close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సాయంలో జాప్యం

కరోనా నుంచి కోలుకున్న వారికి కొన్నిచోట్ల అందని రూ.2 వేలు
సమాచారం లేదని చెప్పి పంపిస్తున్న వైద్యులు
బాధితులకు కొరవడిన అవగాహన

కరోనా బారినపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జి అయిన బాధితులకు సర్కారు ప్రకటించిన ఆర్థికసాయం అందడంలో కొన్ని ప్రాంతాల్లో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల నగదుపై బాధితులు వైద్యాధికారులను అడిగితే ఎలాంటి సమాచారం లేదని వారికి చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తర్వాత జమ అవుతుందని చెబుతూ బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. 14 రోజులపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని డిశ్ఛార్జి అయిన వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2 వేల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.10 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇస్తూ మే నెల మొదటివారంలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో నగదు పంపిణీలో వారాల తరబడి జాప్యం జరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ వర్గాలను వివరణ కోరగా... జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని తెలిపాయి. బాధితులకు నగదు పంపిణీ జిల్లా అధికారుల పర్యవేక్షణలో  జరుగుతోందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

* ప్రకాశం జిల్లా దర్శి, మార్కాపురానికి చెందిన నలుగురు వ్యక్తులు కరోనా బారినపడి ఒంగోలు జీజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది వారం రోజుల కిత్రం డిశ్ఛార్జి అయ్యారు. ఒంగోలు క్వారంటైన్‌ కేంద్రం నుంచి రెండు రోజుల కింద ఒక వ్యక్తి, ఒంగోలు ఆసుపత్రి(రిమ్స్‌) నుంచి బుధవారం కొంత మంది డిశ్ఛార్జి అయ్యారు. వీరెవరికీ నగదు ఇవ్వలేదు. వారి వద్ద బ్యాంకు ఖాతాల వివరాలూ తీసుకోలేదు. దీనిపై ఆసుపత్రి వర్గాలను విచారిస్తే చెల్లింపుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అందని వారి వివరాలు తీసుకుని నగదు పంపిణీ చేస్తామని పేర్కొన్నాయి.
* విశాఖ జిల్లా పరిధిలో కరోనా బారినపడి ప్రభుత్వం నుంచి చికిత్స పొంది డిశ్ఛార్జి అయిన బాధితులకు గత కొన్ని రోజులుగా నగదు ఇవ్వడం లేదు. డిశ్ఛార్జి సమయంలో వైద్యులను అడిగితే సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని బాధితులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
* పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ముగ్గురు వ్యక్తులు భీమవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొంది వారం రోజుల క్రితం డిశ్ఛార్జి అయ్యారు. అదే పట్టణానికి చెందిన తల్లీకుమార్తెలు గత నెలలో ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందారు. వీరికీ ఇప్పటివరకు సాయం అందలేదు.
* నెల్లూరులోని వేదాయపాళెెంకు చెందిన ఓ వ్యక్తికి 10 రోజుల క్రితం పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజులపాటు చికిత్స అనంతరం కరోనా లక్షణాలు లేకపోవడంతో బాధితుని విజ్ఞప్తి మేరకు హోం క్వారంటైన్‌కు అనుమతిచ్చారు. ఇతనికి కూడా నగదు ఇవ్వలేదు.
* తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 673 మంది బాధితులకు నగదు అందించామని, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఇంకా 300 మందికి ఇవ్వాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

- ఈనాడు డిజిటల్‌, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.