close

ప్ర‌త్యేక క‌థ‌నం

వేగమే ఇక రైల్వే మంత్రం

మరో పది ట్రైన్‌ 18ల తయారీ
దిల్లీ-వారణాసి మధ్య తొలి సేవలు
రెండో దశలో దిల్లీ నుంచి పుణ్యక్షేత్రాలకు
అందుకు అనుగుణంగా రైలు మార్గాలు సిద్ధం
ఈనాడు డిజిటల్‌ - చెన్నై

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో రూపుదిద్దుకున్న ట్రైన్‌ 18 భారతరైల్వేలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇప్పటివరకు వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన శతాబ్ది ని వెనక్కి నెట్టేందుకు దిల్లీ-వారణాసి మధ్య తొలి సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల మనసు దోచిన ట్రైన్‌ 18 సేవలు చెన్నై-హైదరాబాద్‌, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు కూడా రానున్నట్లు తెలిసి ‘ఈనాడు’ ఆరా తీసింది.

మరో పది రైళ్లు...: ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో సేవలను ప్రారంభించనున్న ట్రైన్‌ 18 దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు సృష్టించనుంది. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు, వేగాన్ని చూసిన వారంతా ఈ సేవలు తమ ప్రాంతంలోకూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు. కొంత ఆలస్యమైనా దేశంలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు అందుబాటులోకి రావడం ఖాయమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

రెండో దశలో దిల్లీ నుంచి పుణ్యక్షేత్రాలకు..
‘‘ట్రైన్‌ 18 టెస్ట్‌రన్‌ విజయవంతం కావడంతో భారత రైల్వే ఇక వేగంపై దృష్టిపెట్టనుంది. దిల్లీ వారణాసి మధ్య నడవనున్న ట్రైన్‌ 18 లాంటివే మరో రెండు సెమీ హైస్పీడ్‌ రైళ్లను రెండో దశలో దేశరాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాలకు నడిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో పది ట్రైన్‌ 18 రైళ్ల తయారీని భారతరైల్వే చేపట్టనుంది.

- రాజేష్‌ అగర్వాల్‌, రైల్వేబోర్డు (రోలింగ్‌ స్టాక్‌) సభ్యుడు

వేగానికి అనుగుణంగా...
దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రైన్‌ 18 సేవలను అందించడానికి రైల్వే మంత్రిత్వశాఖ మార్గదర్శకాలిచ్చింది. అందుకనుగుణంగా దేశంలోని పలు ఇతర మార్గాలను గుర్తించాం. ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాలైన వారణాసి-దిల్లీ, చెన్నై-హైదరాబాద్‌, చెన్నై- బెంగళూరు, మంగళూరు, త్రివేండ్రం, మదురై, కోయంబత్తూరు తదితర మార్గాలలో ట్రైన్‌ 18 పరుగులు తీయనుంది. ఈ మార్గాల్లో 180 కిలోమీటర్ల వేగానికి సరిపడే ట్రాక్స్‌ నవీకరణ పనులు నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు 45 నుంచి 55శాతం కలిసొస్తుంది. ప్రస్తుతం చెన్నై నుంచి దిల్లీకి దాదాపు 32 గంటలు పడుతోంది. ట్రైన్‌ 18 సేవలతో ఆ సమయం 16 నుంచి 18 గంటలకు తగ్గిపోతుంది.

- ఆర్‌కే కుల్‌శ్రేష్ఠ, దక్షిణ రైల్వే జీఎం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.