close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పడి లేచిన కెరటం..

ఎక్కడ తగ్గాలో తెలిసిన నేర్పరి.. ఎప్పుడు నెగ్గాలో తెలిసిన గొప్ప నాయకుడు.. ప్రజల ఆకాంక్షలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు చట్టాలు అద్దం పట్టాలనే వాస్తవికవాది. మనసులోని మాటను ప్రైవేటుగా ఎప్పుడు చెప్పాలి? అందరికీ ఎప్పుడు బహిర్గతం చేయాలి? అని తెలిసిన మేధావి. వెరసి ప్రణబ్‌దా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. పిన్న వయసులోనే గొప్ప నాయకుడిగా ఎదిగి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. రాజకీయంగా మధ్యలో పతనం అంచుకు చేరారు. అయినా పడి లేచిన
కెరటంలా ఉన్నత స్థానాలను అధిరోహించారు.


ప్రణబ్‌దాకు రహస్య సమాచారం ఏమి చెప్పినా అది ఆయన పొట్టలోనే ఉండిపోతుంది. బయటకొచ్చేది    ఏమిటంటే సిగార్‌ పైప్‌ నుంచి పొగ మాత్రమే

- ప్రణబ్‌ గురించి ఇందిరాగాంధీ చెప్పిన మాటలివి.


నాయకత్వం వద్ద ఇంతటి నమ్మకాన్ని చూరగొన్నందునే తరాలు మారినా ఆయన కాంగ్రెస్‌లో అత్యంత కీలకనేతగా కొనసాగారు. రాజకీయంగా ఎన్నిసార్లు కిందపడ్డా మళ్లీ పైకి లేచారు. కీలక పదవులు సాధించారు. మధ్యలో రాజీవ్‌ ఆయన్ను దూరం పెట్టినా, పార్టీ నుంచి బహిష్కరించినా మళ్లీ పార్టీలోకి రాగలిగారంటే ఆయన నైపుణ్యాలేమిటో ఆర్థం చేసుకోవచ్చు. ఇందిర హయాంలో ప్రణబ్‌ ఎప్పుడూ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అయినా ఆమె ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పజెెప్పారు. తన గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్‌ అయిన ప్రణబ్‌కే  అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు.

రాజీవ్‌ దూరం పెట్టినా..
కాంగ్రెస్‌లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల తరాలను చూసి, అన్ని తరాల బరువునూ తన భజస్కందాలపై మోసిన గొప్ప రాజకీయ నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ. ముగ్గురు ప్రధానమంత్రులు- ఇందిరాగాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ వద్ద మంత్రిగా పని చేసిన అరుదైన ఘనత ప్రణబ్‌ది. సాధారణంగా ప్రధానమంత్రే లోక్‌సభా నేతగా ఉంటారు. ఆ పదవిలో లేకున్నా లోక్‌సభా నేతగా ఎనిమిదేళ్లపాటు ఉన్న అరుదైన ఘనత కూడా ఆయన సొంతం.

ఇందిరాగాంధీ హత్య అనంతర పరిణామాలు రాజీవ్‌గాంధీకి ప్రణబ్‌ను దూరం చేశాయి. ఇందిర హత్య సమయంలో రాజీవ్‌, ప్రణబ్‌ బెంగాల్లో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారు అని రాజీవ్‌.. ప్రణబ్‌ను అడిగితే అత్యంత సీనియర్‌ మంత్రి ఆ బాధ్యతలు చేపడతారని, నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్‌ అన్నట్లు చెబుతారు. అప్పటికి ప్రణబ్‌ముఖర్జీయే సీనియర్‌ మంత్రి. అయితే ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యలు రాజీవ్‌గాంధీకి ఆగ్రహం తెప్పించాయి. 1984లో రాజీవ్‌ ప్రధాని అయ్యాక ప్రణబ్‌ను దూరం పెట్టారు. మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నుంచి తొలగించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచే బహిష్కరించారు. దాంతో ప్రణబ్‌ రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం సాగే బెంగాల్‌లో సొంత పార్టీని నడపడం అంత సులభం కాదని తెలుసుకున్న ఆయన మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరై 1989లో తన పార్టీని మాతృసంస్థలో కలిపి రాజీవ్‌గాంధీతో రాజీ కుదుర్చుకున్నారు.

ఇందిరాగాంధీ రాజకీయ వారసుడిగా చెప్పుకొని ఒకసారి రాజకీయ మూల్యం చెల్లించుకున్న ఆయన తర్వాత అలాంటి వ్యవహారాల జోలికి వెళ్లలేదు. గాంధీ కుటుంబానికి విశ్వాసంగా ఉంటూ వారికి కష్టసుఖాల్లో అండగా ఉండే ఆప్తుడయ్యారు.

అణుఒప్పందంలో కీలక పాత్ర
విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ కార్యకలాపాలు స్తంభించినప్పుడు ఎన్నో సార్లు వారితో మాట్లాడి రాజీకి ఒప్పించిన నేర్పరి ప్రణబ్‌దా. తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే వంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలతో తలనొప్పులు వచ్చినప్పుడూ ఆయనే మధ్యవర్తి. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం. అయితే అమెరికాతో చేతులు కలపడం వామపక్షాలకు ఇష్టం లేదు. యూపీఏకు సాధారణ మెజార్టీ లేదు. ప్రభుత్వ మనుగడకు వామపక్ష కూటమి మద్దతు కీలకం. దీంతో ప్రభుత్వం ప్రణబ్‌ను రంగంలోకి దించింది. ప్రణబ్‌ నేతృత్వంలో యూపీఏ, వామపక్ష కూటమి మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయన వారితో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వారు మద్దతును ఉప సంహరించుకున్నారు. అయినా ప్రణబ్‌ ఆ ఒప్పందం కుదర్చటంలో కీలక పాత్ర పోషించారు. 2010లో పౌర అణు బాధ్యత బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడానికీ ప్రణబ్‌ నైపుణ్యాలే కారణం. లోక్‌సభానేతగా ఆయన తన కార్యాలయంలో విపక్ష నేతలతో భేటీ అయ్యి చర్చలు జరిపి వారిని ఒప్పించారు. ఆయన కృషితోనే ఈ బిల్లు పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.


ప్రధాని పదవికి తగినవారు..

రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్‌ కీలక పదవులెన్నో నిర్వహించినా ఒక లోటు మాత్రం ఉండిపోయింది. ప్రధానమంత్రి పదవి మాత్రం చేపట్టలేకపోయారు. ఆ పదవి చేపట్టాలన్న ఆకాంక్ష తనకు ఉన్నట్లు తాను రాసిన పుస్తం ‘ది కోలిషన్‌ ఇయర్స్‌’లో ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. ‘‘సోనియాగాంధీ నిరాకరించడంతో నేనే ప్రధానిని అవుతానన్నది అప్పట్లో అందరి అంచనా. చివరకు ఆమె మన్మోహన్‌ పేరును సూచించారు. ఆయన అంగీకరించారు.’’ అని ఆ పుస్తకంలో రాశారు.


‘‘సోనియాగాంధీ 2004లో నన్ను ప్రధానిగా ఎంచుకున్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ నిరుత్సాహపడటం సబబే. అందుకు సముచిత కారణం కూడా ఉంది. పార్టీలో ప్రణబ్‌ నాకన్నా సీనియర్‌. ఆ పదవికి అన్నివిధాలా ఆయన తగినవారు కూడా. అయితే ఆ నిర్ణయం తీసుకోవడంలో నాకెలాంటి ప్రమేయం లేదని, నాకు మరో మార్గం కూడా లేదని ప్రణబ్‌కు తెలుసు. నాకు ప్రధాని పదవి వచ్చినా ఆ ప్రభావం ఏనాడూ మా ఇద్దరిపై పడలేదు.’’

- మన్మోహన్‌ సింగ్‌
(2017 అక్టోబరులో - సంకీర్ణ   సంవత్సరాలపై ప్రణబ్‌ ముఖర్జీ రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా..)


బెంగాలీ ఆంగ్లం..

ప్రణబ్‌.. తన బెంగాలీ యాస పట్ల గర్వంగా ఉండేవారు. ఆయన ఆంగ్లాన్నీ అదే యాసలో మాట్లాడేవారు. ఒకసారి ఇందిరాగాంధీ ‘‘మీరు ఆంగ్లం ఉచ్చారణ మెరుగుపర్చుకునేందుకు ట్యూటర్‌ను పెట్టుకోండి.’’ అని అన్నారట. దీన్ని తిరస్కరిస్తూ ఆయన తనకు బెంగాలీ యాసే సౌకర్యంగా ఉందని చెప్పారట.


లోక్‌సభ స్థానాలు పెంచాలి

ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యతో ప్రజలకు న్యాయం జరగదని ప్రణబ్‌ గట్టిగా భావించేవారు. 16 లక్షల నుంచి 18 లక్షల మందికి ఒక లోక్‌సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇంతమంది జనాభాకు ఒకరే ప్రాతినిధ్యం వహిస్తే ఓటర్లకు ఎలా అందుబాటులో ఉండగలుగుతారని ఆయన ఒక సందర్భంగా ప్రశ్నించారు. ‘‘1971లో భారత జనాభా 55 కోట్లు. ఆ లెక్కల ఆధారంగానే 1977లో చివరిసారిగా లోక్‌సభ స్థానాలను పునర్‌వ్యవస్థీకరించారు. అప్పటి నుంచి ఇప్పటికి జనాభా రెట్టింపు కన్నా ఎక్కువయింది. అందువల్ల మళ్లీ పునర్‌వ్యవస్థీకరించి వెయ్యి స్థానాలకు పెంచాలి.’’ అని ఆయన గట్టిగా సూచించారు.


లక్కీ నం. 13

ప్రణబ్‌ అదృష్ట సంఖ్య 13 అని చెబుతుంటారు. కాకతాళీయంగా ఆయన దేశానికి 13వ రాష్ట్రపతి అయ్యారు. దశాబ్దాల తరబడి ఆయన 13వ నంబరు బంగ్లాలోనే ఉండేవారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.