close

ప్ర‌త్యేక క‌థ‌నం

పండక్కి ఊరెళ్లడమెలా?

‘గోదావరి’లో 600 దాటిన వెయిటింగ్‌ లిస్ట్‌
మిగిలిన రైళ్లలోనూ దాటిపోయిన నిరీక్షణ జాబితా పరిమితి
ఒకే ప్రత్యేక రైలుతో చేతులు దులుపుకొన్న రైల్వేశాఖ
విశాఖవైపు వెళ్లే ప్రయాణికుల ఆందోళన
ఆర్టీసీలోనూ సీట్ల కొరత.. ప్రైవేటు బస్సుల్లో ఇష్టారాజ్యంగా ఛార్జీలు
హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య రూ.4 వేల వరకు వసూలు
దక్షిణమధ్య, తూర్పుకోస్తా రైల్వే జోన్ల మధ్య సమన్వయ లోపంతో ప్రయాణికుల కష్టాలు

పండక్కి సొంతూరైన విశాఖపట్నం వెళ్లేందుకు హైదరాబాద్‌లో ప్రైవేటు కొలువులో ఉన్న చంద్రశేఖర్‌ రైలు టికెట్ల కోసం స్టేషన్‌కు వెళ్లాడు. వెయిటింగ్‌లిస్ట్‌ (నిరీక్షణ జాబితా)లో సంఖ్య వందల్లో ఉండటంతో బస్సుల్లో ప్రయత్నించాడు. అక్కడా సీట్లు దొరకలేదు. మళ్లీ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. ఏ రైలుకు ప్రయత్నించినా సమాధానం ‘రిగ్రెట్‌’ (నిరీక్షణ జాబితా పరిమితి దాటిన పరిస్థితి) మాత్రమే. ప్రయాణం ఒకరోజు అటో, ఇటో మార్చుకుందామని చూసినా పండగ మూడు రోజులూ అదే రద్దీ. ఛార్జీల భారాన్నీ భరించేందుకు సిద్ధమై.. ప్రత్యేక రైల్లో చూడమని అడిగాడు. ఓ ప్రత్యేక రైలు ఉన్నా.. అందులోనూ వెయిటింగ్‌ లిస్ట్‌ ఐదొందలు దాటేసింది. ప్రైవేటు బస్సుల్లో వెళదామనుకుంటే.. అడ్డగోలు దోపిడీ. ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.4 వేల ఛార్జీలు.

ఈనాడు - హైదరాబాద్‌

సంక్రాంతి పండక్కి హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల్లో చాలా మందిది దాదాపు ఇదే పరిస్థితి. జనవరి 10 నుంచే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రద్దీ విపరీతంగా ఉండటం.. రైల్వేశాఖ, ఆర్టీసీ సరిపడా బస్సులు సమకూర్చలేని పరిస్థితి ఉండటంతో ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల దోపిడీ మొదలైంది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ఏసీ బస్సుల్లో రూ.3 వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు.

జాడలేని ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, ఆపై ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో సాధారణ రోజుల్లోనే టికెట్లు దొరకడం అంతంతమాత్రం. సంక్రాంతి పండగ సమయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి వరుస సెలవులు ఉండటంతో హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరాంధ్రవాసులు పెద్దసంఖ్యలో పండక్కి సొంతూళ్లకు వెళుతున్నారు. ఇంత రద్దీ ఉన్నప్పుడు గణనీయసంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడపాలి. జనవరి 10 నుంచి 13 వరకు రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ సికింద్రాబాద్‌ నుంచి ఒకేఒక్క ప్రత్యేకరైలును ప్రకటించి రైల్వేశాఖ చేతులు దులుపుకొంది. ‘గతంలో కొన్ని ప్రత్యేక రైళ్లయినా విశాఖపట్నం వరకు నడిపేవారు. ఈసారి ఇంత రద్దీ ఉన్నా ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేయకపోవడం దారుణం’ అని ఓ ప్రయాణికుడు మండిపడ్డారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ద.మ.రైల్వేవర్గాలు చెబుతున్నాయి. కానీ, అవి కాకినాడ, నర్సాపురం వరకే పరిమితమయ్యాయి.

ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ వివక్ష
ఒక జోన్‌ నుంచి బయల్దేరిన రైలు గమ్యస్థానం మరో జోన్‌ పరిధిలో ఉంటే ఆ రైలుకు అక్కడి అధికారుల ఆమోదం కూడా ఉండాలి. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు నడపాలంటే రెండు జోన్ల మధ్య సమన్వయం ఉండాలి. రద్దీని బట్టి అదనపు రైళ్లు నడపాలి. ద.మ.రైల్వే.. ఈస్ట్‌కోస్ట్‌ జోన్ల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగానే ప్రత్యేక రైళ్ల గురించి ఆలోచించకుండా ప్రయాణికుల్ని వ్యయప్రయాసలకు గురిచేస్తున్నారని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు. తొలినుంచీ వాల్తేర్‌ డివిజన్‌ పట్ల నిర్వహణ ఇబ్బందుల వంటి సాంకేతిక కారణాల సాకుతో ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ వివక్ష చూపుతోందని.. విశాఖపట్నం వరకు ఉన్న రైళ్లను భువనేశ్వర్‌ వరకు పొడిగించిందని, ఈసారి కూడా విశాఖ నుంచి ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేయలేదని విమర్శిస్తున్నారు.

చాంతాడంత నిరీక్షణ జాబితా
జన్మభూమి, కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమా, విశాఖ, దురంతో, ఎల్‌టీటీ విశాఖ, విశాఖ గరీబ్‌రథ్‌ సహా అన్ని రైళ్లు 11, 12, 13 తేదీల్లో ‘రిగ్రెట్‌’కు చేరుకున్నాయి. ఒక్క గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. స్లీపర్‌ బోగీలో రిజర్వేషన్‌ కోసం ఇప్పటికే ఆరేడొందల మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. 11న ప్రయాణానికి వెయిటింగ్‌లిస్ట్‌లో ఏకంగా 714 మంది టికెట్లు తీసుకున్నారు. 12, 13న ఇంచుమించు ఇదే పరిస్థితి. 11న ప్రత్యేకరైల్లో (నం.07149) వెయిటింగ్‌ లిస్ట్‌కు అవకాశం ఉన్నా అందులోనూ 586 మంది నిరీక్షణ జాబితా కింద టికెట్లు తీసుకున్నారు.

ఏసీలోనూ 400 వెయిటింగ్‌ లిస్ట్‌
ఏసీ బోగీల్లోనూ వందల్లో నిరీక్షణ  జాబితా ఉండటం రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది. అన్నీ ఏసీ బోగీలే ఉండే గరీభ్‌రథ్‌లో నిరీక్షణ జాబితాలో టికెట్లు తీసుకున్న వారి సంఖ్య ఆరొందలు దాటడంతో 11, 12 తేదీల్లో టికెట్లకోసం ప్రయత్నిస్తే ఆన్‌లైన్లో ‘రిగ్రెట్‌’ చూపుతోంది. 13న 409 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమా, విశాఖ వంటి రైళ్లలోనూ ఏసీత్రీటైర్‌ రిగ్రెట్‌కు చేరింది. గోదావరిలో మూడొందలకుపైగా నిరీక్షణలో ఉన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.