close

ప్ర‌త్యేక క‌థ‌నం

పేదల స్వర్గ ధామం

దేశంలోనే అతిపెద్ద మోడల్‌ కాలనీ కొల్లూరు
ఒకేచోట 15,660 ఇళ్ల నిర్మాణం
పదకొండు అంతస్తుల అపార్టుమెంట్లు
రూ.1354 కోట్ల వ్యయంతో ఏర్పాటు
మురుగునీరు శుద్ధి, భూగర్భ డ్రైనేజి
సకల సౌకర్యాలు ఏర్పాటుకు సన్నద్ధం
భవిష్యత్తులో మున్సిపాలిటీగా అవతరణ
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

దేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మితమవుతున్న అతి పెద్ద గృహ సముదాయం.. రాజధాని సమీపంలోని కొల్లూరులో రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ 15,660 గృహాలను నిర్మిస్తున్నారు. అన్ని కుటుంబాల్లో ఉండే జనాభాను బట్టి చూస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పురపాలక సంఘంగా మార్చవచ్చని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా పేదప్రజల కోసం నిర్మితమయ్యే గృహ నిర్మాణ కాలనీల్లో నాణ్యతలేమి, అసౌకర్యాలు కొలువై ఉంటాయి. దీంతో అక్కడ ఉండటానికే లబ్ధిదారులు ఇష్టపడటం లేదు. దీనికి భిన్నంగా కొల్లూరు వద్ద ఉన్నత ప్రమాణాలతో అతిపెద్ద టౌన్‌షిప్‌ తయారవుతోంది. ఇక్కడి పేదల కోసం పలు సౌకర్యాలను కల్పిస్తున్నారు. అంతర్గతంగా సిమెంట్‌ రోడ్లు, మురుగునీటి శుద్ధికేంద్రం, ప్రత్యేక బస్సు సౌకర్యం, సౌర విద్యుత్తును ఇక్కడే ఉత్పత్తి చేయడానికి అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

124 ఎకరాల్లో కొల్లూరు టౌన్‌షిప్‌
హైదరాబాద్‌ మహానగరంలో దాదాపు లక్ష రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రారంభించింది. ఇందులో 97 వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తంలో ముఖ్యమైనది కొల్లూరు టౌన్‌షిప్‌. పఠాన్‌చెరుకు సమీపంలోని రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూరులో 124 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికోసం వినియోగిస్తున్నారు. రూ.1354 కోట్లను వ్యయం చేస్తున్నారు. 117 అపార్టుమెంట్‌ బ్లాకులుగా 11అంతస్తులుగా వీటి నిర్మాణం చేపట్టారు. దాదాపుగా నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. వచ్చే డిసెంబరు చివరి నాటికి లబ్ధిదారులకు వీటిని అందజేయాలని నిర్ణయించారు. 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే రెండు పడకల గదులకు రూ.7.90 లక్షలను వ్యయం చేస్తున్నారు. మరో రూ.75 వేలను ఇక్కడ మౌలిక సదుపాయల కల్పనకు వ్యయం చేయబోతున్నారు. అధిక భాగం రాష్ట్రప్రభుత్వం నిధులను వ్యయం చేస్తుండగా.. కేంద్రం కొంత ఆర్థిక తోడ్పాటునందిస్తోంది.

ఎన్నెన్నో సౌకర్యాలు
సాధారణంగా ప్రభుత్వం నిర్మించే గృహ నిర్మాణ కాలనీలు సరైన రోడ్లకు నోచుకోని పరిస్థితి ఉంటుంది. దీనికి భిన్నంగా ఇక్కడ 124 ఎకరాల విస్తీర్ణంలో అవసరమైన చోట్ల పూర్తిగా సిమెంట్‌ రోడ్లను నిర్మిస్తున్నారు. మురుగునీరు రోడ్లపైకి రాకుండా దోమల బాధ లేకుండా పూర్తి స్థాయిలో మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రూ.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా సీఈ కన్నా సురేష్‌ తెలిపారు. ఈ కాలనీల్లో లక్షల్లో మొక్కలు నాటి పచ్చనివనంగా మార్చి వీటికి శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని నిర్ణయించారు. ఇదేవిధంగా జలమండలి ఇక్కడ నివాసితులకు అందరికీ నిత్యం తాగునీరు అందేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. కాలనీ అంతటా మొత్తం ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఇళ్ల నుంచి చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఇక్కడి నుంచి బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్నో మున్సిపాలిటీగా మార్చే అవకాశం ఉంది.
  

సౌర విద్యుత్తు తయారీ యూనిట్‌

ఇక్కడ సౌర విద్యుత్తును ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ యూనిట్‌కు ఏర్పాటుకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని వేశాం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సౌర ప్లాంట్‌ను ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేస్తాం. ఈ టౌన్‌షిప్‌ భవిష్యత్తులో మున్సిపాలిటీగా మారే అవకాశం ఉండటంతో ఇక్కడ పలు పరిశ్రమలను నెలకొల్పే అవకాశం ఉంది. ఇందుకోసం భూసేకరణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కోరాం. దేశంలో మోడల్‌ టౌన్‌షిప్‌గా దీన్ని తయారు చేయనున్నాం. పూర్తిస్థాయి పర్యావరణహితంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని మార్చబోతున్నాం.

-ఎం.దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.