close

ప్ర‌త్యేక క‌థ‌నం

యుద్ధం.. అనర్థం

ఆర్థికంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడం మంచిది
కశ్మీర్‌ యువతలో భారత్‌ పట్ల సానుకూలత పెంచాలి
ఎన్నికల ప్రయోజనాల కోసం సైనిక చర్య శ్రేయస్కరం కాదు
‘ఈనాడు-ఈటీవీ’తో రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు చిత్రపు ఉదయ్‌భాస్కర్‌
చల్లా విజయభాస్కర్‌, ఈనాడు, దిల్లీ

పుల్వామా ఘటన తర్వాత దేశం మొత్తం భావోద్వేగంతో కదిలిపోతోంది. అంతటి ఘాతుకానికి మూలమైన పాకిస్థాన్‌పై ఏదో ఒక చర్య తీసుకోవాలన్న వాదన బలంగా వినపడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌ చిత్రపు ఉదయ్‌ భాస్కర్‌ అంటున్నారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సైనిక చర్యకు దిగడం శ్రేయస్కరం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే భారత్‌, పాకిస్థాన్‌లకు ప్రత్యక్షంగా మద్దతివ్వడానికి ప్రపంచ దేశాలేవీ ముందుకురావని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌ చర్యల వల్ల పాకిస్థాన్‌ సైన్యానికి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యవస్థలకు దెబ్బతగలాలి తప్పితే ఆ దేశ సామాన్య ప్రజలకు కాదంటున్న ఆయనతో.. ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక ముఖాముఖి..

రాజకీయ ప్రయోజనాల కోసం ముందుచూపులేకుండా సైనిక చర్య తీసుకోవడం మంచిది కాదని రక్షణ రంగ, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌ చిత్రపు ఉదయ్‌ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ‘మనం ఏ చర్య తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. వచ్చే మే చివరికల్లా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పటికి ఇదే ప్రధానమంత్రి ఉంటారా? లేదా? అన్నది భారతీయ ఓటరు నిర్ణయిస్తారు. ఇప్పుడీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం... రాబోయే ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి..’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

పుల్వామా ఘటన తర్వాత.. బలంగా స్పందించేందుకు ఇప్పుడు మన  ముందున్న అవకాశాలేంటి?
ప్రధాని ఎక్కడికెళ్లినా తాము గట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ఎన్నికల తరుణంలో  కొంతమేర రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తారు. అందువల్ల భారత్‌ ఏదో ఒకటి చేస్తుందన్న భావన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. రెండు దేశాల మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి,   మన ముందు నాలుగైదు ప్రత్యామ్నాయాలున్నాయి. అందులో మొదటిది దౌత్యం. రెండోది రాజకీయం. మూడోది ఆర్థికం. నాలుగోది సైనికం. దేన్ని ఎప్పుడు ఎంచుకోవాలన్న దానిపై బాగా ఆలోచించుకొని ముందుకెళ్లాలి. ఇందులో కొన్ని నిర్ణయాలను మనం సొంతంగా తీసుకోవచ్చు. మరికొన్నింటిని మన చుట్టుపక్కలున్న దేశాలు... లేదంటే ప్రపంచంలోని ప్రధాన దేశాల మద్దతుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా భారత్‌ తొలి చర్యగా పాకిస్థాన్‌కు ఎంఎఫ్‌ఎన్‌ హోదా ఉపసంహరించింది. ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య వాణిజ్యం పెద్దగా లేదు కాబట్టి దీన్ని ఓ సంకేతచర్యగా భావించొచ్చు. ప్రధాని మోదీ రెండు మూడుసార్లు పాకిస్థాన్‌ను ఏకాకిని చేస్తామని ప్రకటించారు. ఇది సాకారం కావాలంటే సార్క్‌ దేశాలు తప్పనిసరిగా భారత్‌కు మద్దతు పలకాలి. ఇంతవరకూ అలాంటి సంకేతం ఏమీ మనకు రాలేదు. చైనా, సౌదీ అరేబియాలు కూడా గత వారం రోజుల్లో పాకిస్థాన్‌తో చాలా సాన్నిహిత్యాన్ని ప్రదర్శించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా మనం చాలా ప్రయత్నించిన తర్వాత చైనా పుల్వామా విషాద ఘటనను, జైష్‌ ఎ మహ్మద్‌ను ఉగ్రవాద బృందంగా ప్రతిపాదించడానికి అంగీకరించింది. ఒక విషయంలో మాత్రం మనకు అనుకూల పరిస్థితి ఉంది. విశ్వ ఆర్థిక వేదికలో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన కూడా భారత్‌కు మద్దతునిచ్చేలా ఉంది. వీటిని సంకేతంగా చూపి ఆర్థిక మార్కెట్‌లో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయగలిగితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఆర్థిక చర్యల కార్యదళంలోనూ పాకిస్థాన్‌ను గ్రే జోన్‌లో పెట్టారు. ఇలాంటి ఒత్తిళ్లను మనం పెంచి వచ్చే నాలుగు వారాల్లో పాకిస్థాన్‌ జైష్‌ ఎ మహ్మద్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే ఆ దేశాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చేయగలిగితే మనం గట్టి సందేశాన్ని పంపిన వాళ్లమవుతాం. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ చాలా ఆందోళనకరంగా ఉంది. చైనా కూడా వాళ్లకు సాఫ్ట్‌లోన్‌ ఇస్తుందనుకోలేం. వాళ్లు కేవలం బెల్ట్‌రోడ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం మాత్రమే చేస్తారు. వారు ఏదీ ఉచితంగా ఇవ్వరని చైనాతో సంబంధాలు నెరిపే దేశాలకు తెలుసు. మరో వైపు భారత్‌ తన ఇబ్బందులను ప్రపంచానికి మరింత బాగా చెప్పుకోవాలి. పాకిస్థాన్‌ సైన్యం, ఉగ్రవాదుల నుంచి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి స్పష్టంగా చెప్పాలి. వాస్తవంగా పాకిస్థాన్‌లోని ప్రజలు కూడా ఇప్పుడు మనకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పుల్వామా దాడిని ఖండించారు. పాకిస్థాన్‌తో పాటు, పశ్చిమాసియా ప్రాంతంలో భారత్‌ సాఫ్ట్‌ పవర్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. మన శక్తికి ఉన్న విస్తృతిని ఒక్కోసారి మనమే ఊహించుకోలేం. దాన్ని మనం సమర్థంగా ఉపయోగించుకోవాలి.
 

పుల్వామాలో ఉగ్రవాద దాడికి పాల్పడింది కశ్మీరీ యువకుడే. అతనికి ఏదో నూరిపోసి ఉగ్రవాదంలోకి తీసుకున్నారు. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర శక్తులు ఉండాలి. మిలటరీ, బుల్లెట్‌, పెల్లెట్‌ అన్నది ఒక ప్రత్యామ్నాయం. అలాకాకుండా యువకులు తుపాకీ పట్టుకొని ఉగ్రవాద పంథాలో నడవకుండా మనం ప్రత్యామ్నాయ దారులు చూపాలి.

భారత్‌లోని దాదాపు 17 కోట్ల మంది ముస్లింలలో 99% పైగా చాలా మంచి భారతీయ పౌరులే. వారంతా తమ మతాన్ని అనుసరిస్తూ పోతున్నారే తప్ప దేశ  భద్రతకు ముప్పువాటిల్లే పనులేమీ చేయడం లేదు. షెహనాయ్‌ విద్వాంసుడు  భారతరత్న బిస్మిల్లాఖాన్‌ ప్రతి రోజూ ఉదయం వారణాశిలో విశ్వనాథునికి సంగీత సేవ చేసే వారు. ఇలాంటి ఉదాహరణలు దేశం నలుమూలలా ఉన్నాయి. పాకిస్థాన్‌లో కొందరు యువకులను చిన్నప్పటి నుంచే తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి పరిస్థితి భారత్‌లో లేదని పిల్లలకు తల్లులు, సోదరీమణులు చెప్పాలి. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో చిన్న చిన్న పిల్లలు తుపాకులు పట్టడం నేను అక్కడికెళ్లినప్పుడు చూశాను. అక్కడ దురదృష్టవశాత్తు చాలా హింసాత్మక, వాతావరణాన్ని నెలకొల్పారు. తొమ్మిదేళ్ల పిల్లవాడు అక్కడ తుపాకి పట్టుకొని ఏం చేస్తావంటే తన తండ్రిని చంపేస్తానని చెప్పడం నేను డాక్యుమెంటరీల్లో చూశాను. చిన్నపిల్లల మస్తిష్కాలను విషతుల్యం చేస్తున్న పరిస్థితులను అడ్డుకోవాలంటే బుల్లెట్‌, పెల్లెట్‌తో సాధ్యం కాదు. అలాంటి వారికి భరోసా కల్పించే విధంగా దీర్ఘకాల వ్యూహం అమలు చేయాలి. దీనికి చాణక్య వ్యూహమే మందు. ఆయనకు కాల్లో ముల్లు గుచ్చుకున్నప్పుడు.. కోపం తెచ్చుకోకుండా దాన్ని తీసేసి... ముళ్ల పొదల వేర్లపై చక్కెర, పాలు పోశారు. ఫలితంగా చీమలు పట్టి ముళ్లపొదలు నాశనమయ్యాయి.

నదీ జలాలు స్తంభింపజేస్తే..
దేశంలో కశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు దేశంలో అంతర్గతంగా స్నేహసంబంధాలు దెబ్బతినాలనే కోరుకుంటారు. హిందూ, ముస్లింల మధ్య అగాధం ఏర్పడాలన్నది వారి ప్రధాన ఉద్దేశం. దాని వల్ల ఇప్పుడు కశ్మీరీలను నమ్మకూడదన్న భావన ప్రబలుతోంది. తర్వాత ముస్లింలను నమ్మకూడదన్న భావన వస్తుంది. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణ సృష్టి మన అంతర్గత భద్రతకు అంత్యంత ప్రమాదకరం. ఇటీవల ఓ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. వాటిని ఒకరిద్దరు ఖండించడం మినహా ప్రధానమంత్రి కూడా స్పందించలేదు. ఇలాంటి సందర్భాల్లో  రాష్ట్రపతి స్పందించాలి. మనకు అలాంటిదేమీ కనిపించలేదు. అది చాలా విచారకరం.

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న నదీజలాల ఒప్పందాన్ని పునఃసమీక్ష చేసుకొని, నీరు పాకిస్థాన్‌కు వెళ్లకుండా చేస్తే ఎలా ఉంటుంది?
తూర్పునదుల నీటిని మనం పూర్తిగా వాడుకొనే అవకాశం ఉన్నప్పటికీ మౌలికవసతుల కొరత వల్ల ఆ పని చేయలేకపోతున్నాం. ఇక ముందు ఆ పని చేస్తామని గడ్కరీ చెప్పారు. అందు కోసం జలాశయాలు నిర్మించాల్సి వస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని మనం రద్దు చేసినా, మూడు నదుల నీటిని నిలిపేసేలా నిర్మాణాలు చేపడితే అంతర్జాతీయ సమాజానికి అది వ్యతిరేకంగా కనిపించే అవకాశం ఉంటుంది. సింధు నదిది అంతర్జాతీయ ఒప్పందం. ప్రపంచ బ్యాంకు ద్వారా అది కుదిరింది. అందులో అమెరికా, బ్రిటన్‌లకు భాగస్వామి పాత్ర ఉంది. అందువల్ల మనం ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తే భవిష్యత్తులో చైనా, మరి కొన్ని దేశాలు కూడా అలాంటి చర్యకే పాల్పడతాయి. అందుకు మనం సిద్ధమై ఉండాలి. నదీ జలాల ఒప్పందానికి ఒక పవిత్రత ఉంది. అందువల్ల అది చాలా తీవ్రమైన అంశం. ప్రతి ఒప్పందం ద్వారా కొన్ని బాధ్యతలు వస్తాయి. వాటిని నెరవేర్చకపోతే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన లక్ష్యం పాకిస్థాన్‌ పౌరుడా? లేదంటే ఆ దేశ సైన్యమా? జైష్‌ ఎ మహ్మద్‌, లష్కరేతోయిబా? అన్నది తొలుత ఆలోచించుకోవాలి. మన చర్య ద్వారా పాకిస్థాన్‌లోని ముఖ్య వ్యవస్థలకు దెబ్బతగలడమా? లేదంటే సాధారణ పౌరుడికి ఇబ్బంది కలగడమా? అన్నది ప్రశ్నించుకోవాలి. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి.

ఇమ్రాన్‌కు జవాబు ఎలా..
భారత్‌ దాడి చేస్తే ప్రతి దాడి తథ్యమంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి?
భారత్‌ దాడికి దిగితే తమ వైపు నుంచి ప్రతి దాడి ఉంటుందని పాకిస్థాన్‌ ప్రధాని, ఆ దేశ సైన్యాధ్యక్షుడు చెప్పారు. పరిస్థితి సర్జికల్‌ స్ట్రైక్స్‌లా ఉండదని చెబుతున్నారు. భారత్‌ ఏదో ఒక చర్య తప్పకుండా తీసుకోవాలన్న భావన మన దేశంలోనూ వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుచూపు లేకుండా ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. దేశంలో ఆగ్రహావేశాలు, నకారాత్మక వాతావరణం ఉందన్న దాన్ని బట్టి నిర్ణయాలకు వెళ్లకూడదు. ఎన్నికల ప్రయోజనాల కోసం మనం యుద్ధానికి మొగ్గు చూపకూడదు. దాని వల్ల తొలుత మూల్యం చెల్లించుకొనేది తొలివరుసలో ఉన్న సైనికుడే. ఆ తర్వాత పౌరుల వంతు వస్తుంది. జైష్‌ ఎ మహ్మద్‌, మసూద్‌ అజర్‌లు మాత్రం తమ పని తాము చేసుకుంటూనే ఉంటారు. అందువల్ల ఎవరి కోసం, ఎవరిపై యుద్ధం చేయాలన్న లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత జటిలంగా ఎందుకు మారుతోంది?
బుర్హాన్‌వాని ఎన్‌కౌంటర్‌ సంఘటన తర్వాత శ్రీనగర్‌ లోయలో ఉన్న యువతలో భారత్‌ వ్యతిరేక భావనలు ఎక్కువయ్యాయి.  దాంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా చాలా దిగజారాయి. పీడీపీ-భాజపా కూటమి సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుందని అందరూ అనుకున్నప్పటికీ చివరకు ప్రతికూల ప్రభావం పడింది. ఆర్మీ సరిహద్దుల వెంబడి పరిస్థితులను చూసుకుంటుంది. అంతర్గత పరిస్థితులు మెరుగుపరచాలంటే మనం మూలాలకు వెళ్లాల్సిందే. మంచి పోలీసింగ్‌, ఉత్తమ రాజకీయాలు, మంచి విద్య, ఉద్యోగాలు తీసుకురావాలి. ఇది వరకు వాజ్‌పేయి తీసుకొచ్చిన కశ్మీరియత్‌... ఇన్సానియత్‌ విధానం చాలా మంచి ప్రభావం చూపింది. దాని తర్వాత పరిస్థితులు దిగజారుతూ వస్తున్నాయి. మనం ఆజ్యం పోయడానికి వీలుకల్పించేట్లయితే ఎవరైనా చలికాచుకొనే ప్రయత్నం చేస్తారు. దీని నివారించాలంటే  సకారాత్మక రాజకీయాలు రావాలి.

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న విషయం సుస్పష్టం. దీన్ని ప్రపంచం ముందుపెట్టి పాక్‌ను ఏకాకిని చేయలేమా?
మనం దౌత్య, రాజకీయపరమైన పంథాలో వెళ్లాలి. 9/11 తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్‌ 2001 అక్టోబర్‌ 1న యుద్ధం ప్రకటించి అఫ్గానిస్థాన్‌పై విమానాల ద్వారా బాంబులు కురిపించారు. గెలుపులేని ఆ యుద్ధంలో మూడు నాలుగు వేల మంది అమెరికా సైనికులు మరణించారు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌పై అమెరికా చేసిన యుద్ధం ఖర్చు 900 బిలియన్‌ డాలర్లు. అన్ని ప్రాణాలు, అంత డబ్బు ఖర్చు చేసిన తర్వాత వారు సైనికపరంగా, రాజకీయంగా లక్ష్యం సాధించలేకపోయారు. అందువల్ల సైనిక చర్య ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. కొన్నిసార్లు అది వాంఛనీయం కూడా కాదు. మన పంథా మార్చుకోవాలి.

మనం సైనిక చర్యకు దిగితే ప్రపంచ దేశాలు ఎంత వరకు భారత్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది?
ఇప్పుడు ఇరుదేశాల మధ్య సైనిక స్పర్థలు తలెత్తితే భారత్‌కు ప్రత్యక్షంగా సైనిక మద్దతు పలికే దేశాలు లేవు. పాకిస్థాన్‌కూ అదే పరిస్థితి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధ సమయంలోనూ ఏ దేశమూ పాకిస్థాన్‌కు సైనిక పరంగా మద్దతివ్వలేదు. కొన్ని పరికరాలు సరఫరా చేశాయన్నది మాత్రమే నిజం. ఇలాంటి వాతావరణం మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతుంది. అందువల్ల తొందరపాటుతోనో, ఆగ్రహంతోనో సైనిక చర్యకు దిగకూడదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.