాన్ని తేలిగ్గా తొలగించటానికి వీలయిన ప్రదేశంలోకి  మళ్లిస్తారు.

కంటికి కనిపించనంత స్వల్పంగా..

సముద్రంలో ప్లాస్టిక్‌ నిల్వలకు సంబంధించి మొట్టమొదటి కంప్యూటర్‌ చిత్రాలు విడుదలయ్యాయి. 99 శాతం ప్లాస్టిక్‌ కంటికి కనిపించకుండా అడుక్కి పేరుకుపోయి ఉన్న విషయం వెల్లడయ్యింది. 
సముద్రంలో అడుగున 393 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉంటే.. ఉపరితలంపైన కేవలం 246 వేల టన్నుల ప్లాస్టిక్‌ మాత్రమే ఉంది. ఎక్కువ భాగం కిందకు చేరి, సముద్రగర్భంలో పేరుకుపోతోందని న్యూకాజిల్‌ యూనివర్సిటీ వారి అధ్యయనంలో తేలింది. 
సముద్రం పైన తేలుతూ ఉండిపోయిన ప్లాస్టిక్‌ కొన్నాళ్లకి పాచిలా మారిపోయి నష్టం కలగచేస్తుంది. 
ప్లాస్టిక్‌ నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల కూడా జలచరాలకు ఇబ్బంది కలుగుతుంది. అవి పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి.

వాస్తవ చిత్రం

ఏడాదికి ఎనిమిది మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ సముద్రంలోకి  విసిరేస్తున్నారు. ఇందులో 236 వేల టన్నులు  గోరుకంటే స్వల్పమైన ప్లాస్టిక్‌ ముక్కలు (మైక్రోప్లాస్టిక్స్‌). 
నిముషానికొక  ట్రక్కు వంతున ప్లాస్టిక్‌ ముక్కలతో కూడిన చెత్తాచెదారాన్ని సముద్రంలో పోస్తున్నారు.

సముద్రంలో దాదాపు 11కి.మీ అట్టడుగుకి ప్లాస్టిక్‌ చేరి నష్టాలను కలగచేస్తోంది. 
ఇది 2020 నాటికి పది రెట్లు పెరుగుతుందని  అంచనా. 
2050 నాటికి సముద్రంలో ఉండే చేపల బరువు కంటే అధికంగా ప్లాస్టిక్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు గుట్టగా పేరుకుపోయాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో కాలిఫోర్నియా.. హవాయి నడుమ ఉన్న వ్యర్ధాలు అతి పెద్దవి. 1.8 ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ రేణువులు ఇందులో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిమాణం ప్రకారం చెప్పాలంటే ఫ్రాన్స్‌ కంటే మూడు రెట్లు పెద్దదిగా..  43 వేల కార్ల బరువుకి సమానంగా ఉంటుందని  అంచనా.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.