close

ప్ర‌త్యేక క‌థ‌నం

తెగనరుకుతున్నారు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల్ని హరిస్తున్న ఓ తెగ
సిబ్బంది భయమే పెట్టుబడిగా కొనసాగుతున్న వారి ఆగడాలు
ఒక్కసారి అడవిలోకి ప్రవేశిస్తే అర ఎకరా అడవి ధ్వంసం
వంశపారంపర్య వృత్తిగా కలప అక్రమ రవాణా
అడ్డుకునేందుకు వెనకాడుతున్న అటవీ అధికారులు
ఈనాడు - హైదరాబాద్‌

టేకు చెట్లు నరుకుతున్న ముల్తానీ తెగ వారిని అడ్డుకునేందుకు అటవీశాఖ బీటు అధికారి మంద్యా నాయక్‌ ప్రయత్నించారు. చెట్లు నరుకుతున్న గొడ్డళ్లతోనే వాళ్లు ఆయన్నీ ముక్కలు చేశారు. ఆరేళ్ల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. నెల రోజుల క్రితం వాహెబ్‌ అనే రేంజి అధికారిని తీవ్రంగా కొట్టారు. పెంబి అటవీ రేంజి రాగిదుబ్బనాలలో ఇటీవల అటవీ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రేంజర్‌ శంకర్‌కు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌ అడవులే కేంద్రంగా కలప అక్రమ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముల్తానీల ఆగడాలకు ఇవి కొన్ని తార్కాణాలే. ఆరేడేళ్ల వ్యవధిలో ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో జరిగాయి. అందుకే వీరికి ఎదురెళ్లాలంటేనే అటవీ సిబ్బందికి వణుకు. ఆ భయమే వారికి అభయమైంది. పచ్చటి అడవి కాస్తా కరిమింగిన వెలగపండులా మారుతోంది.

గుంపులుగా వెళ్తారు..గుట్టుగా కొట్టేస్తారు
పాకిస్థాన్‌లోని ముల్తానీ షరీఫ్‌ ప్రాంతానికి చెందిన ఓ తెగ స్వాతంత్య్రానికి పూర్వమే ఇక్కడికి వచ్చి స్థిరపడింది. అందుకే వారికి ముల్తానీలనే పేరొచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా ఎల్లమ్మగూడ, గుండాల, కేశవపట్నం, జోగిపేట గ్రామాల్లో ఆరేడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ,  సిరిచెలిమ రేంజ్‌ల పరిధి అడవుల్లో చెట్లు నరికి అమ్ముకోవడమే వీరి వృత్తి. వీళ్లు చెట్లు నరికే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. చీకటిపడగానే ఒకేసారి గుంపుగా 50 మంది వరకూ అడవిలోకి ప్రవేశిస్తారు. జంతువులు రాకుండా అంతకుముందు నరికిన చెట్ల మొదళ్లకు నిప్పు పెడతారు. ఆ వెలుతురే ఆసరాగా అప్పటికే ఎంచుకున్న చెట్లను గంటల వ్యవధిలోనే నేల కూలుస్తారు. ఒక్కో వ్యక్తి కనీసం మూడు నాలుగు చెట్లు కొట్టాలనే లక్ష్యంతో పనిచేస్తారు. అక్కడికక్కడే కొమ్మలు చెరిగి, దుంగలుగా మార్చి ఎడ్ల బండ్లపై వేసుకొని తిరుగు ప్రయాణమవుతారు. పెద్ద దుంగలుంటే వాటిని ఏకంగా ఎద్దులకే కట్టేస్తారు. ఏదేని ఎద్దు బరువు మోయలేక మొరాయిస్తే గ్రామానికి చేరుకున్న తర్వాత అదే వారికి ఆహారంగా మారుతుంది. వాళ్లు ఒక్కసారి అడవిలోకి వెళ్తే అర ఎకరా అడవి నామరూపాల్లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. ‘‘ఒకప్పుడు వీళ్లు నరికిన దుంగలన్నింటినీ వాహనాలు తిరిగే రహదారి ప్రాంతానికి చేర్చేవారు. అన్నింటినీ పోగేసిన తర్వాత ఆ దారి వెంట వెళ్లే ఖాళీ లారీలను ఆపి, డ్రైవర్లను బంధించి కలపను తమకు కావాల్సిన ప్రాంతానికి తీసుకెళ్లేవారు’’ అని జిన్నారం ప్రాంతంలో పనిచేసిన ఒక విశ్రాంత అటవీశాఖ ఉద్యోగి చెప్పారు. ఇప్పుడు వాళ్లు కలపను తమ గ్రామాల సమీపంలోనే నిల్వచేస్తున్నారని, కడెం నదీ పరీవాహక ప్రాంతంలో పందిమడుగు పరిసరాల్లో ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన వివరించారు. ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల జలపాతం దిగువన బాబ్జీపేట, పీసర ప్రాంతాల మధ్య, జాతీయ రహదారికి లింక్‌రోడ్లు ఉన్నచోట్ల, వాగులు, ఇసుక ప్రాంతాలు, లోయలు, పత్తి చేల మధ్యలోనూ కలపను దాచిపెడుతున్నారని, అదును చూసి కోత మిల్లులకు తరలిస్తుంటారని ఆయన వివరించారు. ‘ఈనాడు’ ప్రతినిధులు ముల్తానీలు నివసిస్తున్న కొన్ని గ్రామాల్లో రహస్యంగా పర్యటించినప్పుడు ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ పెద్దపెద్ద టేకు దుంగలు కనిపించాయి. ఇలా కొట్టుకొచ్చిన కలపను లోడు ఒక్కింటికి రూ.6 లక్షలకు కోత మిల్లులకు అమ్ముతారని సమాచారం.

అనాగరికం..చదువుకు దూరం
ముల్తానీల గ్రామాల్లోకి వెళ్లాలంటే ఎవరికైనా హడలే. కొత్త వ్యక్తులు కనిపిస్తే పొలిమేరల్లోనే నిలబెడతారు. ఎందుకు వచ్చారో ఆరా తీస్తారు. తేడా వస్తే దాడికి తెగబడతారు. ఈ గ్రామాల్లో పరిస్థితి తెలుసుకునేందుకు ‘ఈనాడు’ బృందం పర్యటించింది. గుండాల గ్రామానికి వెళ్లినప్పుడు ఊరి పొలిమేరల్లోనే ఓ వ్యక్తి ‘ఈనాడు’ వాహనాన్ని ఆపేశాడు. గ్రామ శివార్లలోని వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంను చూసేందుకు వచ్చామని చెప్పిన తర్వాతే అతను వెళ్లేందుకు అనుమతించాడు. మిషన్‌ భగీరథ పనుల కోసం వచ్చామని చెప్పాకే మరో గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లభించింది. ‘నాగరికతకు దూరంగా వెనుకబాటుతనానికి దగ్గరగా ఉన్న ఈ ముల్తానీ గ్రామాల్లో పిల్లలకు చదువంటే తెలియదు. ప్రభుత్వం పాఠశాలలు కట్టించినా, ఉపాధ్యాయులను నియమించినా పిల్లలకు చదువు చెప్పించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు’ అనే విషయం ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది.

క్షేత్రస్థాయి లోపాలే కారణమా?
అడవులను కాపాడాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్న అటవీశాఖ  క్షేత్రస్థాయిలో వాస్తవాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవంగా అటవీ రక్షణ విధుల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించేది బీటు స్థాయి సిబ్బందే. తమ పరిధిలోని అడవిలో ఏమూలన ఏ చెట్టు ఉంది? అక్రమార్కులు రావడానికి ప్రవేశమార్గాలు ఎక్కడెక్కడున్నాయి? తదితర వివరాలన్నీ వీరికి కొట్టిన పిండే.  అలాంటి కీలకమైన సిబ్బందిని పొరుగుసేవల ప్రాతిపదికన నియమిస్తున్నారు. వీరి నెల జీతం రూ.8 వేలు.  వీరు విధులు నిర్వహించే ప్రాంతాల్లో చాలాచోట్ల తాగేందుకు మంచినీటి సదుపాయం కూడా లేదు.  అందుకే పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాబట్టుకునేందుకు  వీళ్లు ఒక్కోసారి అక్రమార్కుల్ని చూసీచూడనట్లు  వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 


కఠిన చర్యలు తీసుకుంటున్నాం

కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు శాఖపరంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ముల్తానీలు గతంలో పలుమార్లు అటవీ సిబ్బందిపై దాడులు చేశారు. వారిని ఎదుర్కొనేందుకు, సిబ్బందికి రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పోలీసుశాఖ సహకారం తీసుకుంటున్నాం. పదేపదే కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ కలపకు అడ్డుకట్ట వేస్తున్నాం. కొత్తగా 40కి పైగా పోలీసు, అటవీ ఉమ్మడి చెక్‌పోస్టులు నెలకొల్పాం. గడిచిన నెల రోజుల్లో 554 గ్రామాల్లో, 387 సామిల్లుల్లో తనిఖీలు నిర్వహించాం. 449 కేసులు నమోదు చేశాం. 544 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.

-ప్రశాంత్‌ కుమార్‌ఝా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.