close

ప్ర‌త్యేక క‌థ‌నం

డిజిటల్‌ లావాదేవీలకు ఆర్‌బీఐ రక్ష 

అంబుడ్స్‌మన్‌ వ్యవస్థకు శ్రీకారం 
మానసిక వేదనకు రూ.లక్ష వరకు పరిహారం

దిల్లీ, ముంబయి: డిజిటల్‌ లావాదేవీలకు భరోసా కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగినప్పుడు వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బంది కలిగినా సమస్య వీలైనంత వేగంగా పరిష్కారమయ్యేందుకు ఈ వ్యవస్థ సహకరించనుంది. బ్యాంకులతో పాటు బ్యాంకేతర సంస్థల ద్వారా జరిపే డిజిటల్‌ లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది. జనవరి 31, 2019 నుంచి అమల్లోకి తెస్తూ ఆర్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
ఎందుకీ వ్యవస్థ? 
ఉదాహరణకు ఆన్‌లైన్‌ ద్వారా మీరు కొంత నగదును బదిలీ చేశారనుకుందాం. డబ్బు మీ బ్యాంకు ఖాతా నుంచి కట్‌ అయిపోతుంది. నగదు మాత్రం మీరు బదిలీ చేయాలనుకున్న మరో ఖాతాకు బదిలీ కాదు. ఒకే బ్యాంకు అయితే సంబంధిత బ్రాంచికి వెళ్తే 15రోజుల్లోపు సమస్య పరిష్కారమవుతుంది. అదే వేరే బ్యాంకు అయితే రెండు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కోసారి బాధ్యత మాది కాదంటే, మాది కాదంటూ బ్యాంకులు వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు బ్యాంకులకే పరిమితం కాలేదు. బ్యాంకింగేతర ఆర్థిక కార్పొరేషన్లు(ఎన్‌బీఎఫ్‌సీలు), పేటీఎం, ఫోన్‌పే తదితర వ్యాలెట్లు, ఇ-కామర్స్‌ వెెబ్‌సైట్ల విషయంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిపై వినియోగదారుల నుంచి ఆర్‌బీఐకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గల 21 ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిజిటల్‌ లావాదేవీల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా అంబుడ్స్‌మన్లను ఏర్పాటు చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పనిచేసే జనరల్‌ మేనేజర్‌ లేదా చీఫ్‌ జనరల్‌ మేనేజరు అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తారు. 
అవసరమైతే ఆర్‌బీఐ డిప్క్యూటీ గవర్నరు వద్దకూ.. 
సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అక్కడే సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. 30రోజుల్లో పరిష్కారం కాకపోతే సంబంధిత రాష్ట్ర అంబుడ్స్‌మన్‌ పరిధిని ఆశ్రయించవచ్చు. అక్కడ పరిష్కారం లభించకపోయినా, సంతృప్తి లేకపోయినా ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన డిప్యూటీ గవర్నరు దృష్టికి సమస్యను తీసుకెళ్లవచ్చు. ఇక్కడా పరిష్కారం లభించలేదని భావిస్తే, న్యాయస్థానాన్నీ ఆశ్రయించవచ్చు. 
ఏయే సందర్భాల్లో సంప్రదించవచ్చంటే! 
వాలెట్లు, డెబిట్‌-క్రెడిట్‌ కార్డుల్లో నగదు జమ కాకపోయినా.. 
విఫలమైన, రద్దు అయిన లావాదేవీలకు సంబంధించిన నగదు నిర్దేశిత సమయానికి మీ ఖాతాల్లోకి తిరిగి జమ కాకపోయినా.. 
ఆన్‌లైన్‌ చెల్లింపులు, నగదు బదిలీ సందర్భంగా సర్వర్‌ నుంచి కాలయాపన జరిగి లావాదేవీ విఫలమైనా.. 
వినియోగదారుడి ఖాతా నుంచి నగదు కట్‌ అయి, నిర్దేశిత సమయంలో ఆ నగదు జమ కాకపోయినా.. 
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుడి ఖాతాలో జమ కాకపోయినా.. 
పొరపాటున తెలియని వ్యక్తి ఖాతాలో పడిన నగదు మళ్లీ మీ ఖాతాకు నిర్దేశిత సమయంలోపు జమ కాకపోయినా.. 
ఎలా ఫిర్యాదు చేయాలంటే.. 
అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడానికి ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదు. తెల్లకాగితం ఫిర్యాదును రాసి అంబుడ్స్‌మన్‌కు పోస్ట్‌ చేయవచ్చు. ఈమెయిల్‌, ఫ్యాక్స్‌ కూడా అనుమతిస్తారు. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తుఫారాన్ని నింపినా సరిపోతుంది. మీకు బదులు మీ ప్రతినిధి Å(ఉదాహరణకు స్నేహితుడు, బంధువు) కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతినిధిగా న్యాయవాదిని మాత్రం అనుమతించరు. 
రూ.20 లక్షల వరకు పరిహారం 
డిజిటల్‌ లావాదేవీల సందర్భంగా వినియోగదారుడికి కలిగే ఆర్థికనష్టాన్ని అంబుడ్స్‌మన్‌ ఇప్పిస్తుంది. దీన్ని గరిష్ఠంగా రూ.20 లక్షలకు పరిమితం చేశారు. అంతకుమించితే ఆ మేరకు వినియోగదారుడు నష్టపోయినట్లే. వినియోగదారుడు పడిన మానసిక వేదనకు, కోల్పోయిన విలువైన సమయానికిగాను గరిష్ఠంగా రూ.లక్ష వరకు నష్టపరిహారం లభిస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.