మృత్యు వారధులు
మృత్యు వారధులు

వంతెనలు, చప్టాలు, కాజ్‌వేలపై నీటి గండాలు
నిర్వహణలో నిర్లక్ష్యం... రక్షణ ఏర్పాట్లు శూన్యం
‘ఈనాడు’ పరిశీలనలో వెలుగుచూసిన లోపాలు
ఈనాడు - హైదరాబాద్‌

నీటి గండాలు దాటేందుకు నిర్మించిన వంతెనలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. తక్కువ ఎత్తులో ఉండే దిగువ (లో లెవెల్‌) వంతెనలపై ప్రవహించే వర్షపు నీటి రూపంలో మృత్యువు కబళిస్తోంది. ఎక్కడా హెచ్చరికల వ్యవస్థ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అయిదు సంఘటనల్లోనూ ఇదే లోపం కనిపిస్తోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువుల మత్తడి కింద ఉన్న మార్గాల్లో ఒక్కసారిగా ప్రవాహం పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో లో లెవెల్‌ వంతెనలున్నాయి. వాటి వద్ద అప్రమత్తం చేసే బోర్డులు లేవు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ‘ఈనాడు’ పరిశీలించగా, అనేక లోపాలు వెలుగుచూశాయి.


రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగుపై ఈ వంతెన ప్రమాదకరంగా ఉంది. ఆదివారం వరదకు కారు కొట్టుకుపోయిన సంఘటనలో దివ్యాంగుడు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల కిందట కూడా ఒకరు నీటిలో కొట్టుకుపోయారు. ఇక్కడ కూడా రక్షణ గోడలు, ప్రమాద సూచికలు లేవు. దగ్గరికి వచ్చేవరకు అక్కడ వంతెన ఉందని తెలిపే బోర్డు కూడా లేదు.


వంతెనలపై ప్రమాదవశాత్తు జారిపోతే నిలదొక్కుకునేందుకు ఊతమేదీ ఉండదు. ప్రధాన వంతెనల వద్ద మాత్రమే రక్షణ గోడలు, పిల్లర్లు కనిపిస్తున్నాయి. వాటి నిర్వహణ కూడా అంతంతమాత్రమే. దిగువ వంతెనల నిర్వహణ దిగదుడుపుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని రహదారుల్లో ఇలాంటి వంతెనలు ఉన్నాయి. చప్టాలు, కల్వర్టులు కూడా ప్రమాదకర స్థితిలో కనిపిస్తున్నాయి. పాత వంతెనల నిర్వహణను పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు అడ్డాలుగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరుపై ఉన్న లో లెవెల్‌ వంతెనపైనా నీటిమట్టాన్ని తెలిపే సూచికలు లేవు. ఇరువైపులా రక్షణ నిర్మాణాలు లేవు. ఇక్కడ సోమవారం బస్సు వంతెన చివరికి జారి నిలిచిపోయిన విషయం తెలిసిందే.


యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వాగుపై ఉన్న లోలెవెల్‌ వంతెన ఇది. ఇక్కడ సోమవారం ఇద్దరు యువతులు నీటిలో కొట్టుకుపోయారు. ప్రవాహాన్ని అంచనా వేయలేక ద్విచక్ర వాహనంపై వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఇదే మార్గంలో పారుపల్లి వద్ద కూడా ఇలాంటి వంతెన ఉంది. వీటి వద్ద ఎక్కడా సూచికలు లేవు.


చెరువుల కింద ప్రమాదకర స్థితి
చెరువుల దిగువన ఉన్న రహదారుల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వరదనీటితో మత్తడి ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు, పాదచారులు కొట్టుకుపోతున్నారు. రెండు నెలల కిందట నర్సంపేట శివారులో చెరువు మత్తడి ధాటికి ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.


చెరువు మత్తడికి పక్కనే ఉన్న దిగువ వంతెన ఇది. ఇక్కడే ఆదివారం రాత్రి కారు కొట్టుకుపోయింది. నవ వధువుతో సహా ముగ్గురి ప్రాణాలు నీటిలో కలిశాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగు ఉద్ధృతిని అంచనా వేయలేకపోవడంతో ప్రాణనష్టం సంభవించింది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు, పిల్లర్లు, సూచికలు లేవు.


ఈ చర్యలు తప్పనిసరి
చప్టా, లోలెవెల్‌, హై లెవెల్‌ వంతెన సమీపిస్తుండగానే దాన్ని సూచించే బోర్డులుండాలి.
ఇరువైపులా హద్దుల సూచికలుండాలి.
ప్రవాహం ఉద్ధృతంగా వస్తే... నీటి మట్టాన్ని సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలి.
తూములుంటే వాటిలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి.
చెరువుల దిగువన ఉండే చప్టాల వద్ద హెచ్చరికల బోర్డులుండాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని