close

ప్ర‌త్యేక క‌థ‌నం

పరిశ్రమల్లో ఉపాధి ‘కరవు’

వట్టిపోయిన మంజీరా..
జలమండలి నీళ్లు నిలిపేయడంతో పెరిగిన కష్టాలు
ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి
ఉత్పత్తి తగ్గించుకుంటున్న యాజమాన్యాలు
సంగారెడ్డి జిల్లాలో నిత్యం ఉపాధి కోల్పోతున్న ఏడు వేల మంది కార్మికులు!

ఈనాడు, సంగారెడ్డి: మంజీరా నది వట్టిపోవడంతో పరిశ్రమలకు జలకష్టాలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలకు జలమండలి అధికారులు నీటి సరఫరాను ఫిబ్రవరి నెలాఖరునే నిలిపేశారు. ప్రత్యామ్నాయం చూపాలని కోరినా స్పందన లేకపోవడంతో యాజమాన్యాలు ప్రైవేటు ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కానీ, భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోవడంతో కొందామన్నా నీరు దొరకడం లేదు. తప్పని పరిస్థితిలో ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో ఆ ప్రభావం కార్మికుల ఉపాధిపై పడుతోంది.
సంగారెడ్డి జిల్లాలో 1,300లకుపైగా చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలున్నాయి. బీరు, శీతల పానీయాల తయారీ సంస్థలతోపాటు ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌, ఫార్మా పరిశ్రమలకు నిత్యం లక్షలాది లీటర్ల నీరు అవసరం ఉంటుంది. జలమండలి అధికారులు పూర్తిగా సరఫరా ఆపేయడంతో వీరు స్థానికంగా ఉన్న నీటి ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఒక లీటరు నీటికి జలమండలికి రూ.2.60 చెల్లించేవారు. ప్రస్తుతం ప్రైవేటు సరఫరాదారులకు లీటరుకు రూ.4 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నీళ్లను ప్రాసెసింగ్‌ చేసేందుకూ మళ్లీ అదనంగా ఖర్చు తప్పడం లేదు. దీంతో ఆయా సంస్థలు కొంతమేర ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయి. ‘మాకు నిత్యం అయిదు లక్షల లీటర్ల నీళ్లు కావాలి. ప్రైవేటు ట్యాంకర్లే దిక్కయ్యాయి. అయినా బోర్లు నడవడం లేదని చెబుతూ వాళ్లు కూడా కొన్ని ట్యాంకర్లే అందిస్తున్నారు. దీంతో ఉత్పత్తిని తగ్గించుకోక తప్పడం లేదు’’ అని కొండాపూర్‌ మండలంలోని ఒక బీరు తయారీ పరిశ్రమలో కొనుగోళ్ల బాధ్యతలను చూసే ఉద్యోగి వివరించారు.

వేలాది మంది ఉపాధిపై ప్రభావం
సంగారెడ్డి జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది కార్మికులు ఉంటారు. వీరు వివిధ పరిశ్రమల్లో తాత్కాలిక, ఒప్పంద పద్ధతిన పని చేస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన మేర నీళ్లు అందక ఉత్పత్తిని తగ్గిస్తుండటంతో ఏడు వేల మంది రోజువారీ ఉపాధిపై ప్రభావం పడుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బీరం మల్లేశం ఆందోళన వ్యక్తంచేశారు. కోహిర్‌ మండలంలోని ఓ ఫార్మా కంపెనీలో 1500 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇటీవల ఇక్కడ నీటి కష్టాలు తీవ్రమై ఉత్పత్తిని పూర్తిగా నిలిపేద్దామని యాజమాన్యం భావించింది. ఇదే జరిగితే కార్మికుల జీవనం కష్టమవుతుందని కార్మికసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నీటి కొరత కారణంగా పరిశ్రమలు మూతపడకుండా చూడాలని విన్నవించారు. సంగారెడ్డి సమీపంలోని ఒక శీతల పానీయాల సంస్థ ఒక లైన్‌ ఉత్పత్తిని కొన్ని రోజులుగా ఆపేసింది. దీంతో 50 మందికి పైగా కార్మికులకు పని లేకుండా పోయింది. ఇలా ప్రతి సంస్థలోనూ కనిష్ఠంగా 50 నుంచి గరిష్ఠంగా 200లకుపైగా మందికి పని దొరక్కుండా పోతోంది. మంజీరా అడుగంటిపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇలా కార్మికుల పొట్ట కొడుతున్నాయి.

నీటి తరలింపుతో..
మున్ముందు వానలు పడతాయని ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం సింగూరు నుంచి గత వర్షాకాలంలో 14.5 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలించింది. అనూహ్యంగా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరలేదు. పైగా ఉన్న నీరంతా మిషన్‌ భగీరథకు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు సరిపోయింది. ప్రస్తుతం సింగూరు పూర్తిగా అడుగంటింది. మంజీర ఎడారిని తలపిస్తోంది. జంట నగరాలకు, పరిశ్రమలకు, పరిశోధన సంస్థలకు సైతం నీటి సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.