close
Updated : 14/06/2021 20:52 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆర్థిక విషయాల్లో ఇలా అవగాహన కల్పిస్తోంది!

Photos: Instagram

‘మహిళలకు ఆర్థిక విషయాల్లో అవగాహన అంతంత మాత్రమే.. అందుకే వీటికి ఆమడదూరంలో ఉంటారు..’ అనేది చాలామంది భావన. కానీ ముంబయికి చెందిన షగున్‌ భన్సాలీ మెహతా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ చూస్తే ఆ పేజీ నిండా ఆర్థికపరమైన అంశాలే దర్శనమిస్తాయి. అలాగని ఆమె ఆర్థిక రంగ నిపుణురాలు కాదు.. మరి, మనమంతా కష్టం అనుకునే ఆర్థిక విషయాలన్నీ తనకెలా తెలిశాయి? ఇదే ప్రశ్న తనని అడిగితే.. అవసరం, తెలుసుకోవాలన్న తపన ఉంటే ఏదైనా సాధ్యమే అంటోందామె. అంతేకాదు.. ఈ దిశగా ఓ స్టార్టప్‌ ప్రారంభించి.. మహిళలందరికీ ఆర్థిక విషయాల్లో అవగాహన కల్పిస్తోంది షగున్‌.. ఈ వేదికగా వారి ఆర్థిక సందేహాలను తీరుస్తోంది. ఒకప్పుడు తన సంపాదన పొదుపు చేయడానికి కూడా తన తండ్రిపై ఆధారపడిన ఆమె.. ఇప్పుడు ఈ విషయంలో ఓ స్టార్టప్‌నే ప్రారంభించే స్థాయికి ఎలా ఎదిగింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..
‘పొదుపు-మదుపు, పెట్టుబడులు, బీమా, ఫైనాన్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక రంగం మహాసముద్రమంత పెద్దది.. లోతైనది! ‘ఇక వీటి గురించి తెలుసుకుందామన్నా ఓ పట్టాన అర్థం కావు.. అలాంటప్పుడు తెలుసుకొని ప్రయోజనమేముంది’ అనుకునే ఆడవారూ లేకపోలేదు. అందుకే ఆర్థిక విషయాల్లో మహిళలకు అవగాహన అంతంత మాత్రమే అనే ముద్ర మన మీద పడిపోయింది. ఇక సంపాదించిన డబ్బును మంచి పథకాల్లో పొదుపు చేయడమెలాగో అవగాహన లేని చాలామంది మహిళలు ఈ విషయంలో తమ తండ్రులు, భర్తలపై ఆధారపడుతుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు నా పరిస్థితీ ఇదే!


జీతమంతా నాన్నకిచ్చేదాన్ని!
చదువు పూర్తి చేసుకొని పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్‌గా స్థిరపడిన తర్వాత నాకొచ్చిన మొత్తం జీతాన్ని మా నాన్నకే ఇచ్చేసేదాన్ని. ఎందుకంటే దాన్ని ఎందులో పెట్టుబడి పెట్టాలి? ఏది మంచి పొదుపు పథకం? వంటి విషయాలపై నాకు అసలు అవగాహన లేదు. వీటి గురించి స్నేహితుల దగ్గర తెలుసుకుందామని వారిని అడిగినా వారూ పూర్తి అవగాహన లేదనే చెప్పేవారు. దీంతో నెలాఖరు వచ్చేసరికి అసలు నా సంపాదనంతా ఏమవుతోంది? దేనికెంత ఖర్చు పెట్టాను? అన్న సందేహాలు వచ్చేవి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మా కంపెనీలో వివిధ విభాగాల్లో పని చేసే అవకాశం వచ్చింది. ఫలితంగా ఆర్థిక పరంగా చాలా విషయాలు తెలుసుకోగలిగా. దానికి తోడు ఎలాగైనా ఆర్థిక అంశాల్లో అవగాహన పెంచుకోవాలన్న నా తపనే నన్ను ఈ విషయాలు నేర్చుకునేలా చేసింది.
కష్టం వెనక ఆలోచన!
బడ్జెట్‌, పొదుపు-మదుపు, పెట్టుబడులు.. ఒక్కొక్కటిగా వీటన్నింటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. అయితే ఆయా విషయాల్ని అర్థం చేసుకోవడం కఠినంగా, కష్టంగా అనిపించేది. అప్పుడప్పుడూ బోర్‌ కొట్టేది కూడా! అప్పుడనుకున్నా.. ఆర్థిక అంశాల గురించి సులభంగా చెప్పగలిగితే బాగుంటుందని! అయితే చాలామంది మహిళలకు ఈ విషయాల్లో పూర్తి పరిజ్ఞానం లేదనే చెప్పాలి. అందుకే వారినే నా టార్గెట్‌ గ్రూప్‌గా ఎంచుకున్నా. ఈ ఆలోచనే ‘మిస్‌ పిగ్గీ బ్యాంక్స్‌’ అనే స్టార్టప్‌కు ఊపిరి పోసింది. గతేడాది జూన్‌లో ప్రారంభమైన ఈ వేదిక.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహిళా వినియోగదారులకు అందుబాటులోకొచ్చింది. ఈ క్రమంలో బ్లాగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ వేదికలుగా మహిళల్ని ఆర్థికంగా అక్షరాస్యుల్ని చేయడం, వారి ఆర్థిక సందేహాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ఇందుకోసం మా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నా.. తను కూడా ఆర్థిక విశ్లేషకులే!’ అంటూ తన జర్నీని పంచుకుంది షగున్.


సూటిగా.. సరళంగా!
ప్రస్తుతం తన ఇన్‌స్టా వేదికగా.. డబ్బు నిర్వహణ, పెట్టుబడులు, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వివిధ కంపెనీలు అందిస్తోన్న వైద్య బీమా సదుపాయాలు, ఆర్థిక విషయాల్లో మహిళలకు ఉండే అపోహలు.. వంటి ఎన్నో అంశాలపై సరళంగా, స్పష్టంగా పోస్టులు పెడుతూ మహిళలందరిలో అవగాహన నింపుతున్నారు షగున్‌. ఇక తన వెబ్‌సైట్‌ విషయానికొస్తే.. ఆర్థికంగా ఆయా విషయాల్లో అపార అనుభవం ఉన్న కొంతమంది నిపుణుల్ని ఎంపిక చేసుకొని.. వారి ద్వారా మహిళా వినియోగదారుల సందేహాలు తీర్చుతున్నారామె. ఇక ఈ నిపుణుల్లో ఎక్కువ శాతం మంది మహిళలే కావడం విశేషం. ఈ క్రమంలో తన వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకునే ఒక్కో మహిళ మూడు నెలలకు గాను రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుందని, ఆపై గడువు పూర్తయ్యాక తిరిగి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుందంటున్నారామె.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని