close

తాజా వార్తలు

స్థానిక అభ్యర్థినే ఎన్నుకోండి: సీతారామన్‌

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు నిర్మలా సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, వయనాడ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఓడించాలని, స్థానిక అభ్యర్థినే ఎన్నుకోవాలని ఆమె ప్రజలను కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వయనాడ్‌లో ఎన్డీఏ నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గతేడాది కేరళలో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. సమయానికి డ్యామ్‌లను తెరచి పరిస్థితులను అధిగమించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒకవేళ వారు ఈ పనిచేసి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదు. లోక్‌సభ ఎన్నికల్లో బీడీజేఎస్‌ అభ్యర్థి తుశార్‌ను గెలిపించండి. ఈ నియోజక వర్గానికి దిల్లీ నుంచి విమానంలో వచ్చి వెళ్లేవారు ప్రజలకు వద్దనే సంకేతాన్ని ఇవ్వండి’ అని వ్యాఖ్యానించారు.

కాగా, వయనాడ్‌లో కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, ఎన్డీఏ నుంచి బీడీజేఎస్‌ నేత తుశార్‌ వెల్లపల్లి, సీపీఐ నుంచి పీపీ సునీర్‌ పోటీకి దిగుతున్నారు. కేరళలోని 20 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ‌ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాహుల్ వయనాడ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తమ కూటమి తరఫున పోటికి దిగుతున్న బీడీజేఎస్‌ అభ్యర్థి కోసం భాజపా నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.      

 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net