close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటరు తీర్పే మిగిలింది

16 స్థానాలు గెలిచేందుకు తెరాస వ్యూహం
ఆరింటిలోనైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌
రెండు స్థానాల్లో గెలుపొందాలని భాజపా
ప్రధాన పార్టీల కీలక నేతలకు అగ్నిపరీక్ష
ఈనాడు - హైదరాబాద్‌

శాసనసభ ఎన్నికల ప్రచార ఘట్టాన్ని దాటిన రాజకీయ పార్టీలు మలి ఘట్టమైన లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఓటరు ముందు నిలిచాయి. శాసనసభ ఎన్నికల తర్వాత 4నెలలకు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు పార్టీలకు, నేతలకు సవాల్‌గా మారాయి. శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న తెరాస ఈసారి హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం మినహా అన్ని స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌ ఆటుపోట్లను ఎదుర్కొంటూ సత్తా చాటాలని తీవ్రంగా శ్రమించింది. శాసనసభ ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైన భాజపా లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానం కోసం సర్వశక్తులు ఒడ్డింది. ఉమ్మడిగా బరిలో నిలిచిన వామపక్షాలు, 2 స్థానాల్లో నిలిచిన తెజస, 3 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హైదరాబాద్‌లో మరోమారు మజ్లిస్‌ పాగా వేసేందుకు సిద్ధమైంది. ఆధిపత్యం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ఓటరు ముందు నిలిచాయి.

కేంద్రంలో క్రియాశీలక పాత్ర లక్ష్యంగా తెరాస
గత లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాలు దక్కించుకున్న తెరాస ఈసారి ఆరంభం నుంచి కూడా 16 స్థానాలపై గురిపెట్టింది. 50 శాతానికి పైగా ఓట్లను సాధించాలని ప్రణాళికలు రచించింది. కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీలను కాకుండా కొత్తవారిని బరిలో దింపిన తెరాస, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెదేపాల నుంచి అభ్యర్థులుగా బరిలో దిగిన వెంకటేశ్‌ నేత, నామా నాగేశ్వరరావులను తమ పార్టీ తరఫున పోటీకి నిలిపింది.

జాతీయ పార్టీలే లక్ష్యంగా ప్రచారం
సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లు విస్తృత ప్రచారంతో పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారు. భాజపా, కాంగ్రెస్‌ లక్ష్యంగా ప్రచార అస్త్రాలను సంధించిన తెరాస 16 సీట్లు సాధించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, కేంద్రం నుంచి అవసరమైన నిధులు రాబట్టేందుకు సాధ్యమవుతుందని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది. శాసనసభ ఎన్నికల్లో 119కి 88 స్థానాల్లో గెలిచిన తెరాస నాలుగు నెలల్లోనే స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో బలాన్ని 100 దాటించింది. ఇంకా మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, సునీతాలక్ష్మారెడ్డి, హుస్నాబాద్‌, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు, గజ్వేల్‌లో సీనియర్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఇలా పలువురు తెరాసలో చేరారు. వీరి రాకతో తమకు ఓట్లు పెరగవచ్చని భావిస్తోంది. ఎన్నికల్లో బాగా పనిచేస్తే తగిన ఫలితం ఉంటుందని కేసీఆర్‌, కేటీఆర్‌ల సూచనల మేరకు ఆ మేరకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలలో విభేదాల కారణంగా ఖమ్మం తదితర చోట్ల పార్టీ ఓడిపోయింది. ఈసారి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీపరంగా సమస్యలు లేకుండా వ్యవహరించింది.

బలమైన అభ్యర్థులతో ఫలితాలపై కాంగ్రెస్‌ ఆశ
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ఆ ఎన్నికలతో నిమిత్తం లేకుండా కనీసం ప్రస్తుతం ఆరు స్థానాలనైనా దక్కించుకోవాలని లోక్‌సభ బరిలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్లను సాధించడం ద్వారా తెరాసకు అడ్డుకట్ట వేయాలని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శాసనసభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సర్దుకుంటూ అభ్యర్థులను కొంత ముందుగా ప్రకటించడం సహా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. బలమైన అభ్యర్థులను బరిలో దింపడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవచ్చని భావించిన కాంగ్రెస్‌ కీలక నేతలను అభ్యర్థులుగా ప్రకటించింది. రెండు, మూడు స్థానాలు మినహా అన్నిచోట్లా పార్టీ అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం శాసనసభ ఎన్నికల తరహాలో రాష్ట్ర కాంగ్రెస్‌పై దృష్టి సారించకున్నా అవసరమైన పరోక్ష తోడ్పాటును అందించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొనడం మినహా అంతా అభ్యర్థులు, రాష్ట్ర నేతలు, స్థానిక నేతల ప్రచారమే సాగింది. తెరాస వైఫల్యాలు అంటూ విభజన హామీలను సాధించలేకపోయారని ప్రముఖంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. భాజపా, తెరాసలే లక్ష్యంగా ముందుకు సాగింది. టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ స్ధానం నుంచి బరిలో దిగగా ఆ పార్టీ ముఖ్యనేతలే అభ్యర్థులుగా మారారు. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో పాటు ముఖ్యనేతలు దూరం కావడం పలు అంశాలపై ప్రభావం పడింది. 2014 ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్‌ ఈసారి నల్గొండ, ఖమ్మం, భువనగిరి, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబాబాద్‌లపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెరాస నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సిటింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సహా మరికొందరు ముఖ్యనేతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి. ఒంటరిగా బరిలో నిలిచిన కాంగ్రెస్‌ శాసనసభ ఎన్నికల మిత్రపక్షాల మద్దతుపై నమ్మకంతో ఉంది.

ఒంటరిగా వికసించాలని కమలం
శాసనసభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు సాధించాలని భాజపా ఈ ఎన్నికల్లో సర్వశక్తులను ఒడ్డింది. పార్టీ అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రాధాన్యం ఇచ్చారు. అభివృద్ధి, దేశభద్రత సహా రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలను ప్రచారాంశాలుగా భాజపా ముందుకెళ్లింది. 2014 ఎన్నికల్లో తెదేపాతో కలసి బరిలో దిగిన భాజపా సికింద్రాబాద్‌ స్థానాన్ని దక్కించుకుంది. బండారు దత్తాత్రేయ స్థానంలో పార్టీ కిషన్‌రెడ్డిని సికింద్రాబాద్‌ బరిలో దించింది. ఈసారి సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల కార్యాచరణను నిర్వహించింది. ఇక ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు భాజపాతో పాటు సంఘ్‌ పరివార్‌ శ్రేణులు సోమ, మంగళవారాల్లో దాదాపు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వచ్చాయి. గురువారం జరిగే పోలింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి బూత్‌ కమిటీల వరకు రాష్ట్ర పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. భాజపాకు రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల సభ్యత్వం ఉంది. పోలింగ్‌ మొదలైన మొదటి గంటలోనే పార్టీలో కీలక కార్యకర్తలు వెళ్లి ఓటు వేసి రావాలని.. తర్వాత పార్టీ సభ్యత్వమున్న వారిని.. సానుభూతిపరులు, తటస్థులను పోలింగ్‌ బూత్‌లకు రప్పించాలని భాజపా బూత్‌ కమిటీలకు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భాజపాకు దాదాపు 32 వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలు ఉన్నాయి. వారంతా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, కాలనీ అసోసియేషన్‌ ప్రతినిధులతో.. విద్యావంతులు, ఉద్యోగులతో మాట్లాడుతూ ఓటింగ్‌లో పాల్గొనాలని ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్‌ ద్వారా కోరుతున్నారు.

ఉమ్మడిగా బరిలో నిలిచిన వామపక్షాలు
శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయిన వామపక్షాలు ఉమ్మడిగా ఈసారి ఓటరు ముందుకు వచ్చాయి. పట్టున్న స్థానాల్లో బలం చాటుకోవాలని అవి ప్రచారం చేశాయి. నల్గొండ, ఖమ్మం లోక్‌సభ స్థానాలో సీపీఎం, భువనగిరి, మహబూబాబాద్‌లలో సీపీఎం బరిలో నిలిచి కలిసికట్టుగా ప్రచారం చేసి ఓటరు ముందు నిలిచాయి. శాసనసభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలను చవిచూసిన తెలంగాణ జనసమితి మహబూబాబాద్‌, ఖమ్మంలలో బరిలో ఉండగా జనసేన మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.