close

తాజా వార్తలు

భాజపాలో చేరిన సన్నీ దేవోల్‌

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సన్నీదేవోల్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో మంగళవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘‘ అటల్‌జీ హయాంలో నా తండ్రి(ధర్మేంద్ర) పని చేసిన తరహాలోనే నేను మోదీ నేతృత్వంలో పనిచేస్తాను. పార్టీకి నేను చేయగలిగినంత సేవ చేయాలనుకుంటున్నాను. పనితో నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను, మాటలతో కాదు’’ అని వ్యాఖ్యానించారు. 

సన్నీ దేవోల్‌తో ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ ఆయన ఈరోజు పార్టీలో చేరారు. ఆయన్ని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపనున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం చండీగఢ్‌ లేదా గురుదాస్‌పూర్‌ నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అకాళీదళ్ 10 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా మూడు సీట్లలో అభ్యర్థులను బరిలో నిలపనుంది.  సన్నీ దేవోల్‌ తండ్రి ప్రముఖ నటుడు ధర్మేంద్ర 2004లో రాజస్థాన్‌లోని బికనేర్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net