close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటు జాగారం 

రేపే 3,701 పంచాయతీలకు పోలింగ్‌ 
ఆదివారం భారీగా దావత్‌లు ఇస్తున్న అభ్యర్థులు 
అర్ధరాత్రి నగదు, మద్యం పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు

ఓటు జాగారం 

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఓటుకు మూడంకెల నోటు, అవసరమైతే నాలుగు అంకెల నోటైనా ఫరవాలేదు. విజయమే మన లక్ష్యం. పంచాయతీ పదవి దక్కించుకొంటేనే మనకు ప్రతిష్ఠ’ అని పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు భావిస్తున్నారు. తొలివిడత ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉండడంతో ప్రలోభాల ప్రక్రియను వేగవంతం చేశారు. ఓటర్లకు మద్యం, నగదు పంపిణీకి ఆదివారం రాత్రంతా జాగారానికి సిద్ధమవుతున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తామంటూ కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. మరికొన్నిచోట్ల ఆ సొమ్మును కుల, గ్రామ కమిటీలకు సంతర్పణలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలి విడతలో 3,701 పంచాయతీల్లో సోమవారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. 12,202 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 28,976 వార్డుల్లో 70 వేల మంది పోటీలో ఉన్నారు.

పగలు దావత్‌లు.. రాత్రి పంపిణీలు 
తొలి విడత పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు జరగనున్నాయి. దీంతో ఓటర్ల మనసు గెలుచుకోవాలంటే మిగిలింది ఆదివారం ఒక్కటే. అందుకే అభ్యర్థులు దీన్ని దావత్‌లకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. శుభకార్యాల పేరుతో ఖరీదైన విందులు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున మేకలు, పొట్టేళ్లు దావత్‌ల కోసం సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు తీసుకోనివారికి దావత్‌లు ఇచ్చి తమకు సానుకూలత తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, బాల్కొండ, ఆర్మూరు ప్రాంతాల్లో మోతుబరి రైతులు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తుండడంతో వారిని మందు, విందులతో ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మం, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కొన్ని పంచాయతీల్లో ఓటుకు రూ.వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు నాయకులు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆదివారం నాటి వరకు ఉన్న పరిస్థితిని అంచనా వేసి ప్రతికూల ఓటును కూడా తమవైపు తిప్పుకునేందుకు పెద్ద మొత్తంలోనే పంపిణీ చేయడానికి మరికొందరు అభ్యర్థులు వ్యూహం ఖరారు చేసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం సీసాలు, నగదును గ్రామాలకు తరలించి రాత్రికి రాత్రే పంపిణీ చేసేందుకు అనుచరగణాన్ని మోహరించినట్లు సమాచారం.

పెద్దలు మెచ్చినోళ్లే.. 
గ్రామాభివృద్ధికి సంబంధించి ఏ పని చేపట్టాలన్నా అభివృద్ధి కమిటీలదే అంతిమ నిర్ణయం.  ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండటంతో ఈ కమిటీల నిర్ణయాలకు గ్రామాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఈ కమిటీల పెద్దలు చెప్పిందే వేదంగా మారుతోంది. కొన్నిచోట్ల తమ పంచాయతీకి ఎవరు పోటీ చేయాలి, ఎవరికి ఓట్లు వేయాలనేది కూడా ఈ కమిటీలే నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. కుల, గిరిజన సంఘాలు ఎక్కువగా ఉన్న ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో  ఆయా సంఘాల పెద్దల నిర్ణయం పంచాయతీ పోరును ప్రభావితం చేస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.